‘మమ్మల్ని కెలకొద్దు’.. లెబనాన్ ప్రధాని సీరియస్‌ వార్నింగ్‌! | Irresponsible and Suspicious: Lebanon PM Nawaf Salam | Sakshi
Sakshi News home page

‘మమ్మల్ని కెలకొద్దు’.. లెబనాన్ ప్రధాని సీరియస్‌ వార్నింగ్‌!

Mar 2 2026 8:40 AM | Updated on Mar 2 2026 8:46 AM

Irresponsible and Suspicious: Lebanon PM Nawaf Salam

బేరూత్: ఇజ్రాయెల్‌పై హెజ్బుల్లా జరిపిన రాకెట్ దాడులపై లెబనాన్ ప్రధాని నవాఫ్ సలామ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాడు ఆయన ఈ  ఘటనపై స్పందిస్తూ.. హెజ్బుల్లా చర్యలు బాధ్యతారహితమైనవని,అనుమానాస్పదమైనవని అన్నారు. ఇటువంటి విచక్షణారహిత దాడులు తమ దేశాన్ని ప్రాంతీయ యుద్ధంలోకి నెట్టే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఇరాన్ అగ్రనేత ఖమేనీ మృతికి ప్రతీకారంగా, ఇజ్రాయెల్ సైనిక చర్యలకు ప్రతిస్పందనగా హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థ పెద్ద ఎత్తున రాకెట్లు, డ్రోన్లతో లెబనాన్‌పై విరుచుకుపడిన దరిమిలా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
 

ఇరాన్‌ మద్దతు కలిగిన హెజ్బుల్లా.. లెబనాన్ భద్రతను, సుస్థిరతను ప్రమాదంలో పడేస్తోందని ప్రధాని నవాఫ్ సలామ్ ఆవేదన వ్యక్తం చేశారు. హెజ్బుల్లా చేస్తున్న ఇటువంటి దాడులు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ తన దురాక్రమణను కొనసాగించడానికి  అవకాశం కల్పిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్లోకి తమ దేశాన్ని లాగడాన్ని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.

దేశ ప్రజల రక్షణే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని, ఇటువంటి ‘కొత్త సాహసాల’కు దేశం బలికాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన  అన్నారు. ఈ దాడులకు పాల్పడిన వారిని గుర్తించి, కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. మరోవైపు హెజ్బుల్లా దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) లెబనాన్‌పై భారీ స్థాయిలో విరుచుకుపడ్డాయి. లెబనాన్ భూభాగంలోని హెజ్బుల్లా మౌలిక సదుపాయాలు, రాకెట్ ప్రయోగ కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. ప్రధాని సలామ్ శాంతిని కాపాడాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పెరుగుతున్న ఉద్రిక్తతలు లెబనాన్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: విప్లవ వీరుడి నుంచి.. క్షిపణి జ్వాలల వరకు..

Advertisement
 
Advertisement
Advertisement