
ఒక్కరోజు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సూర్య జుగ్రూంగ్‌రియాంగ్‌కిట్
థాయిలాండ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం
బ్యాంకాక్: 1999వ సంవత్సరంలో విడుదలై సంచలన విజయం సాధించిన హీరో అర్జున్ సినిమా ‘ఒకే ఒక్కడు’ గుర్తుండే ఉంటుంది. ముఖ్యమంత్రి పాత్రధారి రఘువరన్ దమ్ముంటే ఒక్కరోజు సీఎంగా పరిపాలించి చూడు ఆ కష్టమేంటో తెలుస్తుంది అంటూ కథానాయకుడికి సవాల్ విసరడం, సవాల్‌ను అంతేవేగంగా స్వీకరించి అర్జున్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొని మెరుపువేగంతో పరిపాలనను చక్కదిద్దడం సినిమాలో చూశాం.
సినిమాలో మాత్రమే సాధ్యమయ్యే ఈ అనూహ్య ఘటనకు ఇప్పుడు థాయిలాండ్ రాజకీయం వేదికైంది. కాంబోడియా ప్రధాని హున్‌సేన్‌తో ఫోన్ సంభాషణలో అతివినయం ప్రదర్శిస్తూ సొంత దేశ సైన్యాన్నే కించపరిచారంటూ ఆరోపణలు రావడంతో థాయిలాండ్ యువ మహిళా ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రను మంగళవారం దేశ రాజ్యాంగ న్యాయస్థానం సస్పెండ్‌చేసింది. దీంతో ప్రధాని పీఠం ఖాళీ అయింది.
రాజకీయ సంక్షోభం తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో అధికార పార్టీ వెంటనే రవాణా మంత్రి సూర్య జుగ్రూంగ్‌రియాంగ్‌కిట్‌ను ప్రధానిగా ప్రకటించింది. అయితే ఆయన కేవలం 24 గంటలపాటు మాత్రమే ప్రధానమంత్రి హోదా లో కొనసాగుతారని స్పష్టంచేసింది. దీంతో ఒక్క రోజు ప్రధాని అంశం మంగళవారం యావత్ థాయిలాండ్‌లో చర్చనీయాంశమైంది.
ఒక్కరోజు లో కొత్త ప్రధాని ఏమేం బాధ్యతలు నెరవేర్చుతారు?. ఎలాంటి విధానపర నిర్ణయాలు తీసుకుంటారనే చర్చ మొదలైంది. ఈ విస్తృత చర్చల నడుమే సూర్య బుధవారం ఉదయం ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. ఇప్పటికే ఉపప్రధాని బాధ్యతలు నిర్వహిస్తున్న సూర్యకు ఇప్పుడీ ప్రధాని బాధ్యతలు అదనం. బుధవారం బ్యాంకాక్ నగరంలో ప్రధాని కార్యాలయ 93వ వార్షికోత్సవంలో సూర్య పాల్గొని తొలి అధికార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కనీసం 93 గంటలుకూడా ప్రధాని కార్యాలయంలో గడిపే అవకాశంలేని నేత ఏకంగా ప్రధాని కార్యాలయ 93వ వార్షికోత్సవాన్ని ప్రారంభించారని విపక్ష పార్టీలు ఎద్దేవాచేశాయి. 24 గంటల్లో వ్యవస్థలోని అవినీతినంతా ఈయన ప్రక్షాళన చేస్తాడా అంటూ విమర్శలు గుప్పించారు.