
డాలస్, టెక్సస్, అమెరికా: ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” ప్రతి నెలా ఆఖరి ఆదివారం (5 సంవత్సరాలకు పైగా) నిర్వహిస్తున్న సాహిత్య కార్యక్రమాలలో భాగంగా ఆదివారం నిర్వహించిన 81వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “సాహిత్యంలో హాస్యం-అలనాటి విశిష్ట రచయితల హాస్యరచనా వైభవం” (గురజాడ, భానుమతి, మొక్కపాటి, ముళ్ళపూడి, చిలకమర్తి, భమిడిపాటి, శ్రీరమణ) ఆద్యంతం నవ్వుల జల్లులు కురిపించింది.
తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న అతిథులందరికీ స్వాగతం పలుకుతూ - మనకున్న తెలుగు సాహితీవేత్తలలో కొంతమంది విశిష్టరచయితలు సృష్టించిన హాస్య సాహిత్యవైభవాన్ని ఈ రోజు ఈ వేదికమీద చర్చించుకోవడం ముదావహం అంటూ శుభాకాంక్షలుతెల్పి, అందరికీ ఆత్మీయఆహ్వానం పలికారు.
తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ”హాస్యంకోసం హాస్యరచనలు చేసినవారు కొందరైతే, ఆనాటి వాస్తవ సాంఘిక, సామాజిక సమస్యల ఇతివృత్తంగా కొంతమంది చేసిన రచనలు సహజంగా హాస్యాన్ని సృష్టించాయి. రచనలతో హాస్యం పండించడం, పాఠకుల్ని మెప్పించడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. అలాంటి దాన్ని అలవోకగా సాధించిన రచయితలలో కొంతమందిని ఎంపికచేసుకుని వారి రచనావైభవాన్ని మననం చేసుకోవడం, వారిని స్మరించుకోవడం చాలా సబబుగా ఉంది అన్నారు.”
విశిష్ట అతిథులుగాపాల్గొన్న - ఆచార్య డా. చుండూరి మృణాళిని, ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త, వక్త à గురజాడ అప్పారావు (రచయిత, సంఘ సంస్కర్త, హేతువాది, అభ్యుదయ కవి) గురించి; పొత్తూరి విజయలక్ష్మి, ప్రముఖ హాస్యకథా రచయిత్రి, నవలా రచయిత్రి భానుమతీ రామకృష్ణ (రచయిత్రి, నటి, నిర్మాత, దర్శకురాలు, గాయని, సంగీత దర్శకురాలు) గురించి; డా. కొచ్చెర్లకోట జగదీశ్, ప్రముఖ రచయిత à మొక్కపాటి నరసింహశాస్త్రి (ప్రముఖ హాస్యరచయిత) గురించి; యర్రంశెట్టి శాయి, ప్రసిధ్ధ తెలుగు కథా, నవలా రచయిత à ముళ్ళపూడి వెంకటరమణ (ప్రముఖ సినీ కథా రచయిత, హాస్య కథా, నవలా రచయిత) గురించి; కూచి, ప్రముఖ చిత్రకారుడు, హాస్య రచయిత à చిలకమర్తి లక్ష్మీనరసింహం (సుప్రసిద్ధ కవి, రచయిత, నాటకకర్త, సంఘసంస్కర్త) గురించి; డా. చిట్టెన్ రాజు వంగూరి, ప్రముఖ నాటకకర్త, రచయిత, నటుడు à భమిడిపాటి కామేశ్వరరావు (హాస్యబ్రహ్మ, ప్రముఖ రచయిత, నటుడు, నాటకకర్త) గురించి; ఫణి డొక్కా, ప్రముఖ రచయిత, దర్శకుడు శ్రీ రమణ (ప్రముఖ వ్యంగ్య వ్యాస, కథా, నవలారచయిత)లు సృష్టించిన అసంఖ్యాక రచనలోని విశేషాలను, పాత్రల స్వభావాన్ని అద్భుతంగా ఆవిష్కరించి ఆద్యంతం నవ్వులు పూయించారు.హాస్యప్రధానంగా సాగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశిష్టఅతిథులకు, సహకరించిన ప్రసార మాధ్యమాలకు కృతజ్ఞతలు తెలియజేశారు తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్.
ఈ పూర్తి కార్యక్రమాన్ని క్రింది లంకెలో వీక్షించవచ్చును.
https://youtube.com/live/x9kzttV6B_w