పొలిటికల్ ఎంట్రీ తర్వాత దళపతి విజయ్ నటిస్తోన్న చిత్రం జన నాయగన్. రాజకీయాల్లోకి వచ్చేముందు ఈ మూవీనే తన కెరీర్లో చివరి సినిమా అని ప్రకటించారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ యాక్షన్ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించనుంది.
అయితే ఈ మూవీ కోసం మేకర్స్ భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను ఏకంగా విదేశాల్లో నిర్వహిస్తున్నారు. మలేసియాలో ఈ బిగ్ ఈవెంట్ జరగనుందని ఇప్పటికే వెల్లడించారు. ఈ ఆడియో లాంఛ్ కార్యక్రమానికి దాదాపు లక్షమంది ఫ్యాన్స్ హాజరవుతారని అంచనా. ఈ భారీ ఈవెంట్లో గిన్నిస్ రికార్డ్ కోసం నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లిడించారు.
తమ అభిమాన హీరో బిగ్ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఈవెంట్కు భారీ డిమాండ్ ఉండడంతో టిక్కెట్ల కోసం తీవ్రంగా పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కో టికెట్ ధర ఏకంగా రూ.2 లక్షల నుంచి రూ.6.5 లక్షల వరకు ఉండనుందని సమాచారం. ఈ టికెట్ బుకింగ్స్ నవంబర్ 28 నుంచి ప్రారంభమవుతాయని ఇప్పటికే నిర్వాహకులు ప్రకటించారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మలేషియాలోని బుకిట్ జలీల్ స్టేడియంలో డిసెంబర్ 27న ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ జరగనుంది.
ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్స్ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ ఈవెంట్లో సైంధవి, టిప్పు, అనురాధ శ్రీరామ్, ఆండ్రియా జెరెమా ఎస్.పి.బి. చరణ్, హరిచరణ్, హరీష్ రాఘవేంద్ర, యోగి బి, విజయ్ యేసుదాస్ పాల్గొంటున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఈ చిత్రంలో మమిత బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.


