
సాక్షి, హైదరాబాద్: ప్రతికూల వాతావరణం కారణంగా శంషాబాద్‌కు రావాల్సిన పలు విమాన సర్వీసులను అధికారులు దారి మళ్లించారు. ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పలు విమానాలను దారి మళ్లించారు. హైదరాబాద్‌కు రావాల్సిన విమానాలను బెంగళూరుకు తరలించారు. దీంతో, విమాన ప్రయాణీకులు ఆందోళనకు గురవుతున్నారు.
వివరాల ప్రకారం.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రావలసిన పలు విమానాలను దారి మళ్లించారు. వాతావరణం సరిగ్గా లేని కారణంగా హైదరాబాద్ రావాల్సిన మూడు విమానాలను బెంగుళూరు ఎయిర్ పోర్టుకు మళ్లించినట్టు అధికారులు తెలిపారు. ముంబై-హైదరాబాద్, వైజాగ్-హైదరాబాద్, జైపూర్-హైదరాబాద్, లక్నో నుంచి రావలసిన విమానాలు బెంగళూరులో ల్యాండ్ అయ్యాయి. మరికొన్ని విమానాలను విజయవాడకు దారి మళ్లించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే విమానాన్ని విజయవాడకు దారి మళ్లించారు. దీంతో, ప్రయాణీకులు కొంత ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తోంది.