ENG VS IND, 2nd Test: టీమిండియాను ఆదుకున్న కెప్టెన్‌ 'గిల్‌' సెంచరీ | England vs India, 2nd Test: Captain Gill supports Team India | Sakshi
Sakshi News home page

ENG VS IND, 2nd Test: టీమిండియాను ఆదుకున్న కెప్టెన్‌ 'గిల్‌' సెంచరీ

Jul 2 2025 11:14 PM | Updated on Jul 3 2025 7:16 AM

England vs India, 2nd Test: Captain Gill supports Team India

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య రెండో టెస్ట్‌ ఇవాళ (జులై 2) ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ మూడు మార్పులు చేయగా.. ఇంగ్లండ్‌ తొలి టెస్ట్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది.

భారత్‌ తరఫున బుమ్రా స్థానంలో ఆకాశ్‌దీప్‌.. సాయి సుదర్శన్‌ స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌.. శార్దూల్‌ ఠాకూర్‌ స్థానంలో నితీశ్‌ కుమార్‌ రెడ్డి తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.

తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న భారత్‌కు ఆదిలోనే భారీ షాక్‌ తగిలింది. ఇన్‌ ఫామ్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ 2 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. క్రిస్‌ వోక్స్‌ బౌలింగ్‌లో రాహుల్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

రాహుల్‌ తర్వాత బరిలోకి దిగిన కరుణ్‌ నాయర్‌ కూడా తక్కువ స్కోర్‌కే (31) ఔటయ్యాడు. కరుణ్‌ వికెట్‌ బ్రైడన్‌ కార్స్‌కు దక్కింది.‌ ఈ మధ్యలో యశస్వి జైస్వాల్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్‌కు టెస్ట్‌ల్లో ఇది 11వ అర్ద సెంచరీ. జైస్వాల్‌ తొలి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.

రాహుల్‌, కరుణ్‌ వికెట్లు కోల్పోయాక జాగ్రత్తగా ఆడిన జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌ మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. ఈ దశలో జైస్వాల్‌ (107 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 87 పరుగులు) ఓ అనవసర షాట్‌ ఆడి వికెట్‌ పారేసుకున్నాడు. బెన్‌ స్టోక్స్‌ బౌలింగ్‌లో కట్‌ షాట్‌ ఆడే ప్రయత్నం చేయగా బంతి బాటమ్‌ ఎడ్జ్‌ తీసుకొని వికెట్‌కీపర్‌ జేమీ స్మిత్‌ చేతుల్లోకి వెళ్లింది.

జైస్వాల్‌ ఔటయ్యాక శుభ్‌మన్‌ గిల్‌, రిషబ్‌ పంత్‌ కొద్ది సేపు జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 47 పరుగులు జోడించాక రిషబ్‌ పంత్‌ (25) షోయబ్‌ బషీర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. జాక్‌ క్రాలే అద్బుతమైన క్యాచ్‌ పట్టడంతో పంత్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన నితీశ్‌ కుమార్‌ రెడ్డి (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఇతని వికెట్‌ వోక్స్‌కు దక్కింది. వోక్స్‌ బౌలింగ్‌లో నితీశ్‌ క్లీన్‌ బౌల్ట్‌ అయ్యాడు.

211 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను గిల్‌, రవీంద్ర జడేజా గట్టెక్కించే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 99 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌లను కొనసాగిస్తున్నారు. గిల్‌ 114, రవీంద్ర జడేజా 41 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 85 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 310/5గా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement