
రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థిని ఆత్మహత్య
బాలిక మృతికి ప్రిన్సిపాల్, టీచర్లే కారణమంటూ
తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ఆందోళన
పరకాల: ఓ పదో తరగతి విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లక్‌పేట శివారులోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో సోమవారం జరిగింది. పరకాలకు చెందిన ఏకు ఈశ్వర్–నీల కుమార్తె శ్రీవాణి ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం బాత్రూమ్‌కు వెళ్లింది. చాలాసేపటి వరకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితురాళ్లు ప్రిన్సిపాల్ కృష్ణకుమారికి తెలిపారు. ఆమె వచ్చి బాత్రూం డోర్‌ను బలవంతంగా తీయడంతో శ్రీవాణి చున్నీతో ఉరివేసుకుని కనిపించింది.
వెంటనే ఆమెను పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. శ్రీవాణి బాత్రూంలో జారిపడిందని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన ఆస్పత్రికి వచ్చారు. అప్పటికే బాలిక చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు భోరుమని విలపించారు. తమ కుమార్తె చావుకు కారణం తెలపాలంటూ రెసిడెన్షియల్ ముందు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్ కృష్ణకుమారి, హౌజ్‌మాస్టర్ మీరాబాయి వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆత్మహత్యకు ఫొటోనే కారణమా..
వారం క్రితమే రెసిడెన్షియల్‌లో చేరిన శ్రీవాణి వద్ద ఓ ఫొటోను చూసిన హౌస్ టీచర్ బలవంతంగా లాక్కున్నట్లు తెలిసింది. తర్వాత విద్యార్థిని సదరు టీచర్ తాళం చెవి కనుక్కొని లాకర్ ఓపెన్ చేసి ఫొటో తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయగా.. విద్యార్థినుల సమక్షంలోనే శ్రీవాణిని నోటికి వచి్చనట్లు తిట్టి.. చావచ్చు కదా అన్నట్లు సమాచారం. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ప్రిన్సిపాల్ ఆటోలో విద్యారి్థని మృతదేహాన్ని తరలించడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకొని పరకాల పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.