హస్తం.. నవ ఉత్సాహం !
ఓరుగల్లులోని తొమ్మిది మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోకి..
హనుమకొండ జిల్లా పరకాల మున్సిపల్ కార్యాలయంలో
చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు హాజరైన సభ్యులు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్‌గా
సారంగపాణికి చేతులెత్తి మద్దతు తెలుపుతున్న కాంగ్రెస్ సభ్యులు
సాక్షిప్రతినిధి, వరంగల్ : తొమ్మిది మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగిరింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నోటిఫికేషన్ ప్రకారం సోమవారం ఉమ్మడి వరంగల్‌లో 12 మున్సిపాలిటీలకు ఎన్నికల ప్రక్రియ జరిగింది. ఇందులో హంగ్‌లో ఉన్న వర్ధన్నపేట, కేసముద్రం, మహబూబాబాద్‌తోపాటు పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్, మరిపెడ, ములుగును కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. డోర్నకల్‌లో స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ కౌన్సిలర్లు సకాలంలో ఎన్నికల కేంద్రానికి చేరని కారణంగా ఎన్నిక వాయిదా వేశారు. బీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ వచ్చినా తొర్రూరులో కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేల ఎక్స్‌అఫీషియో ఓట్లతో మెజార్టీ సరి సమానం కావడం... కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అక్కడి ఎన్నికనూ వాయిదా వేశారు. జనగామలో ఎన్నిక ప్రక్రియ మొదలైనప్పటినుంచే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇక్కడ కూడా రెండు పార్టీలకు సరిసమానమైన సీట్లు ఉండడం.. ఇతర కారణాలు చూపుతూ ఎన్నిక వాయిదా వేశారు. ఉమ్మడి వరంగల్‌లోని 12 మున్సిపాలిటీలకు తొమ్మిదింటికే ఎన్నికలు జరగ్గా.. ఆ మూడింటికి మంగళవారం (నేడు) ఎన్నికలు జరగనున్నాయి.
తొమ్మిది పురపాలికలపై కాంగ్రెస్ జెండా... కలిసొచ్చిన ‘ఎక్స్ అఫీషియో’..
కాంగ్రెస్‌కు ఏడు స్థానాల్లో స్పష్టమైన మెజార్టీ వచ్చినప్పటికీ ఎక్స్ అఫీషియో ఓట్లతో ఆ సంఖ్యను అధిగమించింది. కాగా, సోమవారం 9 మున్సిపాలిటీల్లో ఆ పార్టీ అభ్యర్థులు త్రివర్ణ జెండా ఎగురవేశారు. ములుగులో 20 వార్డులకు 12 గెలుచుకున్న కాంగ్రెస్ నుంచి చంద్రకళ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. నర్సంపేటలో 30 వార్డులకు 21 సొంతగా గెలుచుకున్న కాంగ్రెస్ పెండెం శ్రీలక్ష్మికి చైర్‌పర్సన్‌గా అవకాశమిచ్చింది. పరకాల నుంచి పావుశెట్టి సునీల్, మరిపెడలో ప్రగతి శ్రీపాల్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో తాటికొండ వినయ్‌కుమార్, భూపాలపల్లిలో బుర్ర కొమురయ్య కాంగ్రెస్ నుంచి చైర్మన్లుగా ఎన్నికయ్యారు. హంగ్‌గా ఉన్న మహబూబాబాద్, వర్ధన్నపేట, కేసముద్రంలో ఎక్స్‌అఫీషియో ఓట్లతో కాంగ్రెస్‌కు చెందిన గుగులోతు జ్యోతి, పాలకుర్తి సారంగపాణి, బానోతు సునీత చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
ఉద్రిక్తంగా సాగిన మున్సిపల్ ఎన్నికల తంతు
హంగ్‌లోని రెండింటినీ కై వసం చేసుకున్న కాంగ్రెస్
మొత్తం 9 పురపాలికలకు జరిగిన ఎన్నికలు..
తొర్రూరు, జనగామ, డోర్నకల్ ఎన్నికలు నేటికి వాయిదా..
డోర్నకల్‌లో స్పష్టమైన మెజార్టీ.. మరో రెండింటిపైనా హస్తం గురి?
సోమవారం జరగాల్సిన డోర్నకల్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక.. స్పష్టమైన మెజార్టీ ఉన్న వాయిదా పడింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ల విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం ఇతర కారణాల వల్ల కొందరు ఆ పార్టీ కౌన్సిలర్లు ఎన్నికలకు హాజరు కావడానికి విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వారు గైర్హాజరుగా కాగా, డోర్నకల్ ఎన్నిక వాయిదా పడినట్లు చెబుతున్నారు. కాగా, డోర్నకల్‌తో పాటు మంగళవారం జరిగే ఎన్నికల సందర్భంగా తొర్రూరు, జనగామను సైతం హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. సోమవారం తొర్రూరు, జనగామలో ఆద్యంతం మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ఉద్రిక్తంగా జరిగింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తొర్రూరు, జనగామలో కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారుల తీరుపై పలుమార్లు ఆందోళనకు దిగారు. ఒక దశలో లాఠీచార్జ్ కూడా జరిగింది. వీటన్నింటి నేపథ్యంలో చివరకు వాయిదా పడగా.. డోర్నకల్‌తో పాటు జనగామ, తొర్రూరును దక్కించుకునేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. బీఆర్‌ఎస్ అధిష్టానం సైతం ఈ విషయంలో సీరియస్‌గా ఉండడంతోపాటు హంగ్ మున్సిపాలిటీలు తొర్రూరు, జనగామకు ఇన్‌చార్జ్‌లను సోమవారం సాయంత్రం నియమించింది. తొర్రూరుకు ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనచారి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జనగామకు ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరించనున్నారు.
హస్తం.. నవ ఉత్సాహం !
హస్తం.. నవ ఉత్సాహం !


