కాళ్లరిగేలా తిరగాల్సిందేనా? | - | Sakshi
Sakshi News home page

కాళ్లరిగేలా తిరగాల్సిందేనా?

Feb 17 2026 9:04 AM | Updated on Feb 17 2026 9:04 AM

కాళ్లరిగేలా  తిరగాల్సిందేనా?

కాళ్లరిగేలా తిరగాల్సిందేనా?

కాళ్లరిగేలా తిరగాల్సిందేనా? ఫిర్యాదుల్లో కొన్ని..

వరంగల్‌ అర్బన్‌: ‘సమస్యల పరిష్కారం కోసం గ్రేటర్‌ గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు అందిస్తున్నాం. అవి పరిష్కారానికి నోచుకోవడం లేదు. వినతులివ్వడం.. బల్దియా కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరగడమేనా.. సమస్యలకు పరిష్కారం చూపరా’ అంటూ పలు కాలనీల ప్రజలు అధికారుల ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌ సెల్‌లో కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ వినతులు స్వీకరించారు. త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. గ్రీవెన్స్‌ సెల్‌కు మొత్తం 65 ఫిర్యాదులు రాగా, అందులో టౌన్‌ ప్లానింగ్‌ 33, ఇంజనీరింగ్‌ సెక్షన్‌కు 22, రెవెన్యూ విభాగానికి 4, హెల్త్‌ – శానిటేషన్‌ 2, నీటి సరఫరాకు 4 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌, సీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజారెడ్డి, డీఎఫ్‌ఓ శంకర్‌ లింగం, సీహెచ్‌ఓ రమేశ్‌, ఇన్‌చార్జ్‌ సిటీ ప్లానర్‌ రవీందర్‌ రాడేకర్‌, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, సమ్మయ్య, ఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

● లేబర్‌ కాలనీ–ఏనుమాముల మార్కెట్‌ నడిరోడ్డుపై ఉన్న పైపులైన్ల ద్వారా ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వాటిని అక్కడి నుంచి తరలించేలా చూడాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులు వినతి పత్రాన్ని అందించారు.

● ఉర్సు గ్రామ శివారులోని సర్వే నంబరు 210 బల్దియా ఖాళీ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని కాపాడాలని 42వ డివిజన్‌ వాసులు ఫిర్యాదు చేశారు.

● వెస్ట్‌సిటీ కాలనీలో పెండింగ్‌లో ఉన్న 1,200 మీటర్ల సీసీ రోడ్డును నిర్మించాలని కాలనీవాసులు కోరారు.

● 53వ డివిజన్‌ లష్కర్‌ సింగారంలో వీధిలైట్లు వెలగడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు.

● 1వ డివిజన్‌ శ్రీనివాస్‌ కాలనీలో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని 20 శాతం కంట్రీట్రిబ్యూషన్‌ నిధులు చెల్లించినట్లు కాలనీవాసులు విన్నవించారు.

● హనుమకొండ గాంధీనగర్‌ డ్రెయినేజీ నిర్మాణానికి అభివృద్ధి కమిటీ ప్రతినిధులు వినతి పత్రం అందించారు.

● 43వ డివిజన్‌ గాంధీనగర్‌లో సీసీ రోడ్డు, డ్రెయినేజీ, పోశాలవాడలో నిర్మించాలని కాలనీవాసులు వేర్వేరుగా కోరారు.

గ్రేటర్‌ గ్రీవెన్స్‌లో కాలనీవాసుల గోడు

దరఖాస్తులు స్వీకరించిన బల్దియా కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement