వేసవిలో నీటి ఎద్దడి తలెత్తొద్దు
● మేయర్ సుధారాణి, కమిషనర్ చాహత్
వరంగల్ అర్బన్: వేసవిని దృష్టిలో ఉంచుకుని మహానగర ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మేయర్ గుండు సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మేయర్, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి హనుమకొండ పరిధి వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా నీటి శుద్ధి ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నగరానికి ధర్మసాగర్ నుంచి నీటి సరఫరా జరుగుతున్నందున అక్కడి నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నీటి లభ్యతపై స్పష్టమైన అవగాహనతో చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అంతకుముందు వడ్డేపల్లి ప్రాంతంలోని జంక్షన్‌ను మేయర్, కమిషనర్ పరిశీలించారు. రహదారి రద్దీ సమస్యలను దష్టిలో ఉంచుకుని జంక్షన్ విస్తరణకు సంబంధించి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఎస్‌ఈ శ్రీనివాస్ రావు, ఈఈలు రవికుమార్, మాధవీలత, డీఈలు రాజ్‌కుమార్, సంతోశ్‌కుమార్ పాల్గొన్నారు.


