
సుపరిపాలన.. తొలి అడుగుకు దూరంగా భాగస్వాములు
సింగిల్‌గా టీడీపీ ఇంటింటి ప్రచారం
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనతో హనీమూన్ పీరియడ్ ముగిసింది. ఎన్నికలకు ముందు అందరూ కలిసికట్టుగా ఉన్నామన్నట్లుగా కలరింగ్ ఇచ్చి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు మూకుమ్మడిగా పోటీ చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. పవర్ చేతిలోకి వచ్చాక ఎవరి చేతికి ఎక్కువ పవర్ దక్కిందన్న విషయంలో పార్టనర్‌ల మధ్య విభేదాలు అప్పుడప్పుడు బయటపడుతున్నప్పటికీ అంతా గుంభనగా ఉన్నట్లుగా మ్యానేజ్ చేస్తూ వస్తున్నారు.
అన్నిటికి మించి పొత్తులకు ముందు ఓడ మల్లయ్య అని పిలిచే చంద్రబాబు ఎన్నికల్లో గెలిచాక బోడి మల్లయ్య అంటారన్న విషయం జనసేన, బీజేపీలకు మరో మరో అర్థమయింది. దీంతో ఇప్పుడు వాళ్లు నడి సముద్రంలో ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఓడలో నుంచి బయటకు రాలేక.. అందులోనే ప్రయాణం చేయలేక సతమతమవుతున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు కాంట్రాక్టర్లు ఇతరత్రా వ్యవహారాల్లో కూడా తెలుగుదేశం వాళ్ళు జనసేన, బీజేపీ నాయకులను కేవలం పెయిడ్ కూలీలుగా మాత్రమే భావిస్తూ ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదు.
నీకు ఇవ్వాల్సిన కూలి డబ్బులు ఇచ్చేసాంగా ఎవరి కోసం మా జెండా మోస్తారు అన్నట్లుగా తెలుగుదేశం నాయకులు తీరు ఉంది. ఇదే తరుణంలో ప్రభుత్వంలో చంద్రబాబుకు బదులుగా లోకేష్ పెత్తనం పెరిగిపోవడం బీజేపీ, జనసేన నాయకులను తొక్కేస్తూ కేవలం టీడీపీ వారికి ప్రాధాన్యం ఇస్తూ వెళ్లడం కూడా భాగస్వామి పక్షాలైన ఈ రెండు పార్టీలకు ఇబ్బందికరంగా మారింది.
లోపల సరుకు పుచ్చిపోయినా.. బయట మంచి కలరింగ్.. కవరింగ్ ఇచ్చేసి జనానికి అంటగట్టే వ్యాపారి మాదిరిగా చంద్రబాబు సైతం ఇటు తన ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెలువెత్తుతున్న దాన్ని మీడియా ఇతర పబ్లిసిటీ సంస్థలు మాటున దాచిపెట్టి అంతా బాగుంది అన్నట్లుగా ప్రజలను భ్రమింపజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా తొలి అడుగు అంటూ ఇంటింటికి తన ప్రభుత్వ విజయాన్ని ప్రచారం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు.
ఇందులో భాగంగా భాగస్వామి పక్షాలైన జనసేన, బీజేపీతో బాటు టీడీపీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు సైతం ఇంటింటికి వెళ్లి తమ ప్రభుత్వం చేసిన పథకాలు సాధించిన అభివృద్ధిని ప్రచారం చేస్తారు. అయితే చంద్రబాబు పాలనపై ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతున్నట్లుగా సర్వేల్లో వెళ్లడవడం.. ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం, తెలుగుదేశం నాయకుల అలవిమాలిన అవినీతి.. దందాలు.. గూండాగిరి వంటి అంశాల ద్వారా ప్రజల్లో ఘోరమైన అప్రదిష్టను ఏడాదిలోనే మూటగట్టుకుంది.
దాదాపుగా యాభై మంది ఎమ్మెల్యేలు ఈ క్షణమే ఓడిపోతారని.. ఇంకా ఎంతోమంది ఓటమి అంచులో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో బాటు గెలిచిన తరువాత టీడీపీ నాయకుల్లో అహంకారం పెరగడం.. జనసేన, బీజేపీ నేతలను చిన్నచూపు చూస్తుండడం వంటి అంశాలు కూడా గ్రామ స్థాయిలో కూడా చర్చలకు కారణమవుతున్నట్లు.. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన తొలి అడుగు ప్రచార కార్యక్రమానికి జనసేన, బీజేపీ నాయకులు దూరంగా ఉంటున్నారు.
"మీ అవకాశవాదానికి ఒక దండం.. మీ అడుగులకు మేం మడుగులొత్తలేం" అంటూ చిన్నగా సైడ్ అయిపోతున్నారు. మంచి ప్రభుత్వం పేరిట చేపట్టని ఈ ప్రచారానికి కేవలం తెలుగుదేశం నాయకులు మాత్రమే హాజరవుతున్నారు. అక్కడక్కడ అరా ఒకటి తప్ప జనసేన-బీజేపీ నాయకుల హాజరు లేనేలేదు. కూటమి గెలవడానికి మా అవసరం ఉంది.. ఆ పొత్తు లేకపోతే చంద్రబాబు మళ్ళీ సీఎం అయ్యేనా అంటూ ఇటు జనసేన-బీజేపీ నాయకులు లోలోన భావిస్తున్నారు. అలాంటపుడు తమ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే కానీ అధికారం దక్కాక బాబు.. టీడీపీ నేతల తీరు మారిందని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎక్కడా వీళ్లు ఆ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దీంతో ఊసురో మంటూ కేవలం టీడీపీ నేతలు ఈ ప్రచారాన్ని చేపడుతున్నారు.
-సిమ్మాదిరప్పన్న