వరుసగా మూడో మ్యాచ్‌లోనూ వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. ఈసారి ఊచకోత | VAIBHAV SURYAVANSHI SMASHED FIFTY FROM JUST 20 BALLS AGAINST ENGLAND U19 IN 3RD ODI | Sakshi
Sakshi News home page

వరుసగా మూడో మ్యాచ్‌లోనూ వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. ఈసారి ఊచకోత

Jul 2 2025 9:35 PM | Updated on Jul 2 2025 9:45 PM

VAIBHAV SURYAVANSHI SMASHED FIFTY FROM JUST 20 BALLS AGAINST ENGLAND U19 IN 3RD ODI

14 ఏళ్ల భారత యువ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ ఇంగ్లండ్‌ గడ్డపై వరుసగా మూడో మ్యాచ్‌లోనూ చెలరేగిపోయాడు. ఇంగ్లండ్‌ అండర్‌ 19 జట్టుతో జరిగిన తొలి రెండు వన్డేల్లో విధ్వంసం సృష్టించిన వైభవ్‌.. ఇవాళ (జులై 2) జరుగుతున్న మూడో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 

నార్తంప్టన్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 20 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన వైభవ్‌.. మొత్తంగా 31 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 86 పరుగులు చేశాడు. 

వైభవ్‌ స్కోర్‌లో 78 పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో రావడం విశేషం. వైభవ్‌ ధాటికి భారత్‌ 8 ఓవర్లలో 111 పరుగులు చేసింది. వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 6 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. 

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ డాకిన్స్‌ (62), కెప్టెన్‌ థామస్‌ రూ (44 బంతుల్లో 76 నాటౌట్‌; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించారు. మరో ఓపెనర్‌ ఇస్సాక్‌ (41), బెన్‌ మేస్‌ (31), రాల్ఫీ ఆల్బర్ట్‌ (21) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. 

ఇంగ్లండ్‌ దిగ్గజ ఆల్‌రౌండర్‌ తనయుడు రాకీ ఫ్లింటాఫ్‌ (16) తక్కువ స్కోర్‌కే ఔట్‌ కాగా.. జోసఫ్‌ మూర్స్‌ డకౌటై నిరాశపరిచాడు. సెబాస్టియన్‌ మోర్గాన్‌ 10 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో కనిశ్క్‌ 3 వికెట్లు తీయగా.. దీపేశ్‌ దేవేంద్రన్‌, విహాన్‌ మల్హోత్రా, నమన్‌ పుష్పక్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌.. వైభవ్‌ విధ్వంసం ధాటికి 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. వైభవ్‌తో పాటు ఇన్నింగ్స్‌ ప్రారంభించిన అభిగ్యాన్‌ కుందు 12.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన చవ్డా డకౌటయ్యాడు. ప్రస్తుతం విహాన్‌ మల్హోత్రా (25), రాహుల్‌ కుమార్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలంటే 30 ఓవర్లలో మరో 142 పరుగులు చేయాలి. 

చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. ఇంగ్లండ్‌ బౌలర్లలో అలెగ్జాండర్‌ వేడ్‌ 2 వికెట్లు తీయగా.. జేమ్స్‌ మింటో ఓ వికెట్‌ పడగొట్టాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇరు జట్లు తలో మ్యాచ్‌ గెలిచాయి. తొలి వన్డేలో గెలిచి భారత్‌ బోణీ కొట్టగా.. ఉత్కంఠభరితంగా సాగిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌ వికెట్‌ తేడాతో బయటపడింది. 

వైభవ్‌ హిట్‌.. ఆయుశ్‌ మాత్రే ఫట్‌ 
తొలి మ్యాచ్‌లో 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిస వైభవ్‌.. రెండో వన్డేలో 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేశాడు. ఆయుశ్‌ మాత్రే విషయానికొస్తే.. ఇతను వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. తొలి వన్డేలో 21 పరుగులు చేసిన మాత్రే.. రెండో వన్డే గోల్డెన్‌ డకౌటయ్యాడు. ఇవాల్టి మ్యాచ్‌లో మాత్రే ఆడటం లేదు. అతని స్థానంలో అభిగ్యాన్‌ కుందు భారత జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement