
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలకు ఐదు జిల్లాల్లో ప్రభుత్వ భూములను కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్‌వీ పురంలో 12.70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీ టూరిజం అథారిటీకి ఉచితంగా కేటాయించింది. పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధి కోసం దీన్ని ఉపయోగించాలని సూచించింది. అలాగే వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం దిగువపట్నం గ్రామంలో 50 ఎకరాల భూమిని టూరిజం అథారిటీకి ఉచితంగా కేటాయించింది.
గండికోట సమీపంలో ఒబెరాయ్ గ్రూప్ విల్లా రిసార్టు నిర్మించడానికి ఈ భూమిని అప్పగించింది. అందులో 11.50 ఎకరాల భూమి మైలవరం రిజర్వాయర్ బఫర్ జోన్‌లో ఉండడంతో అక్కడ నీటి వనరులకు హాని కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నేళటూరు గ్రామంలో 5.04 ఎకరాల ప్రభుత్వ భూమిని రూ.1.13 కోట్లకు సెంబ్‌కార్ప్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ విద్యుత్ సంస్థకు ప్రభుత్వం కేటాయించింది. విశాఖపట్నం జిల్లా గండిగుండం గ్రామంలో వెన్ ప్రాజెక్ట్స్ అండ్ డెవలపర్స్ అనే సంస్థకు 0.265 ఎకరాల భూమిని కేటాయించింది.
ఈ భూమిలో ఆ సంస్థ రహదారి నిర్మించి.. స్థానిక పాలనా సంస్థకు అప్పగించాల్సి ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా గుదెంలో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(గెయిల్)కు 1.70 ఎకరాల భూమిని అప్పగించింది. ఆ భూమి విలువ రూ.1.10 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది. గతంలోనే భూమిని అప్పగించిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం అధికారిక ఆమోదం తెలిపింది. ఈ భూముల్లో నీటి వనరులను సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేస్తూ.. మూడేళ్లలో పనులు ప్రారంభించకపోతే భూమిని తిరిగి స్వా«దీనం చేసుకునే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించింది.