సాక్షి, విజయనగరం: ఏపీలో కూటమి సర్కార్ పాలనపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు పార్టీలు కూటమిగా ముఠా కట్టి.. ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కూటమి పాలనను ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. హెరిటేజ్ పాల ప్యాకెట్ కంటే భూమి ధర ఎలా తక్కువగా ఉందని ప్రశ్నించారు.
వైఎస్సార్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని కూటమి నేతలు ప్రజలను సూపర్ మోసం చేశారు. చంద్రబాబు సమర్థవంతంగా అమలు చేస్తున్న పథకం ఒక్కటే. ప్రైవేటు వాళ్లకి దోచిపెట్టడం. హెరిటేజ్ పాల ప్యాకెట్ కంటే విశాఖపట్నంలో ఎకరా భూమి ధర తక్కువ. సామాన్యులను వదిలేసి కార్పొరేట్ల కోసం పనిచేసే వాళ్ళని దావోస్ మ్యాన్ అంటారు. దావోస్‌లో కూటమి నేతలు కలరింగ్ ఇస్తున్నారు.
భూములు ప్రజా సంపద. చంద్రబాబు.. విశాఖ భూములు ఏమైనా మీ బాబు గారి సొమ్మా?. భూములున 99 పైసలకే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి?. విశాఖపట్నం భూములు పప్పు బెల్లాల్లా పంచుతున్నారు మరి అమరావతి భూములు ఎందుకు ఇవ్వరు?. చెప్పింది ఆచరించటం, చేసేదే చెప్పడం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సిద్ధాంతం. మాట నిలబెట్టుకోవడం కోసం కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా జగన్ ప్రజా సంక్షేమం కోసం పనిచేశారు. కూటమి ముఠా చేస్తున్న పనులను ప్రజలు గమనిస్తున్నారు.


