సాక్షి, విశాఖపట్నం: ఒడిశా ప్రయోజనాలకే పట్టం కడుతూ కీలకమైన కొత్తవలస- కిరండూల్ లైన్ (కేకే లైన్) లేకుండా విశాఖ రైల్వే డివిజన్ స్వరూపాన్ని రైల్వే బోర్డు ఖరారు చేసినా సీఎం చంద్రబాబు, కూటమి ఎంపీలు చోద్యం చూస్తున్నారని విశాఖ జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు కెకె రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్తవలస- కిరండూల్ లైన్ (కేకే లైన్) లేకుండా విశాఖ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయడంతో పాటు ఉత్తరాంధ్రలో ఆదాయం వచ్చే ప్రాంతాలను రాయగడ డివిజన్‌లో కలుపుతుంటే ముగ్గురు కేంద్ర మంత్రులు, కూటమి ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
విశాఖ డివిజన్ స్వయం సమృద్ధికి విఘాతం కలుగుతుందని తెలిసినా చంద్రబాబు చోద్యం చూస్తున్నాడని కెకె రాజు మండిపడ్డారు. విశాఖ అభివృద్ధి చెందితే అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి గండి పడుతుందనే కుట్రతోనే కూటమి ప్రభుత్వ ఏర్పాటైన నాటి నుంచి పథకం ప్రకారం ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను విడతలవారీగా ప్రైవేటు పరం చేస్తున్నారని, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేశారని ఆరోపించారు.
కేంద్రంలో చక్రం తిప్పుతానని, డబుల్ ఇంజిన్ సర్కారు అని గొప్పలు చెప్పుకుంటూ ఇప్పుడు విశాఖ రైల్వేజోన్ విషయంలోనూ చంద్రబాబు చేతులెత్తేశాడని ఆయన ధ్వజమెత్తారు. త్వరలోనే కేకే లైన్‌ను విశాఖ డివిజన్‌లో కలిపేలా వైయస్సార్సీపీ ఉద్యమిస్తుందని, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చిత్తశుద్ది ఉంటే కూటమి నాయకులు కలిసి రావాలని కేకే రాజు పిలుపునిచ్చారు.
అమరావతి కోసం ఉత్తరాంధ్రకు ద్రోహం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని ద్రోహం చేస్తున్నాడు. విశాఖలోని వేల కోట్ల విలువైన భూములను తన బినామీలకు కట్టబెడుతూ ఒకపక్క, కేంద్రం నుంచి సాధించాల్సిన ప్రాజెక్టుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తూ మరోపక్క ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని పణంగా పెడుతున్నాడు. వైయస్ జగన్ గారు సీఎంగా ఉండగా విశాఖ పోర్టు నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు 70 మీటర్ల 6 లైన్ల రహదారిని ఏర్పాటు చేసేలా కేంద్రంతో మాట్లాడి ఒప్పించారు. స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీయే ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎదుటనే చెప్పారు.
కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని పూర్తిగా అటకెక్కించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని విడతల వారీగా ప్రైవేటుపరం చేయడానికి చంద్రబాబు అంగీకరించాడు. విశాఖ మెట్రో ప్రాజెక్టును పూర్తిగా అటకెక్కించారు. ఇప్పుడు విశాఖ రైల్వేజోన్ విషయంలోనూ ఉదాసీనంగా వ్యవహరించారు. మాది డబుల్ ఇంజిన్ సర్కారు, కేంద్రంలో చక్రం తిప్పుతున్నా, కూటమి వల్లే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమని బాకాలు ఊదుతూ కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో వచ్చే ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తున్నాడు. విశాఖ అభివృద్ధి చెందితే అమరావతిని పట్టించుకోరనే కుట్రతో చంద్రబాబు సీఎం అయిన నాటి నుంచీ ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల వివక్ష చూపిస్తున్నాడు. విశాఖ ప్రాంతం అభివృద్ధి చెందితే అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి గండి పడుతుందనే కుట్రతోనే చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాడు. రైల్వే జోన్ విభజనతో ఈ విషయం మరోసారి రుజువైంది.

ఉత్తరాంధ్రకు తీరని నష్టం
విశాఖ రైల్వే డివిజన్ ఏర్పాటుతో రాష్ట్ర ప్రయోజనాల సాధనలో సీఎం చంద్రబాబు వైఫల్యం మరోసారి బహిర్గతమైంది. ఒడిశా ప్రయోజనాలకే పట్టం కడుతూ కీలకమైన కొత్తవలస- కిరండూల్ లైన్ (కేకే లైన్) లేకుండా విశాఖ రైల్వే డివిజన్ స్వరూపాన్ని రైల్వే బోర్డు ఖరారు చేసినా సీఎం చంద్రబాబు, కూటమి ఎంపీలు చోద్యం చూస్తూనే ఉన్నారు. అరకుతోపాటు అత్యధిక ఆదాయం ఇచ్చే కేకే లైన్‌ను విశాఖ జోన్ కోల్పోయినా ఈ కూటమి ప్రభుత్వానికి ఏమీ పట్టడం లేదు. రాష్ట్రం నుంచి ముగ్గురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఉన్నా రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. ఢిల్లీలో చక్రం తిప్పుతున్నామంటూ ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్తవలస- కిరండూల్ లైన్ (కేకే లైన్) లేకుండానే విశాఖ రైల్వే జోన్‌ను కేంద్రం ఏర్పాటు చేస్తున్నా పట్టించుకోలేదు.
రైల్వే ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు ఉదాసీన వైఖరి కారణంగా విశాఖ రైల్వే డివిజన్‌కి తీరని అన్యాయం జరిగింది. అత్యధిక ఆదాయం వచ్చే కేకే లైన్‌తోపాటు ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల్లోని సెక్షన్లు రాయగడ రైల్వే డివిజన్ పరిధిలోకి చేర్చింది. ఈ రాయగడ రైల్వే డివిజన్ భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఉత్తర కోస్తా రైల్వే డివిజన్ పరిధిలోకి వస్తుందని ప్రకటించింది. ఈ డివిజిన్లు విభజించిన విధానం వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిసినా ఎంపీలు తమకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరించడం దారుణం.
నాడు వైఎస్సార్‌సీపీ ఒత్తిడితో విశాఖ రైల్వే జోన్
వాల్తేర్ రైల్వే డివిజన్‌ను కొనసాగించాలని, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని విశాఖపట్నం రైల్వే జోన్ పరిధిలోకి తేవాలని నాడు వైయస్సార్సీపీతోపాటు వివిధ ప్రజా సంఘాలు, రైల్వే యూనియన్లు డిమాండ్ చేశాయి. వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఒత్తిడి మేరకు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటును వైయస్సార్‌సీపీ హయాంలోనే రైల్వే శాఖ ఆమోదించింది. ఆమేరకు 2024 ఫిబ్రవరి 28న ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం కేంద్రంగా వాల్తేర్ రైల్వే డివిజన్‌ను కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం 2024 మార్చిలో ప్రకటించింది.
కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖ కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేసే దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి విశాఖపట్నం డివిజన్‌ను చేర్చింది. కానీ అత్యధిక రాబడి నిచ్చే కొత్తవలస-కిరండోల్ సెక్షన్‌తోపాటు పలాస - ఇచ్ఛాపురం సెక్షన్లను విశాఖపట్నం డివిజన్ పరిధి నుంచి తొలగించి ఒడిశాలోని రాయగడ కేంద్రంగా ఏర్పాటు చేసే కొత్త డివిజన్ పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో విశాఖ డివిజన్ ఆర్థిక స్వయం సమృద్ధి సాధించడం సాధ్యం కాకపోగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది.
ఉద్యమ కార్యాచరణతో ముందుకు..
విశాఖ రైల్వే జోన్ కోసం వైఎస్సార్‌సీపీ అలుపెరగని పోరాటాలు చేసింది. గతంలో మా పార్టీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. కేకే లైన్‌తో కూడిన విశాఖ డివిజన్ ఏర్పాటుచేయడంతో పాటు రాయగడ డివిజన్‌లో కలిపిన ఉత్తరాంధ్ర ప్రాంతాలను విశాఖ డివిజన్‌లోనే కొనసాగించేలా వైయస్సార్సీపీ పోరాడుతుంది. కూటమి ప్రభుత్వానికి చెందిన ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులకు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేకే లైన్‌ను విశాఖ డివిజన్‌లో చేర్చడానికి వైయస్సార్సీపీతో కలిసి ఉద్యమించాలి. విభజన చట్టంలో పొందుపరిచిన ప్రకారమే రైల్వే జోన్ విషయంలో కేంద్రం ముందుకెళ్లాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోంది. దీనిపై త్వరలోనే పక్కా ప్రణాళికలతో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం.


