తాడేపల్లి : దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌లు బేతాళ కథలు వినిపిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. వారు తెచ్చే పరిశ్రమల సంగతి ఏమో కానీ పబ్లిసిటీ మాత్రం పీక్స్‌లో ఉందని మండిపడ్డారు. పనిలో పనిగా ట్రంప్ స్వయంగా వచ్చి చంద్రబాబును కలిశారని కూడా ప్రచారం చేసుకుంటారని ఎద్దేవా చేశారు శైలజానాథ్. అసలు ఇప్పటివరకూ చేసుకున్న ఎంవోయూలకు సంబంధించి ఎన్ని కంపెనీలు వచ్చాయని ప్రశ్నించారు. ఈరోజు( బుధవారం, జనవరి 21వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన శైలజానాథ్.. ఎంవోయూల కోసం వచ్చేదంతా టీడీపీ ఏర్పాటు చేసిన మనుషులేనని స్పష్టం చేశారు.
‘ వాళ్ళ కోటు రంగులు మారతాయే కానీ కంపెనీలు మాత్రం రావు. చెప్పిన అబద్ధాలే పదే పదే చెప్తున్నారు. చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం 18.87 లక్షల కోట్ల పెట్టుబడులు రావాలి. ఏమైనా అడిగితే పెట్టుబడుల కోసం కాదు.. బ్రాండ్ వాల్యూ పెంచటం కోసం వెళ్తున్నామని లోకేష్ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఆర్ఎంజెడ్ సంస్థతో లక్ష ఒప్పందం కుదుర్చుకున్నామని.. లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అసలు లక్ష ఉద్యోగాలు ఎలా ఇస్తుంది?, లక్ష ఉద్యోగాలు ఆ సంస్థ ఇవ్వకుంటే ఏం చేయాలి?, అమరావతి నుంచి విశాఖకు నిమిషాల్లో చేరుకునే హైపర్ లూప్ ఏర్పాటు చేస్తాం అన్నారు.
దొనకొండలో డ్రోన్స్ యూనిట్ అన్నారు. వారు చెప్పిన ఏ ఒక్క కంపెనీ కనిపించటం లేదు. వీటి ప్రకటనల కోసం చేసిన ఖర్చు కూడా వచ్చి ఉండదు. చంద్రబాబు, వారి మంత్రులు తిరిగే ప్రత్యేక హెలికాఫ్టర్ల ఖర్చుతో అనేక పరిశ్రమలు పెట్టవచ్చు. మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి.. దేనికి ఖర్చు పెట్టారో కూడా లెక్కలు లేవు. గత ప్రభుత్వ హయాంలో మేం చేసుకున్న ఒప్పందాల్లో 90 శాతం గ్రౌండ్ అయ్యాయి. జగన్ ప్రభుత్వ హయాంలో దక్షిణ భారత దేశంలో సేవారంగంలో మొదటి స్థానం, ఉత్పత్తి రంగంలో 5వ స్థానం సాధించాం. చంద్రబాబు పరిశ్రమల పేరుతో ధారాదత్తం చేస్తున్న భూములు మొత్తం ప్రజలవే. దావోస్ వెళ్ళినా కూడా జగన్ నామస్మరణ చేయడమే పనిగా పెట్టుకున్నారు’ అని ధ్వజమెత్తారు.


