
ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన
కచ్చితమైన గడువు తేదీతో భారతీయ విద్యార్థులకు కొత్త సమస్యలు
వాషింగ్టన్: విదేశీ వలసదారులపై బహిష్కరణ వేటు వేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా విదేశీ విద్యార్థులపై ‘కాల పరిమితి’ కత్తి దూసేందుకు సాహసించారు. విదేశీ విద్యార్థులకు కాలపరిమితితో సంబంధం లేకుండా ఇన్నాళ్లూ ఎఫ్–1 స్టూడెంట్ వీసాలు జారీచేస్తుండగా ఇకపై స్పష్టమైన తుదిగడువుతో విద్యార్థి వీసాలు జారీచేయాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తోంది. గడువు దాటాక అమెరికా గడ్డపై ఉంటే మళ్లీ స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత ప్రతిపాదనలో ప్రభుత్వం పేర్కొంది.
ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్(ఓఎంబీ) వద్ద పరిశీలనలో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర పడితే ఇకపై విద్యార్థి అమెరికాలో చేయబోయే కోర్సు పూర్తయినా, పూర్తికాకపోయినా వీసాపై ముద్రించిన గడువుతేదీలోపు అమెరికాను వీడాల్సి ఉంటుంది. ఇన్నాళ్లూ ఇలాంటి గడువు అనేదే లేదు. అమెరికాలోకి అడుగుపెట్టినప్పుడు ఎంచుకున్న విద్యా కోర్సు సంపూర్ణంగా పూర్తయ్యేదాకా ఆ స్టూడెంట్ వీసా చెల్లుబాటులోనే ఉండేది. దీనినే ‘ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’గా పిలుస్తారు.
ఈ స్టేటస్‌లో ఇకపై గడువు తేదీని ముద్రించాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. గతంలో కోర్సు ఆలస్యమైతే వీసా గడువు పొడిగింపు వంటి వెసులుబాట్లు ఉండేవి. ఇకపై అలాంటివి ఒప్పుకోబోమని ట్రంప్ సర్కార్ కరాఖండీగా చెబుతోంది. దీంతో ఎఫ్–1 వీసాలతో అమెరికా విద్యాభ్యాసం కోసం వచ్చే భారతీయ విద్యార్థులపై మరింత ఆర్థిక భారం పడనుంది.
అనివార్య కారణాలతో కోర్సు ఆలస్యమైనాసరే వీసా గడువు మాత్రం పాత తేదీకే పూర్తవుతుంది. అలాంటి సందర్భాల్లో కోర్సు పూర్తికాకముందే అమెరికాను వీడాల్సి ఉంటుంది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకే మరోసారి వీసా కోసం దరఖాస్తు చేసుకోవడం, ఆ దరఖాస్తు ఆమోదం కోసం వేచి ఉండటం, దరఖాస్తు, తదితరాల ఖర్చులు తడిసిమోపెడై విద్యార్థులకు ఖర్చు మరింత పెరగనుంది.
ఎక్స్చేంజ్ విజిటర్లకూ కష్టాలే
జే–1 వీసా సాధించి ఎక్స్చేంజ్ విజిటర్లుగా వచ్చే వాళ్లకూ ఇదే నిబంధనను వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. చిన్నారులకు ఇంట్లో సేవచేయడం అందుకు ప్రతిఫలంగా భోజన, వసతి, స్వల్ప భత్యం వంటి సదుపాయాలు పొందే ‘ఆపెయిర్’ యువతకు ఇదే గడువు విధించాలని చూస్తున్నారు. కొత్త ప్రతిపాదలు అమల్లోకి వస్తే విదేశీ విద్యార్థులతోపాటు ఎక్స్చేంజ్ విజిటర్ల విభాగంలోకి వచ్చే అధ్యాపకులు, విదేశీ మీడియా ప్రతినిధులు, విద్యావేత్తలు, కళాకారులు, ఉపాధ్యాయులు, ట్రైనీలు, ఇంటర్న్‌లు, వైద్యులు సైతం వీసా కాలపరిమితి కష్టాలను ఎదుర్కోనున్నారు.
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ ప్రతిపాదనలు చేసింది. ప్రతిపాదనలు ప్రస్తుతం ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ విభాగం పరిశీలిస్తోంది. వీటిని ఫెడరల్ రిజిస్ట్రీలో ప్రచురించాక 30 లేదా 60 రోజుల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించి తుది నిర్ణయం తీసుకుంటారు. అత్యవసరమైతే దొడ్డిదారిన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి కూడా ట్రంప్ ప్రభుత్వం ఈ నిబంధనను అమల్లోకి తెచ్చే ప్రమాదముందని తెలుస్తోంది.
పలు వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు
ఇప్పటికే వీసా దరఖాస్తుదారుల ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టా గ్రామ్, లింక్డి్డన్ వంటి సామాజిక మాధ్యమ ఖాతాలను అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఇన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు జల్లెడ పడుతున్నారు. అమెరికా వ్యతిరేక, హమాస్ అనుకూల పోస్ట్‌లు, ట్వీట్లు, వీడియోలు ఉన్నాయో లేదోనని పరిశీలించి ఆ మేరకు దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. ఇన్ని అడ్డంకులను దాటుకుని సంపాదించిన వీసాను కేవలం గడువు ప్రాతిపదికన మంజూరుచేయడం తగదని పలు వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గడువు విధింపు కారణంగా లక్షలాది మంది విద్యార్థులపై అదనపు ఒత్తిడి, ఆర్థికభారం తప్పదని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అకడమిక్ కోర్సుల విధానం అస్తవ్యస్తమవుతుందని పలువురు పేర్కొన్నారు. గడువుదాటి అమెరికాలో ఉంటే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఢిల్లీలోని అమెరికా ఎంబసీ మే 14వ తేదీన హెచ్చరించడం తెల్సిందే.