
స్ఫూర్తి పాఠం
23 ఏళ్లకే ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ అయ్యి 25 ఏళ్ల వయసులో జాయింట్ కలెక్టర్‌గా పని చేస్తున్న నేహా బైద్వాల్ ఒక స్ఫూర్తి పాఠం. అమ్మాయిల చదువును అంతగా ప్రోత్సహించని రాజస్థాన్ లో పుట్టిన నేహా మూడేళ్ల పాటు ఫోన్ ని తాకకుండా పట్టుపట్టి చదివి ఐ.ఏ.ఎస్. సాధించారు. గమ్యం చేరాలంటే ఫోన్ ని పక్కన పెట్టాలంటున్న ఆమె మాటలు చర్చను లేవనెత్తుతున్నాయి.
‘మా ఇంట్లో టీవీ ఉండదు. మా నాన్నగారు టీవీని ఉండనివ్వలేదు. దాని బదులు ఒక బ్లాక్‌బోర్డ్ ఉంది. మాది జాయింట్ ఫ్యామిలీ. ఎప్పుడూ చదువుకుంటూ పరీక్షలు రాసే పిల్లలు ఐదారుమంది ఉండేవారు. వారికి ఆ బోర్డు మీద పాఠాలు సాగుతుండేవి. నేను కూడా అలాగే చదువుకున్నాను. మా నాన్న ఆఫీసు నుంచి వచ్చాక రాత్రి భోజనం దగ్గర పిల్లలందరూ ఆ వేళ ఏం చదివారో అడిగేవారు... జవాబులు తెలుసుకునేవారు. ఎవరైనా సరిగ్గా చదవలేదని అనిపిస్తే వారికి క్లాస్ పడేది.
రాజస్తాన్ కుటుంబాల్లో/పల్లెల్లో ఆడపిల్ల చదువును ప్రోత్సహించరు. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల ఆయన ఉద్యోగ రీత్యా మేమంతా ఎక్కువ సంవత్సరాలు ఛత్తిస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉండటం వల్ల మా చదువుకు ఎటువంటి ఆటకం కాలేదు. చదువు ముఖ్యం అని చిన్నప్పుడే మా నాన్న నూరి΄ోశారు’ అంటుంది నేహా బైద్వాల్.
2023 సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఆమెకు 569 ర్యాంకు వచ్చింది. మొత్తం 960 మార్కులతో (ఇంటర్వూలో 151) ఆమె ఈ విజయం సాధించింది. అయితే ఇదంత సులువు కాలేదు. అందుకు నాలుగేళ్లు కష్టపడింది. మూడుసార్లు విఫలమయ్యి నాలుగోసారి విజయం సాధించింది.
5వ తరగతి ఫెయిల్
నేహా మొదటి నాలుగేళ్లు రాజస్థాన్‌లో ఉన్న తాతగారి ఇంట్లో చదువుకుంది. అది పల్లెటూరి. అక్కడ రాజస్థానీ మీడియంలోని చిన్న బడి ఉండేది. అయితే ఐదోక్లాస్ నాటికి తండ్రి ఆమెను తాను ఉద్యోగం చేస్తున్న చోటుకు తెచ్చి ఇంగ్లిష్ మీడియం స్కూల్లో వేశాడు. అప్పటికి ఇంగ్లిష్‌లో ఏ మాత్రం ప్రవేశం లేని నేహా ఐదోక్లాస్‌లో ఫెయిల్ అయ్యింది. స్కూల్ వాళ్లు హిందీ మీడియంలోకి వేస్తామన్నారు. కాని నేహా పట్టుదలతో ఆరో క్లాస్ నుంచి ఇంగ్లిష్ మీడియంలో పుంజుకుంది.
లాయర్ కావాలనుకుని...
నేహా అడ్వకేట్ అవుదామనుకుంది. ‘బాధితులకు న్యాయం జరగాలంటే అదొక మంచి మార్గం అనుకున్నాను’ అంటుందామె. కాని అంతకంటే ఎక్కువమందికి నువ్వు మేలు చేయాలంటే ఐ.ఏ.ఎస్ కావాలి అని తండ్రి దిశా నిర్దేశం చేశాడు. రాయ్‌పూర్‌లోని మహిళా కళాశాలలో డిగ్రీ చదివిన నేహా అందుకు మార్గం ఏమిటని తండ్రిని అడిగితే కాలాన్ని గెలవడమే అని చె΄్పాడు. ‘పనికిరాని వాటికి సమయాన్ని వృథా చేయడం కంటే దానిని పూర్తిగా సద్వినియోగం చేయడమే విజయానికి మార్గం అని తెలుసుకున్నాను’ అంటుంది నేహా. టీవీ లేని ఆ ఇంట్లో ఆమె ఇక ఫోన్ కూడా పక్కన పెట్టేసింది. ఇల్లే ఆమె ట్యుటోరియల్ కాలేజీ, ప్రిపరేషన్ జరిగే చోటు.
నాలుగోసారి
‘నేను ఆశాజీవిని. ఓడి΄ోక ప్రయత్నించడం మన బాధ్యత’ అంటుంది నేహా. నేహాకు మొదటి అటెంప్ట్‌లో అసలేమీ రిజల్ట్ కనపడలేదు. రెండో అటెంప్ట్‌లో ప్రిలిమ్స్‌లో 2 మార్కులు తక్కువ రావడంతో అర్హత రాలేదు. మూడో అటెంప్ట్‌లో మెయిన్స్‌లో అర్హతకు 8 మార్కులు తక్కువ వచ్చాయి. మూడుసార్లు విఫలమయ్యాక నాలుగోసారి మళ్లీ పరీక్షకు కూచోవడం ఎవరికైనా కష్టమే. కాని నేహా నాలుగోసారి రాసింది. ఈసారి ఆమె శ్రమ వృథా కాలేదు. 2023 సంవత్సరంలో ఆమెకు 569వ ర్యాంకు వచ్చింది. గుజరాత్ కేడర్ అలాట్ అయ్యింది. శిక్షణ తర్వాత గుజరాత్‌లో అసిస్టెంట్ కలెక్టర్‌గా ΄ోస్టింగ్ వచ్చింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది. ‘నీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, నిన్ను నీవు మోసం చేసుకోకుండా కష్టపడితే విజయం తథ్యం’ అంటోందామె.
అందరూ తోడే
నేహా చదువుకుంటూ ఉంటే ఒక్కోరోజు ఒక్కొక్కరు తోడు కూచునేవారు. ఒకరోజు తండ్రి, మరోరోజు బాబాయి... ‘మేమున్నాం తోడుగా. నీ ప్రిపరేషన్ నువ్వు, మేము నీకు తోడు అనే భరోసా దీని ద్వారా అందేది’ అంటుంది నేహా. ఆమెకు ముగ్గురు తమ్ముళ్లు. వారిలో ఒక తమ్ముడు మెయిన్స్‌కు అన్ని ప్రశ్నలు సమయానికి రాయడం ఎలాగో టిప్స్ చెప్పి సాధన చేయించాడు. ‘మా ఇంట్లో రోజూ నాకు మాక్ ఇంటర్వ్యూలు ఉండేవి. రోజూ ఎవరో ఒకరు ఐ.ఏ.ఎస్. కోసం బోర్డు ఎలా అయితే ప్రశ్నలు అడుగుతుందో అలా ప్రశ్నలు ప్రిపేరయ్యి మరీ నన్ను అడిగేవారు. ఇది నాకు ఎంతో ఉపయోగపడింది’ అంటుంది నేహా.