
చదువుకు వయసేమిటి? కష్టమైన మెడిసిన్ సీటు సాధించడంలోమనకు తక్కువేమిటి అనుకున్నారు 49 ఏళ్ల అముదవల్లి. తమిళనాడుకు చెందిన ఈ ఫిజియోథెరపిస్ట్ తన కుమార్తె సంయుక్తతో కలిసి నీట్ 2025 రాశారు. ఇద్దరికీ ర్యాంకు వచ్చింది. బుధవారం కౌన్సిలింగ్‌లో ఆమెకు సీటు ఖరారైంది. కూతురుతోపాటు మెడిసిన్ చదవబోతున్నందుకు చాలా ఉద్వేగంగా ఉందామె. పెళ్లి వల్ల చదువు ఆగిపోయిన తల్లులు అముదవల్లిని చూసి స్ఫూర్తి పొందాలి.
‘వివాహం విద్యానాశాయ’... పెళ్లికాగానే చదువు అటకెక్కుతుందని, బాధ్యతలు తలకెక్కుతాయని పెద్దలంటారు. అదంతా అప్పటి మాట. ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా విద్యను వృద్ధి చేయవచ్చు అని నిరూపించారు 49 ఏళ్ల అముదవల్లి. కూతురితో కలిసి, నీట్ పరీక్ష రాసిన ఆమె ఉత్తీర్ణత సాధించి చాలామంది అమ్మలకు స్ఫూర్తిగా నిలిచారు. ఒకేసారి తల్లీకూతుళ్లు నీట్ పరీక్ష రాయడం, ఇద్దరూ పాసవడం దేశంలో ఇదే తొలిసారి కావొచ్చు.
ఎప్పటి నుంచో కల
తమిళనాడు తె¯Œ కాశికి చెందిన అముదవల్లి వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్ట్. భర్త లాయర్. మరో ఏడాదిలో ఆమె 50 ఏళ్ల వయసుకు చేరుకుంటారు. ఇన్నేళ్లు గడిచినా ఆమె మనసులో ఒక కోరిక మాత్రం తీరలేదు. అదే డాక్టర్ అవ్వడం. తెల్లకోటు వేసుకొని, చేతిలో స్టెతస్కోప్ పట్టుకొని, రోగుల్ని నవ్వుతూ పలకరించి, చల్లటి చికిత్స అందించే వైద్యురాలు కావాలన్నది ఆమె కల. కానీ ఆమె ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించ లేదు. దీంతో ఫిజియోథెరపీ కోర్సు చేసి, అందులోనే కొనసాగారు. ఆశ్చర్యంగా కూతురు సంయుక్త తనకు డాక్టర్ కావాలని ఉందని చెప్పినప్పుడు అముదవల్లి ఎంతో సంతోషపడ్డాను. తను నెరవేర్చుకోలేకపోయిన కోరిక కూతురు సాధించబోతోందని ఆనందపడ్డారు. అంతేనా? తన కూతురితోపాటు తను మాత్రం ఎందుకు సాధించకూడదు? ఆ వయసులో తనకు అడ్డుపడ్డ ఇబ్బందులు ఇవాళ లేవుగా? అందుకే కూతురుతోపాటు తనూ నీట్ పరీక్ష రాయాలని అనుకున్నారు.
కష్టమైన లక్ష్యం
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఆపై మెడికల్ సీటు పొందడం అంత సులభమైన విషయాలు కావు. చాలా శ్రమించాలి. గంటల తరబడి చదవాలి. రోజుల తరబడి చదువుకు అంకితమవ్వాలి. ఇంత చేసినా పాసవుతామన్న నమ్మకం లేదు. అయితే అముదవల్లికి కూతురు సంయుక్త తోడుగా నిలిచింది. స్ఫూర్తి నింపింది. తనతోపాటు తల్లి కూడా నీట్ పరీక్ష రాయడాన్ని ప్రోత్సహించింది. ఇద్దరూ కలిసి పరీక్షకు సిద్ధమయ్యారు. అయితే అప్పటికి అముదవల్లి చదువు మానేసి చాలా ఏళ్లయ్యింది. కొత్త సిలబస్, సరికొత్త అంశాలు.
అవన్నీ మళ్లీ చదవడం, వాటిని అర్థం చేసుకోవడం, గుర్తుపెట్టుకోవడం కష్టమైన పనులు. అయినా ఆమె విసుగు లేకుండా రోజూ సాధన చేసేవారు. తనకొచ్చే సందేహాలను కూతురిని అడిగి సమాధానాలు తెలుసుకునేవారు. ‘నేను చదివినప్పటికీ, ఇప్పటికీ సిలబస్‌లో చాలా మార్పులొచ్చాయి. కొన్ని విషయాలు నాకు పూర్తిగా కొత్త. అయినా నా కూతురి సాయంతో వాటిని చదివి, అర్థం చేసుకున్నాను. ఇద్దరం కలిసి వాటిని చర్చించి, చదువుకునేవాళ్లం. ఈ విషయంలో మా అమ్మాయే నాకు స్ఫూర్తి’ అని సంతోషంగా వివరిస్తున్నారు అముదవల్లి.
సంయుక్త కోచింగ్ సెంటర్‌కి వెళ్లి, అక్కడ శిక్షణ పొంది ఇంటికొచ్చి, ఆ పాఠాలు తల్లికి చెప్పేది. దీనివల్ల ఆ విషయాలు తనకూ బాగా తెలియడంతోపాటు తల్లికీ ఉపయోగకరంగా మారింది. ‘మనం చదువుకున్నది మరొకరికి నేర్పితే, అది మనకు బాగా గుర్తుంటుంది. నేను నేర్చుకున్న టాపిక్స్ మా అమ్మకు నేర్పడం చాలా మంచిదైంది’ అంటోంది సంయుక్త.
సాధించిన ద్వయం
అముదవల్లి, సంయుక్త నీట్– 2025 పరీక్ష రాశారు. అముదవల్లి 147 మార్కులు సాధించగా, సంయుక్త 450 మార్కులు సాధించింది. జూలై 30న చెన్నైలో నీట్ కౌన్సిలింగ్‌కి ఇద్దరూ హాజరయ్యారు. దివ్యాంగుల కోటాలో అముదవల్లికి విరుదనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్ రాగా, సంయుక్తకు ఇంకా కళాశాలను అలాట్ చేయలేదు. ‘మా అమ్మతో కలిసి ఒకే కాలేజీ చదవాలని నాకు లేదు. ఆమె ప్రిపేర్ అవుతున్నప్పుడు అదొక్కటే నేను పెట్టిన షరతు’ అని నవ్వింది సంయుక్త. ఇన్నేళ్ల తర్వాత తన తల్లి తన ఆశయాన్ని సాధించి, అనేకమందికి స్ఫూర్తిగా నిలవడం ఆనందంగా ఉందని అంటోంది.
నేను చదివినప్పటికీ, ఇప్పటికీ సిలబస్‌లో చాలా మార్పులొచ్చాయి. అయినా నా కూతురి సాయంతో వాటిని చదివి, అర్థం చేసుకున్నాను. ఇద్దరం కలిసి వాటిని చర్చించి, చదువుకునేవాళ్లం. ఈ విషయంలో మా అమ్మాయే నాకు స్ఫూర్తి.
– అముదవల్లి