
‘సైంటిస్ట్ కావాలి’ ‘ఐపీఎస్ ఆఫీసర్ కావాలి’... ఇలా ఆ పిల్లలకు ఎన్నో కలలు ఉన్నాయి. అయితే ఆ కలలకు అడ్డుగోడ గణితంపై వారికి ఉండే భయం. ‘పఢాయి విత్ ఏఐ’ అనే ఏఐ సాంకేతిక కార్యక్రమంతో పిల్లల్లో గణితంపై ఉండే భయాన్ని పోగొట్టింది ఐఏఎస్ అధికారి సౌమ్య ఝా. ‘పఢాయి విత్ ఏఐ’ పుణ్యమా అని పిల్లలకు ఏఐ అంటే భయం పోయింది. నైపుణ్యం సొంతం అయింది.
రాజస్థాన్‌లోని టోంక్‌కు చెందిన అమన్ గుజర్ అనే విద్యార్థికి గణితం అంటే వణుకు. చాలా కష్టంగా, ఒత్తిడిగా అనిపించేది. గణితంలో ఎప్పుడూ బొటాబొటీ మార్కులు వచ్చేవి. అయితే అతడి భయానికి ‘పఢాయి విత్ ఏఐ’ ఫుల్‌స్టాప్ పెట్టింది. గణితం అంటే భయాన్ని పోగొట్టి, ఉత్సాహాన్ని పెంచింది.
‘పఢాయి విత్ ఏఐ’ అంటే?
అమన్ చదివే స్కూల్‌లో ‘పఢాయి విత్ ఏఐ’ పేరుతో ఏఐ ఆధారిత విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత క్లిష్టమైన గణిత సమస్యలనైనా సులభంగా అర్థమయ్యేలా విద్యార్థులకు వివరిస్తుంది. ‘గణితం అంటే ఒకప్పుడు ఉండే భయం ఏమాత్రం లేదు. ఇప్పుడు నాకు గణితం అనేది ఒక సబ్జెక్ట్ కాదు. ఆట. గణితంలోనూ మంచి మార్కులు సాధించడం నాకు ఎంతో గర్వంగా ఉంది. నూటికి నూరు మార్కులు తెచ్చుకోవాలనే ఆత్మవిశ్వాసం వచ్చింది’ అంటున్నాడు అమన్.
ఐఏఎస్ అధికారి సౌమ్య ఝా ఆలోచన నుంచి పుట్టిందే... పఢాయి విత్ ఏఐ. ఆమె టోంక్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలను సందర్శించినప్పుడు చాలామంది విద్యార్థులు గణితం, సైన్స్ సబ్జెక్ట్‌లలో వెనకబడి ఉన్నారనే విషయాన్ని అర్థం చేసుకుంది. చాలామంది విద్యార్థులు గణితంలో ఎందుకు వెనకబడిపోయారు? అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించింది సౌమ్య. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఎన్నికల డ్యూటీ, రకరకాల ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఉపాధ్యాయులు ఎక్కువ రోజులు బడికి దూరంగా ఉంటున్నారు.
స్కూలు విద్యార్థులలో చాలామంది వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు. వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు సహాయం అందించడానికి తరచు బడికి గైర్హాజరు అవుతుంటారు. గ్యాప్ రావడం వల్ల వారికి పాఠాలు అర్థం కావు. ఇలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకొని సాంకేతికతకు మానవ ప్రయత్నాన్ని జోడిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ‘పఢాయి విత్ ఏఐ’ కార్యక్రమానికి రూపకల్పన చేసింది సౌమ్య.
ఐఏఎస్ తొలిరోజులలో కొన్ని సబ్జెక్‌లకు సంబంధించి తాను ఏఐ (ఆర్టిషిఫియల్ ఇంటెలిజెన్స్) సహాయం తీసుకునేది. ఆ విషయం గుర్తు తెచ్చుకొని, ఏ సబ్జెక్ట్ గురించి అయితే విద్యార్థులు భయపడుతున్నారో, ఆ భయాన్ని పోగొట్టడానికి ‘ఏఐ’ని అస్త్రంలా వాడాలని నిర్ణయించుకుంది.
గత సంవత్సరం పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన ‘పఢాయి విత్ ఏఐ’ని సరికొత్త మార్పులు చేర్పులతో ఈ సంవత్సరం ‘వెర్షన్–2’గా లాంచ్ చేశారు. ఈ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌లో టీచింగ్ క్యాలెండర్, విద్యార్థుల ప్రతిభను మెరుగుపరిచే అత్యాధునిక సాంకేతిక పరికరాలు, ప్రతి వారం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. ‘పఢాయి విత్ ఏఐ’ని టోంక్ జిల్లాలోని 350కి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. విద్యార్థులలో వచ్చిన మార్పు గురించి చాలా సంతోషంగా ఉన్న సౌమ్య ఝా – ‘ఇదేమీ మాయాజాలం కాదు. మానవ ప్రయత్నానికి తోడైన సాంకేతిక అద్భుతం’ అంటుంది.