
‘ప్రపంచంలో చదువుకు దూరమైన అతి ఎక్కువ మంది ఆడపిల్లలున్న దేశం భారత్ ఒక్కటే’ అంటారు సఫీనా హుసేన్. స్కూల్లో ఉన్న ఆడపిల్లల కంటే స్కూల్ మానేసిన ఆడపిల్లలు ఎక్కువ ఉండటంతోవారిని తిరిగి స్కూళ్లకు పంపడానికి ఆమె ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ స్థాపించారు. ఏళ్ల తరబడి ఆమె సాగించిన కృషి బాలికల జీవితాల్లో చదువును తెచ్చింది. ఆమెకు ‘రామన్ మెగసెసె ఆవార్డు’ తెచ్చిపెట్టింది. ఆసియా నోబెల్‌గా భావించే రామన్ మెగసెసెను సఫీనా స్థాపించిన ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ ఎన్.జి.ఓకు ప్రకటించారు.
‘మారుమూల గ్రామంలో అయినా సరే ఏ ఒక్క ఆడపిల్ల స్కూలుకు వెళ్లకుండా ఉండకూడదు. అదే మా ఎడ్యుకేట్ గర్ల్స్ లక్ష్యం’ అంటారు సఫీనా హుసేన్. 54 ఏళ్ల ఈ సామాజిక కార్యకర్త 2007 లో బాలికా విద్య కోసం ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ ఎన్.జి.ఓను స్థాపించారు. ఆ రోజు నుంచి ఈరోజు వరకూ సుమారు నాలుగు లక్షల మంది బాలికలను అక్షరాస్యత వైపు నడిపించారు. అందుకే ఆమె సంస్థకు ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసె అవార్డు 2025ను ప్రకటించారు. 1958 నుంచి ఇస్తున్న ఈ అవార్డు కింద 50 వేల యు.ఎస్.డాలర్ల నగదు కూడా ఉంటుంది.
‘ఎడ్యుకేట్ గర్ల్స్‌కు రామన్ మెగసెసే అవార్డు రావడం చాలా సంతోషాన్నిచ్చింది. ఇదొక చారిత్రాత్మక క్షణం. భారతదేశంలో బాలికల విద్యకోసం ప్రజలతో కలిసి మేము చేస్తున్న ఈ ఉద్యమం గురించి ఈ అవార్డు వల్ల ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది. బాలికలను శక్తిమంతం చేయడానికి, వారు అడ్డంకులను ఛేదించి మరిన్ని విజయాలు సాధించడానికి మనమంతా మరెంతో దూరం ప్రయాణించాల్సి ఉంది’ అని అవార్డు ప్రకటన తర్వాత సఫీనా అన్నారు.
‘టీమ్ బాలిక’ల విజయం
‘ఎడ్యుకేట్ గర్ల్స్’ ద్వారా స్కూలు మానేయించిన బాలికలను తిరిగి స్కూలుకు పంపడానికి సఫీనా ఎన్నుకున్న మార్గం ప్రతి ఊరి నుంచి ఒక చురుకైన యువతి ని కార్యకర్తగా ఎంచుకోవడం. వీరిని ‘టీమ్ బాలిక’ అంటారు. ఈ బాలికలే ఇంటింటికి తిరిగి కుటుంబాలను ఒప్పించి డ్రాపవుట్ ఆడపిల్లలను తిరిగి బడికి చేరుస్తున్నారు. 2007లో 50 గ్రామాల్లో మొదలెట్టిన ఈ కార్యక్రమం నేడు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 18 వేల గ్రామాల్లో బాలికలకు విద్యనందించేందుకు కృషి చేస్తోంది.
ప్రస్తుతం ఈ సంస్థలో 13 వేల మంది యువతులు టీమ్ బాలికలుగా గ్రామాల్లో పని చేస్తున్నారు. ‘నా ఊరు.. నా సమస్య... నేనే సమాధానం’ అనేది వీరి నినాదం. తమ ఊరిని తామే బాగు చేసుకుందామని వీరు ముందుకొస్తే పెద్దలు మద్దతు తెలుపుతున్నారు. ‘స్కూలు మాన్పించి ఇంటి పనులు చేయించడం బాలికల కలలను ఛిద్రం చేయడమే’ అంటారు సఫీనా. కేవలం బాలికల్ని బడికి పంపడమే కాకుండా పాఠశాలలకు సౌకర్యాలు అందించడం, బాగా చదివే పిల్లలను కళాశాలల్లో చేర్పించడం, వారి ఆరోగ్యంపై శ్రద్ధ చూపించడం వంటివి కూడా ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ చేపడుతుంది.
ఎవరీ సఫీనా?
సఫీనా హుస్సేన్ 1971లో దిల్లీలో జన్మించారు. ఈమె తండ్రి యూసఫ్ హుసేన్ అనే టీవీ నటుడు. ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్’ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సఫీనా 1998 నుంచి 2004 వరకు శాన్ ఫ్రాన్సిస్కోలోని ‘చైల్డ్ ఫ్యామిలీ హెల్త్ ఇంటర్నేషనల్’కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2005లో అమెరికా నుంచి ముంబయికి తిరిగొచ్చిన ఆమె స్థానిక పరిస్థితులను పరిశీలించారు.
ప్రపంచంలో స్త్రీల జీవన విధానాలు అత్యంత దుర్భరంగా ఉన్న 20 దేశాల్లో భారత్ కూడా ఉందన్న సర్వే వివరాలు తెలుసుకొని ఆమె కలవరపడ్డారు. ప్రధానంగా విద్య విషయంలో తల్లిదండ్రులు ఆడ, మగ అంటూ భేదం చూపించడం, కొడుకును చదివిస్తూ కూతుర్ని ఇంటి పనుల్లో పెట్టడం వంటివి ఆమెను ఆలోచింపజేశాయి. ఆ పరిస్థితి మారాలంటే పల్లెల నుంచి పని మొదలుపెట్టాలని భావించారు. అలా 2007లో ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఈమె చేస్తున్న కృషి నచ్చి కత్రినా కైఫ్ తనకు తానుగా ముందుకొచ్చి ‘ఎడ్యుకేట్ గర్ల్స్’కు అంబాసిడర్‌గా, టీమ్ బాలికగా పని చేశారు.
2035 నాటికి కోటి మంది బాలికలు
‘ఎడ్యుకేట్ గర్ల్స్’ చేసిన కృషి ఫలితంగా లక్షలాది బాలికలు బడులకు చేరి అక్షరాలు దిద్దారు. వారిలో కొందరు స్కూళ్లు దాటి కాలేజీల్లోనూ అడుగుపెట్టారు. ఇదంతా సమష్టి కృషితో సాధ్యం అంటారు సఫీనా హుస్సేన్. సంస్థ నిర్వహణలో తనకు సాయం అందించినవారు, తనతో కలిసి పనిచేస్తున్నవారందరి కృషి ఈ విజయంలో ఉందని అంటున్నారు. 2035 నాటికి కోటి మంది బాలికల్ని బడుల్లో చేర్పించడమే లక్ష్యంగా సాగుతున్నట్లు వివరించారు.