‘ఎడ్యుకేట్‌ గాళ్స్‌’కు ‘మెగసెసే’ అవార్డు  | Educate Girls NGO wins Ramon Magsaysay Award 2025 | Sakshi
Sakshi News home page

‘ఎడ్యుకేట్‌ గాళ్స్‌’కు ‘మెగసెసే’ అవార్డు 

Sep 1 2025 5:17 AM | Updated on Sep 1 2025 5:17 AM

Educate Girls NGO wins Ramon Magsaysay Award 2025

మనీలా: మనదేశంలో బాలికల విద్యకోసం పనిచేస్తున్న ప్రముఖ ఎన్జీవో ‘ఎడ్యుకేట్‌ గాళ్స్‌’ప్రతిష్టాత్మక రామన్‌ మెగసెసే–2025 అవార్డును గెలుచుకుంది. ఈ పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి భారతీయ సంస్థగా రికార్డు సృష్టించింది. ‘ఎడ్యుకేట్‌ గాళ్స్‌ ద్వారా మారూమూల ప్రాంతాల్లోని బాలికలు, యువతులకు విద్యనందిస్తోంది. వారిలోని నైపుణ్యాలను వెలికి తీసి సామర్థ్యాన్ని, ధైర్యాన్ని నింపుతోంది. 

ఎంతో నిబద్ధత, అంకితభావంతో ఈ పని చేస్తున్న సఫీనా హుస్సేన్‌ ఆసియాలో అత్యున్నత గౌరవానికి ఎంపికైంది’రామన్‌ మెగసెసే అవార్డ్‌ ఫౌండేషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన మాల్దీవులకు చెందిన షాహినా అలీ, ఫిలిప్పీన్స్‌కు చెందిన ఫ్లావియానో ఆంటోనియో ఎల్‌ విల్లానుయేవా కూడా ఈ అవార్డును దక్కించుకున్నారు. నవంబర్‌ 7న మనీలాలోని మెట్రోపాలిటన్‌ థియేటర్‌లో జరిగే అవార్డు ప్రదానోత్సవ వేడుకలు జరుగుతాయి. 

ఈ అవార్డు ఎడ్యుకేట్‌ గాళ్స్‌కే కాదు.. మొత్తం దేశానికే చారిత్రాత్మకమైదని సంస్థ వ్యవస్థాపకురాలు సఫీనా హుస్సేన్‌ అన్నారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ గ్రాడ్యుయేట్‌ అయిన సఫీనా హుస్సేన్‌ 2007లో ఎడ్యుకేట్‌ గాళ్స్‌ను స్థాపించారు. అప్పటివరకూ శాన్‌ఫ్రాన్సిస్కోలో పనిచేసిన ఆమె..మహిళల నిరక్షరాస్యతపై పనిచేయాలని భారత్‌కు తిరిగొచ్చారు. రాజస్థాన్‌లో తన సేవను ప్రారంభించారు. చదువుకోని లేదా బడి బయట ఉన్న బాలికలను తరగతి గదిలోకి తీసుకొచ్చారు. లక్షలాది మంది యువతులకు ఉన్నత విద్యతోపాటు, ఉపాధి కల్పించే విద్యనందించేందుకు కృషి చేస్తున్నారు.  

ఆసియా నోబెల్‌గా పిలుచుకునే రామన్‌ మెగసెసే అవార్డు ప్రజలకు నిస్వార్థ సేవలందించిన, సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తులు, సంస్థలకు అందజేస్తారు. ఫిలిప్పీన్స్‌ మాజీ అధ్యక్షుడు రామన్‌ మెగసెసే జ్ఞాపకార్థం 1957లో అవార్డును నెలకొల్పారు. రామన్‌ మెగసెసే పతకం, ప్రశంసా పత్రంతోపాటు నగదు బహుమతిని అందజేస్తారు. భారత్‌ నుంచి గతంలో రామన్‌ మెగసెసే అవార్డును గెలుచుకున్న వారిలో మదర్‌ థెరిసా (1962), జయప్రకాష్‌ నారాయణ్‌ (1965), చిత్రనిర్మాత సత్యజిత్‌ రే (1967), జర్నలిస్ట్‌ రవీష్‌ కుమార్‌ (2019), పర్యావరణ కార్యకర్త సోనమ్‌ వాంగ్చుక్‌ (2018), అరవింద్‌ కేజ్రీవాల్‌ (2006), ఆర్టీఐ కార్యకర్త అరుణా రాయ్‌ (2000), కిరణ్‌ బేడి (1994) జర్నలిస్ట్‌ అరుణ్‌ శౌరి (1982) ఉన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement