breaking news
Asian Nobel
-
ఆడపిల్ల చదువుకు జీవితాన్ని ఇచ్చింది
‘ప్రపంచంలో చదువుకు దూరమైన అతి ఎక్కువ మంది ఆడపిల్లలున్న దేశం భారత్ ఒక్కటే’ అంటారు సఫీనా హుసేన్. స్కూల్లో ఉన్న ఆడపిల్లల కంటే స్కూల్ మానేసిన ఆడపిల్లలు ఎక్కువ ఉండటంతోవారిని తిరిగి స్కూళ్లకు పంపడానికి ఆమె ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ స్థాపించారు. ఏళ్ల తరబడి ఆమె సాగించిన కృషి బాలికల జీవితాల్లో చదువును తెచ్చింది. ఆమెకు ‘రామన్ మెగసెసె ఆవార్డు’ తెచ్చిపెట్టింది. ఆసియా నోబెల్‌గా భావించే రామన్ మెగసెసెను సఫీనా స్థాపించిన ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ ఎన్.జి.ఓకు ప్రకటించారు.‘మారుమూల గ్రామంలో అయినా సరే ఏ ఒక్క ఆడపిల్ల స్కూలుకు వెళ్లకుండా ఉండకూడదు. అదే మా ఎడ్యుకేట్ గర్ల్స్ లక్ష్యం’ అంటారు సఫీనా హుసేన్. 54 ఏళ్ల ఈ సామాజిక కార్యకర్త 2007 లో బాలికా విద్య కోసం ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ ఎన్.జి.ఓను స్థాపించారు. ఆ రోజు నుంచి ఈరోజు వరకూ సుమారు నాలుగు లక్షల మంది బాలికలను అక్షరాస్యత వైపు నడిపించారు. అందుకే ఆమె సంస్థకు ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసె అవార్డు 2025ను ప్రకటించారు. 1958 నుంచి ఇస్తున్న ఈ అవార్డు కింద 50 వేల యు.ఎస్.డాలర్ల నగదు కూడా ఉంటుంది.‘ఎడ్యుకేట్ గర్ల్స్‌కు రామన్ మెగసెసే అవార్డు రావడం చాలా సంతోషాన్నిచ్చింది. ఇదొక చారిత్రాత్మక క్షణం. భారతదేశంలో బాలికల విద్యకోసం ప్రజలతో కలిసి మేము చేస్తున్న ఈ ఉద్యమం గురించి ఈ అవార్డు వల్ల ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది. బాలికలను శక్తిమంతం చేయడానికి, వారు అడ్డంకులను ఛేదించి మరిన్ని విజయాలు సాధించడానికి మనమంతా మరెంతో దూరం ప్రయాణించాల్సి ఉంది’ అని అవార్డు ప్రకటన తర్వాత సఫీనా అన్నారు.‘టీమ్ బాలిక’ల విజయం‘ఎడ్యుకేట్ గర్ల్స్’ ద్వారా స్కూలు మానేయించిన బాలికలను తిరిగి స్కూలుకు పంపడానికి సఫీనా ఎన్నుకున్న మార్గం ప్రతి ఊరి నుంచి ఒక చురుకైన యువతి ని కార్యకర్తగా ఎంచుకోవడం. వీరిని ‘టీమ్ బాలిక’ అంటారు. ఈ బాలికలే ఇంటింటికి తిరిగి కుటుంబాలను ఒప్పించి డ్రాపవుట్ ఆడపిల్లలను తిరిగి బడికి చేరుస్తున్నారు. 2007లో 50 గ్రామాల్లో మొదలెట్టిన ఈ కార్యక్రమం నేడు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 18 వేల గ్రామాల్లో బాలికలకు విద్యనందించేందుకు కృషి చేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలో 13 వేల మంది యువతులు టీమ్ బాలికలుగా గ్రామాల్లో పని చేస్తున్నారు. ‘నా ఊరు.. నా సమస్య... నేనే సమాధానం’ అనేది వీరి నినాదం. తమ ఊరిని తామే బాగు చేసుకుందామని వీరు ముందుకొస్తే పెద్దలు మద్దతు తెలుపుతున్నారు. ‘స్కూలు మాన్పించి ఇంటి పనులు చేయించడం బాలికల కలలను ఛిద్రం చేయడమే’ అంటారు సఫీనా. కేవలం బాలికల్ని బడికి పంపడమే కాకుండా పాఠశాలలకు సౌకర్యాలు అందించడం, బాగా చదివే పిల్లలను కళాశాలల్లో చేర్పించడం, వారి ఆరోగ్యంపై శ్రద్ధ చూపించడం వంటివి కూడా ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ చేపడుతుంది.ఎవరీ సఫీనా?సఫీనా హుస్సేన్ 1971లో దిల్లీలో జన్మించారు. ఈమె తండ్రి యూసఫ్ హుసేన్ అనే టీవీ నటుడు. ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్’ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సఫీనా 1998 నుంచి 2004 వరకు శాన్ ఫ్రాన్సిస్కోలోని ‘చైల్డ్ ఫ్యామిలీ హెల్త్ ఇంటర్నేషనల్’కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2005లో అమెరికా నుంచి ముంబయికి తిరిగొచ్చిన ఆమె స్థానిక పరిస్థితులను పరిశీలించారు. ప్రపంచంలో స్త్రీల జీవన విధానాలు అత్యంత దుర్భరంగా ఉన్న 20 దేశాల్లో భారత్ కూడా ఉందన్న సర్వే వివరాలు తెలుసుకొని ఆమె కలవరపడ్డారు. ప్రధానంగా విద్య విషయంలో తల్లిదండ్రులు ఆడ, మగ అంటూ భేదం చూపించడం, కొడుకును చదివిస్తూ కూతుర్ని ఇంటి పనుల్లో పెట్టడం వంటివి ఆమెను ఆలోచింపజేశాయి. ఆ పరిస్థితి మారాలంటే పల్లెల నుంచి పని మొదలుపెట్టాలని భావించారు. అలా 2007లో ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఈమె చేస్తున్న కృషి నచ్చి కత్రినా కైఫ్ తనకు తానుగా ముందుకొచ్చి ‘ఎడ్యుకేట్ గర్ల్స్’కు అంబాసిడర్‌గా, టీమ్ బాలికగా పని చేశారు.2035 నాటికి కోటి మంది బాలికలు‘ఎడ్యుకేట్ గర్ల్స్’ చేసిన కృషి ఫలితంగా లక్షలాది బాలికలు బడులకు చేరి అక్షరాలు దిద్దారు. వారిలో కొందరు స్కూళ్లు దాటి కాలేజీల్లోనూ అడుగుపెట్టారు. ఇదంతా సమష్టి కృషితో సాధ్యం అంటారు సఫీనా హుస్సేన్. సంస్థ నిర్వహణలో తనకు సాయం అందించినవారు, తనతో కలిసి పనిచేస్తున్నవారందరి కృషి ఈ విజయంలో ఉందని అంటున్నారు. 2035 నాటికి కోటి మంది బాలికల్ని బడుల్లో చేర్పించడమే లక్ష్యంగా సాగుతున్నట్లు వివరించారు. -
‘ఎడ్యుకేట్ గాళ్స్’కు ‘మెగసెసే’ అవార్డు
మనీలా: మనదేశంలో బాలికల విద్యకోసం పనిచేస్తున్న ప్రముఖ ఎన్జీవో ‘ఎడ్యుకేట్ గాళ్స్’ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే–2025 అవార్డును గెలుచుకుంది. ఈ పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి భారతీయ సంస్థగా రికార్డు సృష్టించింది. ‘ఎడ్యుకేట్ గాళ్స్ ద్వారా మారూమూల ప్రాంతాల్లోని బాలికలు, యువతులకు విద్యనందిస్తోంది. వారిలోని నైపుణ్యాలను వెలికి తీసి సామర్థ్యాన్ని, ధైర్యాన్ని నింపుతోంది. ఎంతో నిబద్ధత, అంకితభావంతో ఈ పని చేస్తున్న సఫీనా హుస్సేన్ ఆసియాలో అత్యున్నత గౌరవానికి ఎంపికైంది’రామన్ మెగసెసే అవార్డ్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన మాల్దీవులకు చెందిన షాహినా అలీ, ఫిలిప్పీన్స్‌కు చెందిన ఫ్లావియానో ఆంటోనియో ఎల్ విల్లానుయేవా కూడా ఈ అవార్డును దక్కించుకున్నారు. నవంబర్ 7న మనీలాలోని మెట్రోపాలిటన్ థియేటర్లో జరిగే అవార్డు ప్రదానోత్సవ వేడుకలు జరుగుతాయి. ఈ అవార్డు ఎడ్యుకేట్ గాళ్స్‌కే కాదు.. మొత్తం దేశానికే చారిత్రాత్మకమైదని సంస్థ వ్యవస్థాపకురాలు సఫీనా హుస్సేన్ అన్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అయిన సఫీనా హుస్సేన్ 2007లో ఎడ్యుకేట్ గాళ్స్‌ను స్థాపించారు. అప్పటివరకూ శాన్ఫ్రాన్సిస్కోలో పనిచేసిన ఆమె..మహిళల నిరక్షరాస్యతపై పనిచేయాలని భారత్‌కు తిరిగొచ్చారు. రాజస్థాన్‌లో తన సేవను ప్రారంభించారు. చదువుకోని లేదా బడి బయట ఉన్న బాలికలను తరగతి గదిలోకి తీసుకొచ్చారు. లక్షలాది మంది యువతులకు ఉన్నత విద్యతోపాటు, ఉపాధి కల్పించే విద్యనందించేందుకు కృషి చేస్తున్నారు. ఆసియా నోబెల్‌గా పిలుచుకునే రామన్ మెగసెసే అవార్డు ప్రజలకు నిస్వార్థ సేవలందించిన, సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తులు, సంస్థలకు అందజేస్తారు. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే జ్ఞాపకార్థం 1957లో అవార్డును నెలకొల్పారు. రామన్ మెగసెసే పతకం, ప్రశంసా పత్రంతోపాటు నగదు బహుమతిని అందజేస్తారు. భారత్ నుంచి గతంలో రామన్ మెగసెసే అవార్డును గెలుచుకున్న వారిలో మదర్ థెరిసా (1962), జయప్రకాష్ నారాయణ్ (1965), చిత్రనిర్మాత సత్యజిత్ రే (1967), జర్నలిస్ట్ రవీష్ కుమార్ (2019), పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ (2018), అరవింద్ కేజ్రీవాల్ (2006), ఆర్టీఐ కార్యకర్త అరుణా రాయ్ (2000), కిరణ్ బేడి (1994) జర్నలిస్ట్ అరుణ్ శౌరి (1982) ఉన్నారు. -
జర్నలిస్ట్ రవీశ్‌కు మెగసెసె అవార్డు
మనీలా: ఆసియా నోబెల్‌గా అభివర్ణించే ప్రఖ్యాత రామన్ మెగసెసె పురస్కారం ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు, ఎన్డీటీవీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీశ్ కుమార్‌ను వరించింది. 2019 ఏడాదికి గాను రవీష్ ఈ అవార్డును గెలుచుకున్నట్లు రామన్ మెగసెసె ఫౌండేషన్ శుక్రవారం ప్రకటించింది. నిస్సహాయుల గొంతుకగా నిలిచినందుకుగాను ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ పేర్కొంది. అలాగే భారత్దేశ టెలివిజన్ జర్నలిస్టుల్లో అత్యంత ప్రతిభావంతమైన వారిలో రవీశ్ ఒకరని కొనియాడింది. రవీష్‌తోపాటు మరో నలుగురు ఆసియా నుంచి మెగసెసె–2019 పురస్కారానికి ఎంపికయ్యారు. వారిలో కో స్వీ విన్(మయన్మార్), అంగ్ఖానా నిలపైజిత్(థాయిలాండ్), రేముండో పుజాంతే కాయాబ్యాబ్(ఫిలిప్పీన్స్), కిమ్ జాంగ్ కి(దక్షిణ కొరియా) ఉన్నారు. వీరందరికీ ఆగస్టు 31వ తేదీన ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఆసియా నోబెల్‌గా పరిగణించే ఈ అవార్డును 1957లో ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసె జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు. ఆసియా అత్యున్నత పురస్కారంగా పిలిచే ఈ అవార్డును వ్యక్తులు లేదా సంస్థలకు రామన్ మెగసెసే ఫౌండేషన్ ఏటా అందిస్తోంది. గతంలో భారత్ నుంచి రామన్ మెగసెసె అవార్డును ఆర్కే లక్ష్మణ్, పి.సాయినాథ్, అరుణ్ శౌరి, కిరణ్ బేడీ, అర్వింద్ కేజ్రీవాల్ అందుకున్నారు. రవీష్ ప్రస్థానం.. బిహార్‌లోని జిత్వార్పూర్ గ్రామం లో రవీశ్ జన్మించారు. ప్రముఖ న్యూస్ చానల్ ఎన్డీటీవీలో రిపోర్టర్‌గా 1996లో పాత్రికేయ వృత్తిని ప్రారంభించారు. అనంతరం ఎన్డీటీవీ హిందీ భాషలో తొలిసారి 24 గంటల చానల్‌ను ప్రారంభించడంతో అందులో ఆయన ప్రైమ్ టైమ్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రైమ్ టైమ్ కార్యక్రమం ద్వారా అంతగా వెలుగులోకి రాని సామాన్యుల సమస్యలను దేశానికి చూపించే ప్రయత్నం చేశారని ఫౌండేషన్ పేర్కొంది. అనేక ఒత్తిడులు ఉండే మీడియా వాతావరణంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారని తెలిపింది. వాస్తవాల ఆధారిత రిపోర్టింగ్ పద్ధతులను ఆచరించేవారని, నైతికతతో తన వృత్తిని నిర్వహించేవారని వెల్లడించింది. -
భారతీయులకు మెగసెసె
మనీలా: ఆసియన్ నోబెల్‌గా పేరుగాంచిన రామన్ మెగసెసె అవార్డుకు ఈ ఏడాది ఇద్దరు భారతీయులు ఎంపికయ్యారు. వీధుల్లో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న వ్యక్తులకు ఉచిత చికిత్స అందిస్తున్న మానసికవైద్యుడు భరత్ వాత్వానీతో పాటు లడఖ్ యువత జీవితాల్లో వెలుగునింపిన ఇంజనీర్ సోనమ్ వాంగ్‌చుక్‌లను ఈ అవార్డు వరించింది. ముంబైకి చెందిన వాత్వానీ.. వీధుల్లో తిరుగుతున్న మతిస్థిమితం లేనివారికి ఆహారం, ఆశ్రయం ఇవ్వడంతో పాటు ఉచిత చికిత్సను అందిస్తున్నారనీ మెగసెసె ఫౌండేషన్ ప్రశంసించింది. 1988లో శ్రద్ధ రిహాబిలిటేషన్ ఫౌండేషన్‌ను స్థాపించి వాత్వానీ దంపతులు ఎనలేని సేవచేస్తున్నారు. ‘త్రీ ఇడియట్స్’ సినిమాలో ఆమిర్ ఖాన్ పాత్రకు స్ఫూర్తిగా నిలిచిన ఇంజనీర్ వాంగ్ చుక్.. తన విభిన్నమైన, సృజనాత్మక బోధనా పద్ధతులతో ఈశాన్య భారతం,లడఖ్ యువత జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నారని ఫౌండేషన్ కితాబిచ్చింది. వీరిద్దరితో పాటు కంబోడియాకు చెందిన యూక్ ఛాంగ్, తూర్పు తైమూర్‌కు చెందిన మరియా డీ లౌర్డెస్, ఫిలిప్పీన్స్‌కు చెందిన హోవర్డ్ డీ, వియత్నాంకు చెందిన హోథి హోంగ్ యన్లు అవార్డుకు ఎంపికయ్యారు. విజేతలకు ప్రశంసా పత్రంతో పాటు మెగసెసె ముఖాకృతి ఉన్న మెడల్, రూ.20.6 లక్షల నగదు బహుమతి ప్రదానంచేయనున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని నగరం మనీలాలో ఉన్న సాంస్కృతిక కేంద్రంలో ఆగస్టు 10న ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. -
దక్షిణాఫ్రికా వీరుడికి ఆసియా నోబెల్ ప్రదానం
తైపీ: దక్షిణాఫ్రికాలో జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాడిన అల్బీ సాచ్స్, నార్వేలో పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసిన ఆ దేశ మాజీ ప్రధాని గ్రో హాలెమ్ బ్రంట్‌లాండ్ సహా ఐదుగురికి గురువారం ఆసియా నోబెల్‌గా పేరొందిన ‘తాంగ్ ప్రైజ్’ను తైవాన్ అధ్యక్షుడు మా యింగ్ జ్యూ ప్రదానం చేశారు. పర్యావరణం, మానవహక్కులు, వైద్యం, చైనా చరిత్ర.. రంగాల్లో అద్వితీయ సేవలందించిన వారికి ఈ అవార్డ్‌ను ప్రకటించారు. 2012లో తైవాన్‌లో అత్యంత ధనవంతుల్లో ఒకరైన సామ్యూల్ యిన్ ప్రసిద్ధ చైనా రాజవంశం ‘తాంగ్’ పేరుమీద ఈ అవార్డ్‌ను నెలకొల్పారు. పురస్కార గ్రహీతలకు 5 కోట్ల తైవాన్ డాలర్లు(రూ.10.33 కోట్లు) అందిస్తారు. ఇది నోబెల్ విజేతలకు లభించే మొత్తంకన్నా ఎక్కువ. 2014 నుంచే ఈ అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు.