breaking news
Ramon Magsaysay award winner
-
పాక్ హక్కుల కార్యకర్త రెహ్మాన్ మృతి
లాహోర్: ప్రముఖ పాకిస్తాన్ మానవ హక్కుల కార్యకర్త, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత ఐఏ రెహ్మాన్(90) సోమవారం లాహోర్‌లో కన్నుమూశారు. పాక్‌లోని హిందు, క్రైస్తవ మైనారిటీల తరఫున గళం వినిపించి, రాజ్యాంగంలో దైవదూషణకు సంబంధించిన కఠినమైన చట్టాలను రద్దు కోసం పోరాడారు. భారత్–పాక్‌ల మధ్య శాంతి నెలకొనేందుకు విశేష కృషి చేశారు. డయాబెటిస్‌తోపాటు తీవ్ర రక్తపోటుతో బాధపడుతున్న ఆయనకు కరోనా సోకడంతో రెండు రోజులుగా ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని కుటుంబసభ్యులు తెలిపారు. రెహ్మాన్‌కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అవిభాజ్య భారత్‌లోని హరియాణాలో 1930లో జన్మించిన రెహ్మాన్ జర్నలిస్ట్‌గా వివిధ పత్రికల్లో 65 ఏళ్లపాటు పనిచేశారు. పాకిస్తాన్–ఇండియా పీపుల్స్ ఫోరం ఫర్ పీస్ అండ్ డెమోక్రసీ వేదిక వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన కూడా ఒకరు. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ (హెచ్ఆర్సీపీ)కి రెండు దశాబ్దాలపాటు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన మృతికి హెచ్ఆర్సీపీ చైర్పర్సన్ జోహ్రా యూసఫ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
హక్కులు హరిస్తూనే స్వేచ్ఛా పలుకులా?
దళిత స్త్రీ శక్తి సభలో రామన్ మెగసెసె అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ సాక్షి, హైదరాబాద్: హక్కులు హరించి వేస్తున్నవారే స్వేచ్ఛా స్వాతంత్య్రాలను గురించి మాట్లాడుతున్నారని రామన్ మెగసెసె అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘సంకెళ్లను తెంచుకుందాం’ అనే నినాదంతో హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో దళిత స్త్రీ శక్తి ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. ‘అంబేడ్కర్ ఎవరికోసం పోరాడారో, ఎవరికోసం పరితపించారో, ఆ దళితుల బిడ్డలే ఈ దేశంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజున సెప్టిక్ ట్యాంకుల్లో శవాలై తేలుతున్నారు. సెప్టిక్ ట్యాంక్‌లో పడి మరణించిన వారి దుఃఖాన్ని దిగమింగుకొనేందుకు వారి శవాల ముందు నా జాతి బిడ్డలు చిందులేస్తున్నారని’ విల్సన్ గద్గద స్వరంతో అన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ స్వచ్ఛభారత్ నినాదం ప్రజల్ని మభ్య పెట్టే ఒక ఎజెండానే తప్ప మానసిక పరివర్తనతో వచ్చింది కాదన్నారు. దేశంలో కేవలం దళితులపైనే దాడులు జరుగుతున్నాయని, ఆ తరువాత వరుసలో ముస్లింలు ఉన్నారన్నారు. బహుజనులు కూడా దళితులను అణచివేసేవారేననడంలో సందేహం అక్కర్లేదన్నారు. రెయిన్ బో హోం నిర్వాహకురాలు అనురాధ మాట్లాడుతూ మానవ మలమూత్రాలను ఎత్తివేసే పనిని దళితులే చేస్తున్నారని, దీనిని ఉపాధి అనడం ఈ సమాజానికే అవమానకరం అన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ , దళిత స్త్రీశక్తి కన్వీనర్ గెడ్డం ఝాన్సీ, నర్రా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.