అడవి నుంచి ఐరాస వరకు... | Sonajharia Minz, India first tribal woman to become a UNESCO Co-Chair | Sakshi
Sakshi News home page

అడవి నుంచి ఐరాస వరకు...

Jul 12 2025 6:06 AM | Updated on Jul 12 2025 6:06 AM

Sonajharia Minz, India first tribal woman to become a UNESCO Co-Chair

ఫస్ట్‌ టైమ్‌

‘సంస్కృతం పలకడానికి నీకు నోరు తిరగదు. నేర్చుకోవడం నీ వల్ల కాదు’ అన్నారు సంస్కృతం టీచర్‌. ‘నీలాంటి మొద్దు బుర్రలకు లెక్కలు అర్థం కావు’ అన్నారు 
మ్యాథ్స్‌ టీచర్‌. బాగా చదువుకోవాలనే ఆశతో స్కూల్‌లోకి అడుగు పెట్టిన  ఆదివాసీ అమ్మాయికి అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. ఆ అవమానాలకు తన ప్రతిభతో జవాబు చెప్పింది. యూనివర్శిటీ వైస్‌–చాన్స్‌లర్‌ స్థాయికి ఎదిగింది జార్ఖండ్‌కు చెందిన సోనాజ్‌ హరియ మింజ్‌. తాజాగా యునెస్కోలోని ఇండిజినస్‌ నాలెడ్జ్, రీసెర్చ్‌ అండ్‌ గవర్నెన్స్‌ (ఐకెఆర్‌జీ) కో–చైర్‌పర్సన్‌గా నియామకం అయిన  తొలి ఆదివాసీ మహిళగా చరిత్ర సృష్టించింది...

సోనాజ్‌ మింజ్‌కు బాగా చదువుకోవాలని కోరిక. అడవిలో ఉండేవాళ్లకు చదువు ఎందుకు! అనే వాళ్లు చాలామంది. ‘సంస్కృతం అనేది ఆర్యుల భాష. నీలాంటి వాళ్లకు ఎలా వస్తుంది!’ అన్నారు సంస్కృతం టీచర్‌. ‘నీలాంటి వాళ్లకు లెక్కలు ఎలా వస్తాయి!’ అన్నారు మ్యాథ్స్‌ టీచర్‌.

స్కూల్లో చేరిన కొత్తలో భాషాపరమైన సమస్యలను మింజ్‌ ఎదుర్కొంది. ఇంట్లో మాట్లాడే ఆదివాసీ భాష తప్ప మరే భాషా తనకు రాదు. అయితే మ్యాథ్స్‌ బాగా చేసేది.
ఆదివాసీ అమ్మాయి అనే కారణంగా మింజ్‌ను చేర్చుకోవడానికి రాంచీలోని ఒక ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ నిరాకరించింది.

‘నన్నే ఎందుకు అవమానిస్తున్నారో మొదట్లో అర్థం కాలేదు. చాలా కాలానికి అర్థమైంది. నేను ఆదివాసీ అమ్మాయిని అనే కారణంగానే అవమానిస్తున్నారు అని’ గతాన్ని గుర్తు తెచ్చుకుంది మింజ్‌. అయితే అవమానాలు ఆమె చదువుకు అడ్డుగోడలు కాలేకపోయాయి. బాగా చదువుకోవాలి అనే కసిని పెంచాయి.

మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీ తరువాత దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రు యూనివర్శిటీలో ఎంఫిల్‌ చేసింది మింజ్‌. భోపాల్‌లోని బర్కతుల్లా యూనివర్శిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేసింది. కొన్ని సంవత్సరాల తరువాత తమిళనాడులోని మదురై కామరాజ్‌ యూనివర్శిటీలో పనిచేసింది. కంప్యూటర్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ చేసిన మింజ్‌ జేఎన్‌యూలో ప్రొఫెసర్‌గా పనిచేసింది.

జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో పరిశోధనాత్మక వ్యాసాలు రాసింది. అంతర్జాతీయ సదస్సులలో పరిశోధన వ్యాసాలు సమర్పించింది. జేఎన్‌యూలో ‘స్కూల్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అండ్‌ సిస్టమ్స్‌ సైన్సెస్‌’ డీన్‌గా, జవహర్‌లాల్‌ నెహ్రు యూనివర్శిటీ టీచర్స్‌ అసోసియేషన్స్‌ అధ్యక్షురాలిగా పనిచేసింది. ఎంత స్థాయికి ఎదిగినా తాను నడిచి వచ్చిన దారి మరవలేదు మింజ్‌. దళిత, ఆదివాసీ హక్కుల కోసం పనిచేసింది. జేఎన్‌యూలో ఈక్వల్‌ ఆపర్చునిటీ ఆఫీస్‌ (ఈవోవో) ప్రధాన సలహాదారుగా పనిచేసింది.

జార్ఖండ్‌లోని ఎస్‌కేఎం యూనివర్శిటీ వైస్‌ చాన్స్‌లర్‌గా ఆమె ప్రస్థానం మరోస్థాయికి చేరింది. వైస్‌ చాన్సలర్‌ హోదాలో ఆదివాసీ కళలు, భాష కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించింది. తాజాగా... యునెస్కోలోని ఇండిజినస్‌ నాలెడ్జ్, రిసెర్చ్‌. గవర్నెన్స్‌ (ఐకెఆర్‌జీ) కో– చైర్‌పర్సన్‌గా నియామకం అయింది. ‘నేను భవిష్యత్‌లో మ్యాథ్స్‌ టీచర్‌ అవుతాను’ అని స్కూల్‌ రోజుల్లో బలంగా అనుకునేది మింజ్‌. అయితే మింజ్‌ పడిన కష్టం, ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని పట్టుదల ఆమెను మరింత ఉన్నతస్థాయికి తీసుకువెళ్లడమే కాదు ఎంతోమంది ఆదివాసీ అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చేలా చేసింది.

ఆ మాటను సవాలుగా తీసుకొని...
స్కూల్లో హోంవర్క్‌ ఇచ్చినప్పుడు సింగిల్‌ మిస్టేక్‌ లేకుండా చేసేదాన్ని. ‘ఇది చాలదు. నువ్వు అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి’ అన్నారు ఒక టీచర్‌. ఆమె మాటలను సవాలుగా తీసుకొని ఫస్ట్‌ ర్యాంక్‌ తెచ్చుకున్నాను. ఇక అప్పటి నుంచి ఫస్ట్‌ ర్యాంక్‌ ఎప్పుడూ నాతోనే ఉండిపోయింది. మొదట్లో వెటకారాలు, అవమానాల సంగతి ఎలా ఉన్నా స్కూల్‌ ఫస్ట్‌ రావడంతో ఉపాధ్యాయులు ఎంతో ప్రోత్సహించారు. చదువుతో పాటు ఆటలు అన్నా ఇష్టం. యూనివర్శిటీ లెవెల్లో హాకీ ఆడాను. అయితే చదువు మీదే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఆటలకు దూరం అయ్యాను.
– సోనాజ్‌ హరియ మింజ్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement