
ముడుమాల్‌లోని ఆదిమానవుల స్మారక శిలల ప్రాంగణంలో పవర్‌గ్రిడ్ టవర్లు
ప్రస్తుతం యునెస్కో వారసత్వ హోదా పరిశీలనలో ఆ ప్రాంగణం
ప్రపంచ వారసత్వ హోదా దక్కాలంటే ఆ టవర్లు తప్పుకోవాల్సిందే
పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌తో చర్చించి టవర్లు తరలించేందుకు ప్రభుత్వ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: అవి మామూలు రాళ్లు కాదు, మూడున్నర వేల ఏళ్ల క్రితం పాతిన ఆది మానవుల స్మారక శిలలు. సమీప భవిష్యత్‌లో ప్రపంచ వారసత్వ సంపద హోదాను దక్కించుకునే ప్రయత్నంలో ఉన్న అత్యంత చారిత్రక ప్రాధాన్యం ఉన్న శిలలు. ఇంతకాలం ఆలనాపాలనా లేక నిలబడి కొన్ని, వంగిపోయి కొన్ని, కూలిపోయి మరికొన్ని ఉండిపోగా..అనుకున్నది అనుకున్నట్టు జరిగి యునెస్కో గుర్తింపు పొందితే ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునే నిలువు రాళ్లవి.
అంత ప్రాధాన్యం ఉన్న అతి పురాతన శిలలు కావటంతో, ఇప్పుడు వాటి కోసం జాతీయ పవర్ గ్రిడ్‌కు చెందిన భారీ టవర్లు పక్కకు తప్పుకోబోతున్నాయి. కర్ణాటక–తెలంగాణ సరిహద్దులో కృష్ణానది తీరంలోని ముడుమాల్ గ్రామ శివారులో ఆదిమానవులు ఏర్పాటు చేసిన భారీ గండ శిలలు ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) గుర్తింపు పొందేందుకు పరిశీలనలో ఉన్నాయి. వీటి ప్రాధాన్యాన్ని గుర్తించిన యునెస్కో ఇప్పటికే వాటిని తాత్కాలిక జాబితాలో చేర్చింది.
ఆ టవర్లే అడ్డు...
ఇలాంటి కీలక తరుణంలో ఆ నిలువు రాళ్ల ప్రాంగణంలో ఉన్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టవర్లు నిపుణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముడుమాల్‌కు దాదాపు పది కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఆవల కర్ణాటకలో రాయచూర్ విద్యుత్ కేంద్రం ఉంది. అక్కడి నుంచి విద్యుత్‌ను పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ప్రత్యేక లైన్ల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని గుత్తికి తరలిస్తోంది. ఈ లైన్ల తాలూకు టవర్లు సరిగ్గా ముడుమాల్ నిలువు రాళ్ల ప్రాంగణం మీదుగా సాగుతున్నాయి. అందులో ఓ టవర్ సరిగ్గా నిలువు రాళ్లున్న చోటుకు కాస్త పక్కనే ఉంది.
లైన్లు మాత్రం సరిగ్గా నిలువు రాళ్ల మీదుగా సాగుతున్నాయి. మరో టవర్ ఈ నిలువ రాళ్లకు చేరువగా ఉన్న రాకాసి గుండుŠల్ (ఆదిమానవులు సమాధి ప్రాంతంలో ఏర్పాటు చేసుకునే పెద్ద రాతి గుండ్లు) ఉన్న ప్రాంతంలో ఉంది. మరో టవర్ దానికి కాస్త పక్కగా ఉంది. వెరసి మూడు టవర్లు ఆ ప్రాంగణం వద్దనే ఉన్నాయి. ఓ చారిత్రక ప్రాంతానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చే ముందు చాలా అంశాలను యునెస్కో పరిశీలిస్తుంది.
ఆ ప్రాంతం ప్రత్యేకతకు అడ్డుగా కనిపించేలా భారీ టవర్లు ఉండకూడదనేది దాని నిబంధనల్లో ఒకటి. మరో ఏడాదిన్నరలో యునెస్కోకు డోషియర్‌ను సమర్పించనున్నారు. ఆ డోషియర్‌లో పేర్కొన్న ప్రత్యేకతలు ఆ ప్రాంతంలో ఉన్నాయా లేదా అని పరిశీలించేందుకు యునెస్కో ప్రతినిధులు వస్తారు. వారు వచ్చే నాటికి టవర్లు అడ్డుగా ఉంటే గుర్తింపునకు అవకాశాలు మూసుకుపోతాయి. ఈలోపే టవర్లను తరలించాల్సి ఉంటుంది. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని నిపుణుల బృందం ప్రభుత్వానికి తాజాగా విజ్ఞప్తి చేసింది.
ఇదీ ఆ రాళ్ల ప్రత్యేకత...
దాదాపు మూడున్నర వేల నుంచి నాలుగు వేల సంవత్సరం క్రితం ఆదిమానవులు ఆ రాళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కోటి 10 అడుగుల నుంచి 15 అడుగుల ఎత్తున పెద్ద నిలువు రాళ్లను ఆదిమానవుల సమూహంలోని ముఖ్యుల సమాధులకు స్మారక శిలలుగా వాటిని ఏర్పాటు చేశారు. గతంలో వందల సంఖ్యలో ఉన్న రాళ్లు, వ్యవసాయ పనుల వల్ల ధ్వంసమై ప్రస్తుతం కేవలం 80 మాత్రమే మిగిలాయి.
ఇక, వాటికి కనీసం 500 ఏళ్ల పూర్వం ఇదే తరహాలో వందల సంఖ్యలో పెద్ద రాతి గుండ్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అలాంటి గుండ్లు 1200 ఉన్నాయి.. ఇవి స్మారక శిలలే అయినా, ఆ రాతి నీడల ఆధారంగా నాటి వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు వినియోగించారని పరిశోధనలో గుర్తించారు.
ఆకాశంలో సప్తర్షి మండలం(ఉర్సామెజర్)గా పరిగణించి నక్షత్రాల సమూహం ఉన్న ఆకృతి ఈ నిలువు శిలల వద్ద చెక్కి ఉంది. అది మూడున్నర వేల ఏళ్ల క్రితం చెక్కినదేనని పరిశోధకులు తేల్చారు. నక్షత్ర గమనం, రాళ్ల నీడల గమనం... తదితరాల ఆధారంగా వాతావరణంలో మార్పులు, కాలాల ఆగమనం, విపత్తుల అంచనా... ఇలా గుర్తించేవారని నిపుణులు పేర్కొంటున్నారు.