
గిరిజన మహిళ హత్యాచారం కేసును ఛేదించిన పోలీసులు
నిందితుడిపై ఏడు కేసులు..13వ తేదీన జీవితఖైదు విధించిన కోర్టు
మెదక్ మున్సిపాలిటీ: హత్య కేసులో తనకు ఎలాగైనా శిక్ష పడుతుందని భావించిన ఓ నిందితుడు మరో ఘాతు కానికి పాల్పడ్డాడు. గిరిజన మహిళకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి హత్యాచారం చేశాడు. సంచలనం సృష్టించిన మెదక్ జిల్లా కొల్చారం మండలం పొతంశెట్టిపల్లి వద్ద జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు గల కారణాలు తెలుసుకొని పోలీసులు సైతం నివ్వెరపోయారు. మంగళవారం మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సేవాలాల్ తండాకు చెందిన ఫకీరానాయక్.. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం అంబోజిగూడ తండాలో ఉంటున్నాడు. ఈనెల 11న మెదక్‌లో అడ్డాపైకి వచి్చన సంగాయిగూడ తండాకు చెందిన గిరిజన మహిళను పనికోసమని చెప్పి బస్సులో కొల్చారం మండలం ఏడుపాయల కమాన్ వద్ద ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను చెట్టుకు కట్టేసి అత్యాచారం చేసి, బండ రాయితో కొట్టి వెళ్లిపోయాడు. కొనఊపిరితో ఉన్న ఆమెను పోలీసులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు మెదక్‌లోని పాత బస్టాండ్ వద్ద గల ఓ వైన్స్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. పాత నేరస్తుడు ఫకీరానాయక్‌ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. నిందితుడిపై ఇది వరకే ఏడు కేసులు ఉన్నాయి. మహిళ హత్య కేసుకు సంబంధించిన కేసులో శిక్ష పడుతుందన్న ఉద్దేశంతో తన కామవాంఛ తీర్చుకోవాలనుకున్నాడు. ఆమె నిరాకరించడంతో పైశాచికంగా వ్యవహరించాడు.
ఆమె ఒంటిపై ఉన్న బట్టలు తీసి చెట్టుకు కట్టేసి అత్యాచారం చేసి, అక్కడే ఉన్న రాయితో కొట్టి చంపాడు. మహిళను హత్యచేసిన సమయంలో ఎత్తుకెళ్లిన ముక్కు పుడక, హత్యకు ఉపయోగించిన రాయి, కట్టె, చర్చి వద్ద వదిలేసిన దుస్తులను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. 2020లో జరిగిన హత్య కేసులో సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ నిందితుడు ఫకీరానాయక్‌కు జీవిత ఖైదుతోపాటు రూ.15వేల జరిమానా విధించారు.