
రంజీ ట్రోఫీలో (Ranji Trophy 2025-26) భాగంగా తమిళనాడుతో ఇవాళ (అక్టోబర్ 15) మొదలైన మ్యాచ్‌లో జార్ఖండ్ ఆటగాడు, ఆ జట్టు కెప్టెన్ కూడా అయిన ఇషాన్ కిషన్ (Ishan Kishan) సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. ఐదో స్థానంలో బరిలోకి దిగిన ఇషాన్ 137 బంతుల్లో 12 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.
75 ఓవర్ల తర్వాత జార్ఖండ్ స్కోర్ 6 వికెట్ల నష్టానికి 251 పరుగులుగా ఉంది. ఇషాన్‌కు జతగా సాహిల్ రాజ్ (33) క్రీజ్‌లో ఉన్నాడు. జార్ఖండ్ ఇన్నింగ్స్‌లో శిఖర్ మోహన్ 10, శరన్‌దీప్ సింగ్ 48, కుమార్ సూరజ్ 3, విరాట్ సింగ్ 28, కుమార్ కుషాగ్రా 11, అనుకూల్ రాయ్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. తమిళనాడు బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్ 3, డీటీ చంద్రశేఖర్ 2, సందీప్ వారియర్ ఓ వికెట్ పడగొట్టాడు.
కాగా, ప్రస్తుత రంజీ ఎడిషన్ ఇవాల్టి నుంచే ప్రారంభమైంది. ఈ రోజు దేశవ్యాప్తంగా 16 మ్యాచ్‌లు జరుగతున్నాయి. ఈ ఎడిషన్‌లో ఇషాన్ కిషన్‌దే మొదటి శతకం. వేర్వేరు మ్యాచ్‌ల్లో టీమిండియా ఆటగాళ్లు దేవ్‌దత్ పడిక్కల్ (Devdutt Padikkal), రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) సెంచరీలకు చేరువై ఔటాయ్యరు.
సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో పడిక్కల్ (కర్ణాటక) 96 పరుగుల వద్ద ఔటాయ్యడు. కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో రుతురాజ్ (మహారాష్ట్ర) 9 పరుగుల తేడాతో అత్యంత అర్హమైన సెంచరీని మిస్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ తన జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు (18/5) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు.
సెంచరీతో కదంతొక్కిన టీమిండియా మాజీ వికెట్‌కీపర్
ఉత్తర్‌ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా మాజీ వికెట్‌కీపర్ శ్రీకర్ భరత్ (Srikar bharat) (ఆంధ్రప్రదేశ్) సెంచరీతో కదంతొక్కాడు. 213 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా షేక్ రషీద్ (69) క్రీజ్‌లో ఉన్నాడు. 73 ఓవర్ల తర్వాత ఆంధ్ర స్కోర్ 235/1గా ఉంది.
చదవండి: దుమ్మురేపిన రషీద్ ఖాన్