
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో (ICC ODI Rankings) ఆఫ్ఘనిస్తార్ స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్ (Rashid khan) దుమ్మురేపాడు. ఏకంగా 5 స్థానాలు ఎగబాకి నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్‌ను గద్దె దించాడు. తాజాగా బంగ్లాదేశ్‌పై అద్భుత ప్రదర్శనల (3 మ్యాచ్‌ల్లో ఓ 5 వికెట్ల ప్రదర్శన సహా 11 వికెట్లు) అనంతరం రషీద్ ఈ ఘనత సాధించాడు.
ప్రస్తుతం రషీద్ ఖాతాలో 710 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రెండో స్థానంలో ఉన్న కేశవ్ మహారాజ్‌తో పోలిస్తే రషీద్ 30 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు.
చెప్పుకోదగ్గ మార్పులు..
తాజాగా ర్యాంకింగ్స్‌లో మరో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ కూడా గణనీయంగా లబ్ది పొందాడు. పేసర్ అజ్మతుల్లా ఒమర్‌జాయ్ 19 స్థానాలు మెరుగుపర్చుకొని 21వ స్థానానికి ఎగబాకాడు. బంగ్లా బౌలర్ తంజిమ్ హసన్ 24 స్థానాలు మెరుగుపర్చుకొని 67వ స్థానానికి చేరాడు. మరో బంగ్లా బౌలర్ తన్వీర్ ఇస్లాం 27 స్థానాలు మెరుగుపర్చుకొని 97వ స్థానానికి ఎగబాకాడు. తాజాగా ర్యాంకింగ్స్‌లో బౌలింగ్ విభాగానికి సంబంధించి ఇవే చెప్పుకోదగ్గ మార్పులు.
పడిపోయిన కుల్దీప్
టీమిండియా నుంచి టాప్-10లో ఇద్దరు బౌలర్లు మాత్రమే ఉన్నారు. కుల్దీప్ యాదవ్ ఓ స్థానం కిందకు పడిపోయి 5వ స్థానంలో ఉండగా.. రవీంద్ర జడేజా 10వ స్థానాన్ని కాపాడుకున్నాడు. మహ్మద్ షమీ 14, అక్షర్ పటేల్ 37 స్థానాల్లో ఉన్నారు.
బ్యాటింగ్ విభాగానికొస్తే.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి 3, 5 స్థానాల్లో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్ 9వ ప్లేస్‌లో నిలిచాడు. బంగ్లాదేశ్‌తో తాజాగా ముగిసిన మూడో వన్డేలో తృటిలో సెంచరీ చేజార్చుకున్న ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ 8 స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు.
ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా టాప్ ర్యాంక్‌ను కోల్పోయాడు. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్‌జాయ్ అతన్ని కిందికి దించి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు నబీ, రషీద్ ఖాన్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. భారత్ తరఫున రవీంద్ర జడేజా (9) ఒక్కడే టాప్-10లో ఉన్నాడు.
చదవండి: టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ