
వైద్యులకు రాష్ట్రపతి ముర్ము పిలుపు
దియోగఢ్: వైద్యులను దేవుళ్లుగా భావించే ప్రజలతో సున్నితంగా వ్యవహరించాలని రాష్ట్రపతి ముర్ము వైద్య నిపుణులకు పిలుపునిచ్చారు. జార్ఖండ్‌లోని దియోగఢ్ ఎయిమ్స్‌లో గురువారం జరిగిన మొట్టమొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము పాల్గొన్నారు. నైతిక విలువలను పాటిస్తూ రోగుల పట్ల సహానుభూతితో ప్రేమతో మెలగాలన్నారు. వారి జీవితాల్లో చీకట్లు తొలగించాలని కోరారు.
‘గిరిజనుల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టే ఎయిమ్స్ దియోగఢ్ ఇప్పటికే ఉన్న ఐదింటితోపాటు మరిన్ని గ్రామాలను దత్తత తీసుకోవాలని సూచించారు. ఇతర ఎయిమ్స్‌లకు ఒక ఆదర్శంగా మారేందుకు కృష్టి చేయాలని కోరారు. గిరిజన ప్రాంతాల మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని, పిల్లలలో పోషకాహార లోపం సర్వసాధారణంగా మారిందని రాష్ట్రపతి తెలిపారు.
ఈ నేపథ్యంలో వైద్యులు సామాజిక సేవపైనా దృష్టిసారించాలన్నారు. సుదూర గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు యాంటీ వీనమ్ ఔషధాలను డ్రోన్ల ద్వారా అందిస్తున్న దియోగఢ్ ఎయిమ్స్‌ను రాష్ట్రపతి ముర్ము ప్రశంసించారు. ఈ సంస్థతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందంటూ ఆమె..జార్ఖండ్ గవర్నర్ తాను వ్యవహరించిన సమయంలోనే ప్రధాని మోదీ 2018లో ఎయిమ్స్ దియోగఢ్‌కు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. రాష్ట్రపతి జార్ఖండ్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. శుక్రవారం ఐఐటీ ధన్‌బాద్ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు.