
ఈ వారంలో హైదరాబాద్‌లో ఫోర్ స్క్రీన్ ప్రాపర్టీ ప్రారంభం
న్యూఢిల్లీ: సినిమా ఎగ్జిబిటర్ పీవీఆర్ ఐనాక్స్ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఈ వారంలో హైదరాబాద్‌లో కొత్తగా నాలుగు స్క్రీన్‌ల ప్రాపర్టీని ప్రారంభించనుంది. దీనితో రాష్ట్రంలో మొత్తం స్క్రీన్ల సంఖ్య 110కి చేరుతుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ బిజ్లీ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 26 స్క్రీన్లను జోడించనున్నట్లు వివరించారు. గణనీయంగా వృద్ధి చెందుతున్న తెలంగాణ మార్కెట్ తమకు అత్యంత ప్రాధాన్య మార్కెట్లలో ఒకటని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, దేశవ్యాప్తంగా వచ్చే రెండేళ్లలో కొత్తగా 200 స్క్రీన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సంజీవ్ కుమార్ చెప్పారు. ఇందుకోసం రూ. 400 కోట్ల వరకు వెచి్చంచనున్నట్లు ఆయన వివరించారు.
ప్రధానంగా దక్షిణాదిపై, చిన్న నగరాలు, పట్టణాలపై ఫోకస్ పెట్టనున్నట్లు వివరించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 100 వరకు స్క్రీన్స్ ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉండగా, ఇప్పటికే 20 ప్రారంభించామన్నారు. 100 స్క్రీన్‌ల లక్ష్యంలో భాగంగా హైదరాబాద్, బెంగళూరు, హుబ్లి సహా దక్షిణాదిలోని వివిధ నగరాల్లో 40 స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తామని సంజీవ్ కుమార్ వివరించారు. అలాగే సిలిగురి, జబల్‌పూర్, లేహ్, గ్యాంగ్‌టక్ వంటి చిన్న పట్టణాల్లో కూడా విస్తరిస్తున్నామని చెప్పారు. కొత్తగా 200 స్క్రీన్ల రాకతో రెండేళ్లలో మొత్తం స్క్రీన్ల సంఖ్య దాదాపు 2,000కు చేరుతుందని సంజీవ్ కుమార్ తెలిపారు.