
వలసదారుల బహిష్కరణ విషయంలో దూకుడు పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కౌంటర్ పడింది. అమెరికా పౌరసత్వం పొందిన వారిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సంతకాల సేకరణ జరుగుతోంది. అదేదో.. తన ముద్దుల భార్య మెలానియా నుంచే మొదలుపెట్టాలంటూ డిమాండ్ చేస్తూ ఏకంగా సంతకాల సేకరణ చేపట్టారు.
‘‘Deport Melania" అనే పేరుతో అమెరికాలో ఆన్‌లైన్‌లో సంతకాల సేకరణ ప్రారంభమైంది. ఈ పిటిషన్‌లో మెలానియా ట్రంప్, ఆమె తల్లిదండ్రులు, కుమారుడు బారన్ అమెరికా నుంచి బహిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ ఏమన్నారంటే.. అమెరికన్ పౌరసత్వాన్ని దుర్వినియోగం చేస్తున్న విదేశీ మూలాలవారు దేశం నుంచి వెళ్లిపోవాలి అని. ట్రంప్ చెప్పిన దానిప్రకారం.. విదేశాల నుంచి వచ్చి పౌరసత్వం పొందిన వారిని బహిష్కరించాలంటే, ముందుగా ఆయన కుటుంబం నుంచే ఆ ప్రక్రియ ప్రారంభించాలి అనేది ఈ పిటిషన్ ఉద్దేశం.
మెలానియా పౌరసత్వంపై వివాదం ఏంటంటే..
మెలానియా ట్రంప్ అసలు పేరు మెలనియా క్నావ్స్. స్లోవేనియాలో జన్మించారు. 1970 ఏప్రిల్ 26న అప్పటి యుగోస్లావియాలోని నోవో మెస్టో (Novo Mesto) అనే పట్టణంలో జన్మించారు. ప్రస్తుతం ఇది స్లోవేనియా దేశంలో భాగంగా ఉంది. బాల్యంలో ఆమె సెవ్నికా అనే గ్రామంలో గడిపారు. ఆమె తండ్రి కార్లు అమ్మేవారు. తల్లి బట్టల పరిశ్రమలో పని చేసేది. తన 16వ ఏట మోడలింగ్ కెరీర్‌ను ప్రారంభించిన మెలానియా.. తర్వాత పారిస్, మిలాన్‌లకు వెళ్లి అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ఆపై మోడలింగ్ కోసం వీసా ద్వారా 1996లో అమెరికాకు వచ్చారు.
మెలానియా 2000లో EB-1 వీసా (Einstein Visa) కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2001లో ఆమెకు ఈ వీసా మంజూరు అయ్యింది. అయితే అప్పటికి ఆమె సాధారణ ఫ్యాషన్ మోడల్ మాత్రమే. ఆమెకు అంత స్థాయి అంతర్జాతీయ గుర్తింపు కూడా లేదు అనే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 2005లో ట్రంప్‌ను వివాహం చేసుకున్న ఆమె.. 2006లో అమెరికా పౌరసత్వం పొందారు.

EB-1 వీసా అంటే.. ఇది అమెరికా ప్రభుత్వం ఇచ్చే ఉన్నత ప్రతిభ కలిగిన వ్యక్తుల కోసం ప్రత్యేక వీసా. సాధారణంగా నోబెల్ బహుమతి విజేతలు, ఒలింపిక్ పతకాలు, పులిట్జర్, అకాడమీ అవార్డులు వంటి అంతర్జాతీయ గుర్తింపు ఉన్నవారికి మాత్రమే ఈ వీసా లభిస్తుంది. అయితే, మెలానియా నిజంగానే ఆ గుర్తింపునకు అర్హత ఉన్న వ్యక్తేనా? అనే విషయంపై వివాదం నడుస్తోందక్కడ. 2025 జూన్‌లో జరిగిన అమెరికా కాంగ్రెస్ విచారణలో డెమొక్రాటిక్ ప్రతినిధి జాస్మిన్ క్రాకెట్ వ్యాఖ్యానిస్తూ.. మెలానియా పొందింది Einstein వీసా అయితే లెక్క సరిపోవడం లేదంటూ విమర్శించారు.
ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై తీసుకుంటున్న కఠిన చర్యలు, వీసా రద్దులు, చైన్ మైగ్రేషన్((పౌరులు తమ కుటుంబ సభ్యులకు గ్రీన్ కార్డులు పొందించే విధానం) వ్యతిరేకత వంటి విధానాలను ప్రోత్సహిస్తోంది. అదే సమయంలో.. ఆమె పొందిన పౌరసత్వం చట్టబద్ధమైనదే. కానీ, తన పౌరసత్వం ద్వారా ట్రంప్ భార్య మెలానియా తన తల్లిదండ్రులకు గ్రీన్ కార్డులు ఇప్పించారు. అంటే.. ఏ రకంగా చూసుకున్నా ట్రంప్ పాలసీకి ఈ చర్యగా విరుద్ధంగా ఉంది. అందుకే.. ఆ మొదలుపెట్టేదోదో మెలానియాతోనే మొదలుపెట్టండి అని అమెరికన్లు సంతకాల పిటిషన్ చేపట్టారు.