ముంబయి టూ గోవా.. పరుగులు తీసిన స్టార్‌ హీరో.. వామ్మో అన్ని కిలో మీటర్లా? | Bollywood actor Milind Soman Running From Mumbai To Goa just 5days | Sakshi
Sakshi News home page

Milind Soman: ముంబయి టూ గోవా.. పరుగులు తీసిన స్టార్‌ హీరో.. వామ్మో అన్ని కిలో మీటర్లా?

Jul 2 2025 9:01 PM | Updated on Jul 2 2025 9:19 PM

 Bollywood actor Milind Soman Running From Mumbai To Goa just 5days

పార్టీలు చేసుకోవాలి క్యాసినోలు చూసుకోవాలి బీర్లు తాగాలి బీచ్‌లలో పడి దొర్లాలి...  గోవా అనగానే  లెట్స్‌ గో... అనేందుకు చాలా మందికి అవే కారణాలు కావచ్చు. కానీ ఆ అగ్రనటుడు మాత్రం గోవాకి పరుగులు తీసిన కారణం వీటికి పూర్తిగా భిన్నం కావడం విశేషం.  ఫిట్‌గా ఉండండి హిట్‌ అనిపించుకోండి అని ప్రభోధించడానికి ఆయన ఎంచుకున్న మార్గం ఏకంగా 600 కి.మీ ప్రయాణం అది కూడా ఎలా? పరుగులు తీస్తూ కాసేపు సైక్లింగ్‌లో మరింత సేపు...ఇంతకీ ఎవరా నటుడు? ఏమా కధ? లెట్స్‌ గెట్‌ ఇన్‌ టూ దిస్‌ స్టోరీ...

ఫ్యాషన్‌ రంగంలో మోడల్‌ సినిమా రంగంలో నటుడు, అనగానే చాలామంది  గుర్తుకు రావచ్చు కానీ.. ఫిట్‌నెస్‌ ఐకాన్‌ అనేది కూడా వీటికి జతకలిస్తే మాత్రం దేశవ్యాప్తంగా గుర్తుకు వచ్చే ఏకైక పేరు మిలింద్‌ సోమన్‌. గత కొన్నేళ్లుగా అన అనూహ్యమైన ఫిట్‌నెస్‌ స్థాయిలతో అందర్నీ అబ్బుపరుస్తూ యువతకు స్ఫూర్తిగా  నిలుస్తున్న మిలింద్‌..మరోసారి తన శారీరక సామర్ధ్యాన్ని చాటుకున్నాడు.  ‘ది ఫిట్‌ ఇండియా రన్‌’ పేరుతో ఏటా నిర్వహించే రన్నింగ్‌ ఈవెంట్‌ దీనికి వేదికగా నిలిచింది. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన  ముంబయి నుంచి గోవా వరకు సుమారు 600 కిలోమీటర్ల దూరం మోటారు వాహనం లేకుండా ప్రయాణించారు. ఈ ప్రయాణం  5 రోజుల్లో పూర్తి చేసిన ఘనత సాధించాడు.

ఈ మార్గంలో ప్రతిరోజూ సుమారు 90కిమీ సైక్లింగ్‌  21కిమీ పరుగు ఇలా విభజించుకుంటూ ఆయన ప్రయాణించాడు. గత నెల అంటే జూన్‌ 26న ముంబైలోని శివాజీ పార్క్‌ నుంచి మిలింద్‌ సోమన్‌ ఫిట్‌ ప్రారంభమైంది. మహారాష్ట్ర భూభాగానికి ఆనుకుని ఉన్న కొంకణ్‌ బెల్ట్‌ను పూర్తిగా కవర్‌ చేస్తూ పెన్, కొలాడ్, చిప్లూన్, రత్నగిరి, కంకవళి  ల మీదుగా ప్రయాణిస్తూ జూన్‌ 30న గోవాకు చేరుకున్నాడు. తన  సాహస ప్రయాణాన్ని తాజాగా ఆయన ఇన్‌ షేర్‌ చేశాడు. దానితో పాటే ఓ సందేశాన్ని కూడా.

'ఫిట్‌ ఇండియన్‌ రన్‌  5రోజుల పాటు 600కిమీ పూర్తి చేశాను. ఇది ప్రతీ ఏటా  తప్పనిసరిగా నేను ఎదుర్కునే ఛాలెంజ్, శరీరం, మనస్సు బాగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకునేందుకు ఇలాంటి ఈవెంట్స్‌లో పార్టిసిపేట్‌ చేయడం నాకు ఉపకరిస్తుంది. అనేక మంది నాకు బెస్ట్‌ విషెస్‌ చెప్పడం మరెన్నో అఛీవ్‌ చేయాలని కోరుతుండడం నాకు మరింత ప్రేరణగా మారుతోంది. ప్రతి భారతీయుడు ఫిట్‌ ఇండియన్‌ అవ్వాలి. జైహింద్‌' అంటూ పంచుకున్నాడు.

ప్రతీ ఒక్కరిలో ఫిట్‌నెస్‌ పట్ల ఆసక్తి పెంచేందుకు గత 2020లో భారత ప్రభుత్వం  ఫిట్‌ ఇండియా ఫ్రీడమ్‌ రన్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ కార్యక్రమంలో మిలింద్‌ పాల్గొంటున్నాడు. ఈ సారి 60ఏళ్ల వయసులో కూడా అదే ఉత్సాహంతో ఆయన సాధించిన ఈ ఫీట్‌... ఫిట్‌నెస్‌లో ఆసక్తి ఉన్న చాలామందికి ప్రేరణ అందిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement