
‘స్వచ్ఛందం’ అని ప్రకటిస్తేనే వీఆర్‌ఎస్‌కు ఆమోదం!
ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్‌కు ప్రభుత్వ పెద్దల హకుం
పోలీసు శాఖలో వీఆర్‌ఎస్ కలకలం
సాక్షి, అమరావతి: వేధింపులు, అవమానాలతో ఐపీఎస్ సర్వీసుకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్న తర్వాత కూడా జీపీపీ కార్యాలయంలో ఎస్పీ (అడ్మిన్) సిద్ధార్థ్ కౌశల్‌పై ప్రభుత్వ పెద్దలు తమ ప్రతాపం చూపించారు. ‘ఐపీఎస్‌కు సిద్ధార్థ్ కౌశల్ గుడ్ బై’ అనే శీర్షికతో ‘సాక్షి’ పత్రిక బుధవారం ప్రచురించిన కథనం పోలీసు శాఖలో తీవ్ర కలకలం సృష్టించింది.
అసలు రాష్ట్ర పోలీసు శాఖలో ఏం జరుగుతోంది.. ఎటువంటి పరిణామాలకు దారితీస్తోందని పోలీసు వర్గాలు తీవ్రస్థాయిలో చర్చించుకున్నాయి. రానున్న రోజుల్లో పోలీసు శాఖలో పరిస్థితులు మరింతగా దిగజారుతాయని ఆవేదన వ్యక్తంచేశాయి. తమ వేధింపుల వ్యవహారం మరోసారి బట్టబయలు కావడంతో హడలిపోయిన ప్రభుత్వ పెద్దలు వెంటనే పోలీస్ బిగ్ బాస్‌ను రంగంలోకి దించారు.
కేవలం వ్యక్తిగత కారణాలతోనే ఐపీఎస్ సర్వీసు నుంచి స్వచ్ఛందంగా వైదొలుగుతున్నట్టుగా ప్రకటించాలని సిద్ధార్థ్ కౌశల్‌పై డీజీపీ కార్యాలయం తీవ్ర ఒత్తిడి తెచ్చింది. తాము చెప్పినట్టు ప్రకటన జారీ చేయకపోతే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్‌ఎస్) కోసం ఆయన చేసిన దరఖాస్తును ఆమోదించబోమని కూడా బెదిరించినట్టు తెలుస్తోంది. పోలీస్ బిగ్ బాస్ ఒత్తిడికి ఆయన తలొగ్గారు. అనంతరమే సిద్ధార్థ్ కౌశల్ పేరుతో ఓ పత్రికా ప్రకటనను పోలీసు వర్గాలు విడుదల చేశాయి. సిద్ధార్థ్ కౌశల్‌పై డీజీపీ కార్యాలయం తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి ఆయనతో పత్రికా ప్రకటన జారీ చేయించిందని పోలీసు వర్గాలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నాయి.
కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకే వీఆర్‌ఎస్: సిద్ధార్థ్ కౌశల్
సుదీర్ఘంగా ఆలోచించి, కుటుంబ సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఐపీఎస్ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశానని సిద్ధార్థ్ కౌశల్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇది వ్యక్తిగత కారణాలతో తీసుకున్న స్పష్టమైన నిర్ణయమని పేర్కొన్నారు. ఐపీఎస్ అధికారిగా పని చేయడం తన జీవితంలో అత్యంత గౌరవప్రదమైన అనుభవమన్నారు. తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
