నేటి నుంచి పది పరీక్షలు | Tenth exams starts from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పది పరీక్షలు

Mar 16 2026 5:26 AM | Updated on Mar 16 2026 5:26 AM

Tenth exams starts from today

ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు నిర్వహణ

అర్ధగంట ఆలస్యమైనా పరీక్షకు అనుమతి 

ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు పరీక్ష హాల్లోకి ప్రవేశం... 

పరీక్షలకు హాజరుకానున్న 6,40,916 మంది విద్యార్థులు  

3,415 కేంద్రాల్లో ఏర్పాట్లు  

ఒంటిపూట బడులు సైతం నేటి నుంచే..

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు(ఎస్‌ఎస్‌సీ–2026) సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులను ఉదయం 8.30 గంటల నుంచి 10 గంటల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. అర్ధగంట ఆలస్యమైనా పరీక్షకు పంపిస్తారు. ఏప్రిల్‌ 1వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయి. 

రాష్ట్రవ్యాప్తంగా 3,415 కేంద్రాల్లో నిర్వహించనున్న ఈ పరీక్షలకు 6,40,916 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వారిలో 6,22,074 మంది రెగ్యులర్, 18,842 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 3,415 మంది సెంటర్‌ సూపరింటెండెంట్లు, 3,415 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లతోపాటు 38,958 మంది ఇన్విజిలేటర్లను పాఠశాల విద్యాశాఖ నియమించింది. 

మాల్‌ప్రాక్టీస్‌ నియంత్రణకు 156 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ను నియమించింది. 210 సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా 24 పేజీల ప్రధాన ఆన్సర్‌ బుక్‌లెట్‌ను అందిస్తారు. అవసరమైతే మరో 12 పేజీల అదనపు బుక్‌లెట్‌ను కూడా అందుబాటులో ఉంచారు. ఒరిజినల్‌ హాల్‌టికెట్‌తో పరీక్షకు హాజరుకావాలని పరీక్షల విభాగం డైరెక్టరేట్‌ సూచించింది. ఎల్రక్టానిక్‌ పరికరాలు అనుమతించబోమని స్పష్టం చేసింది.  

పదో తరగతి పరీక్షల పర్యవేక్షణకు డీఎంసీలు 
పదో తరగతి పరీక్షలతో పాటు ఏప్రిల్‌ 4 నుంచి ప్రారంభమయ్యే మూల్యాంకన ప్రక్రియలను పర్యవేక్షించేందుకు పాఠశాల విద్యాశాఖ ‘డిస్ట్రిక్ట్ మానిటరింగ్‌ కో–ఆర్డినేటర్స్‌ (డీఎంసీ)లను నియమించింది. 11 మందికి రెండు జిల్లాల చొప్పున, నలుగురికి ఒక్కొక్క జిల్లా చొప్పున 26 జిల్లాలకు 15 మంది అధికారులను నియమించింది. ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్‌లో పనిచేస్తున్న 15 మంది సిబ్బందికి ఆయా జిల్లాల బాధ్యతలు అప్పగించారు. 

పరీక్షలు, మూల్యాంకనం సజావుగా సాగేందుకు పర్యవేక్షణ యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి, ట్యాబ్‌–ఆధారిత మార్కుల ఎంట్రీ, డిజిటల్‌ రిపోర్టింగ్‌ సిస్టం వంటి కొత్త విధానాలను ఈ ఏడాది అమలు చేస్తున్న నేపథ్యంలో డీఎంసీలను నియమించినట్లు రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. 

పర్యవేక్షణ కో–ఆర్డినేటర్లు, జిల్లా స్థాయి అధికారులు, చీఫ్‌ సూపరింటెండెంట్లను సమన్వయం చేస్తూ రోజువారి పర్యవేక్షణ నివేదికను డైరెక్టరేట్‌కు సమర్పించాలని ఆదేశించారు. ట్యాబ్‌–ఆధారిత మార్కుల నమోదును మూల్యాంకనం ప్రారంభమైన మొదటి రెండు రోజులు (ఏప్రిల్‌ 4, 5 తేదీలు) పరిశీలిస్తారు.   

నేటి నుంచే ఒంటిపూట బడులు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో సోమవారం నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఒకటి నుంచి 9వ తరగతి వరకు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. పదో తరగతి పరీక్షలు జరిగే కేంద్రాల్లో మధ్యా­హ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 వరకు క్లాసులు ఉంటాయి. మధ్యాహ్న భోజ­నం కొనసాగుతుంది.  

Advertisement
 
Advertisement
Advertisement