అజిత్‌ కుమార్‌ కుటుంబాన్ని ఓదార్చిన విజయ్‌ | TVK Chief Vijay Visits Family of Custodial Death Victim Ajith Kumar, Demands SIT Probe | Sakshi
Sakshi News home page

అజిత్‌ కుమార్‌ కుటుంబాన్ని ఓదార్చిన విజయ్‌

Jul 2 2025 9:24 PM | Updated on Jul 2 2025 9:59 PM

TVK Chief Vijay Visits Family of Custodial Death Victim Ajith Kumar, Demands SIT Probe

సాక్షి, చెన్నై: ఒకప్పుడు ప్రజల రక్షణకు ప్రతీకగా నిలిచిన ఖాకీ యూనిఫాం.. ఇప్పుడు అమానవీయ ఘటనలకి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తమిళనాడు శివగంగై జిల్లాలో పోలీసుల చిత్ర హింసలకు ప్రాణాలు అజిత్ కుమార్‌ (28) కుటుంబాన్ని తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, ప్రముఖ నటుడు విజయ్‌ (Vijay) పరామర్శించారు. 

బుధవారం మదపురంలోని బాధితుడు అజిత్ కుమార్‌ కుటుంబాన్ని కలిశారు. అజిత్ కుమార్‌ ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందించడంతో పాటు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం, విజయ్‌ మాట్లాడుతూ.. ఇలాంటి అమానవీయ ఘటనలు జరుగకూడదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై హైకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు (SIT) వేయాలని డిమాండ్ చేశారు.

తమిళనాట యువకుడు అజిత్‌ కుమార్‌ కస్టోడియల్‌ డెత్‌ సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. అజిత్ కుమార్ (27) అనే యువకుడు శివగంగై జిల్లాలోని మదపురం భద్రకాళి అమ్మన్ ఆలయంలో తాత్కాలిక భద్రతా సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ క్రమంలో జూన్ 27న ఓ మహిళ తన బంగారు ఆభరణాలు పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ నిమిత్తం పోలీసులు అజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టారు.  

అజిత్‌పై పోలీసుల అమానుషం
విచారణ పూర్తి కావడంతో అజిత్‌ను పోలీసులు వదిలేశారు. మళ్లీ  మరోసారి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల తర్వాత అంటే జూన్ 29న బాధితుడికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో  పోలీసులు  అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మరణించారు.  కానీ పోస్టు మార్టం నివేదికలో మాత్రం పోలీసులు తీరుపై అనుమానాలు వెల్లువెత్తాయి. పోస్టుమార్టం నివేదికలో అజిత్‌ కుమార్‌ తల, ఛాతీ, శరీరంపై 30 నుంచి 40 వరకు గాయాలైన ముద్రలు ఉన్నట్లు తేలింది. లాఠీ దెబ్బలు, చింతపండు పొడి నోట్లో, ప్రైవేట్ పార్ట్స్‌లో నింపడం వంటి అమానుష చర్యలు జరిగినట్లు తేలింది.  

సివిల్‌ డ్రెస్‌లో పోలీసులు..అజిత్‌పై దాడి
మరణం అనంతరం వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజీల్లో సైతం అజిత్‌ కుమార్‌  పోలిస్‌ స్టేషన్‌కు వెళ్లే ముందు ఆరోగ్యంగా ఉన్నాడు. కానీ పోలీసుల చిత్ర హింసలతో తీవ్రంగా గాయపడిన స్థితిలో బయటకు వచ్చినట్లు కనిపిస్తోంది. సివిల్‌ డ్రెస్‌లో ఉన్న పోలీసులు అజిత్‌ కుమార్‌ను అతను పనిచేసే భద్రకాళి అమ్మన్‌ ఆలయం వెనక్కి తీసుకెళ్లి కొడుతున్న దుశ్యాలు వెలుగులోకి రావడం కలకలం రేగింది. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులపై చర్యలకు ఉపక్రమించింది.

ఎస్పీ అశిష్ రావత్‌పై వేటు 
అజిత్‌ కుమార్‌ మరణానికి కారణమైన ఐదుగురు పోలీసుల్ని తమిళనాడు పోలీస్‌ శాఖ అదుపులోకి తీసుకుంది. హెడ్ కానిస్టేబుళ్లు కన్నన్, ప్రభు,  కానిస్టేబుళ్లు రాజా, ఆనంద్, శంకరమణికంతో పాటు వారికి సహకరించిన డ్రైవర్ రామచంద్రన్‌ను సస్పెండ్ చేసింది. శివగంగై ఎస్పీ అశిష్ రావత్‌పై వేటు వేసి.. రామనాథపురం ఎస్పీకి అదనపు బాధ్యతలు అప్పగించింది.

మరోవైపు లాకప్‌ డెత్‌లో మరణించిన అజిత్‌ కుమార్‌ కేసును మద్రాస్ హైకోర్టు విచారించింది. విచారణలో ఓ హంతకుడు కూడా ఇలా దాడి చేయడూ అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. సీఎం స్టాలిన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి సీబీ సీఐడీ విచారణకు ఆదేశించారు. బీజేపీ,ఏఐడీఐఏంకేతో పాటు ఇతర పార్టీలు సీబీఐ విచారణ కోరుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement