
వేర్పాటువాదులతో పొత్తు ఉండదు: టీవీకే చీఫ్ విజయ్
తమిళగ వెట్రి కళగం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. అలాగే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ అధినేత, ప్రముఖ నటుడు విజయ్(Joseph Vijay Chandrasekhar) పేరును శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.
శుక్రవారం ఉదయం చెన్నైలోని పార్టీ ప్రధానకార్యాలయంలో విజయ్ అధ్యక్షతన టీవీకే పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో విజయ్‌ను సీఎం అభ్యర్థిగా ఎన్నుకుంది టీవీకే కార్యవర్గం. అలాగే.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. అంతేకాదు పలు కీలక తీర్మానాలను ఆమోదించారు.
‘‘బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోంది. ఆ పార్టీ విష రాజకీయాలు తమిళనాడులో చెల్లవు. ఈ ఎన్నికల్లో వేర్పాటువాదులతో పొత్తు ఉండదు’’
:::విజయ్
వచ్చే నెలలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని, అటుపై ఎన్నికల దాకా గ్రామగ్రామాన బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. విజయ్‌ను ప్రజలకు మరింత దగ్గరగా తీసుకెళ్లేందుకు అవసరమయ్యే కార్యాచరణను సిద్ధం చేయడానికి, దానిని అమలు చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని టీవీకే భావిస్తోంది.
అంతేకాదు.. తాజాగా అమిత్ షా చేసిన ఆంగ్ల భాష కామెంట్లు.. తమిళనాడుపై నేరుగా చేసిన దాడిగా టీవీకే పేర్కొంటూ ఖండించింది. బలవంతంగా హిందీని, సంస్కృత భాషను తమిళనాడులో ప్రవేశపెట్టే ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తీర్మానంలో టీవీకే స్పష్టం చేసింది. అలాగే.. ఎలక్టోరల్ రివిజన్ చేపట్టాలన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని టీవీకే తప్పుబట్టింది. ఇది బీజేపీకి అనుకూలంగా జరుగుతున్న ప్రయత్నమేనని, రాష్ట్రంలో మైనారిటీల ఓట్లను తగ్గించే ప్రయత్నమేనని ఆరోపించింది.

భారత సినీ పరిశ్రమలో అగ్రహీరోగా కొనసాగుతున్న విజయ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి తమిళనాట మాత్రమే కాదు.. యావత్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అనూహ్యంగా.. 2024 ఫిబ్రవరి 2వ తేదీన సెక్యులర్ సోషియల్ జస్టిస్ అనే సిద్దాంతంతో తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని విజయ్ ప్రకటించారు. అదే ఏడాది అక్టోబర్ 27న విల్లుపురం జిల్లా విక్రవండిలో తొలి రాజకీయ మహాసభ నిర్వహించగా.. అది సూపర్ సక్సెస్ అయ్యింది. ఆ మహాసభ వేదికగా.. తన పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు ప్రకటించారాయాన. పెరియార్, అంబేడ్కర్, కామరాజ్, వేలు నాచియార్ తదితరుల ఆశయాలపై నడుస్తానని స్పష్టం చేశారు. అప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. నీట్, జాతీయ నూతన విద్యా విధానం.. త్రిభాషా సిద్ధాంతం అమలు లాంటి అంశాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందిస్తూ రాజకీయంగానూ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.