
సాక్షి, చెన్నై: పార్టీ పరంగా కమిటీలు, పదవుల భర్తీ ప్రక్రియలన్నీ ఈ నెలాఖరులోపు ముగించే విధంగా ముఖ్య నేతలకు తమిళగ వెట్రి కళగం నేత విజయ్ ఆదేశాలు ఇచ్చారు. పార్టీ కార్యక్రమాలను జూన్ నుంచి విస్తృతం చేయడానికి సిద్ధమయ్యారు. పార్టీ ఏర్పాటుతో జిల్లాల కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీలను విజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో ముఖ్య పదవులన్నీ దాదాపుగా భర్తీ అయ్యాయి. ఇతర కమిటీలలో కొన్ని పదవుల భర్తీ కసరత్తులు జరుగుతున్నాయి. ఎన్నికలకు మరికొన్ని నెలలు ఉన్న దృష్ట్యా, ఇక ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యాచరణలో విజయ్ ఉన్నారు.
ప్రస్తుతం విజయ్ నటిస్తున్న జననాయగన్ చిత్ర షూటింగ్ ఈనెలతో ముగియనున్నట్టు తెలిసింది. ఆ తర్వాత జూన్ మొదటి వారం నుంచి విజయ్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా ప్రజల్లో ఉండబోతున్నారు. ఇందులో భాగంగా విజయ్ పర్యటనలకు సంబంధించి గత రెండు రోజులుగా చెన్నైలో జిల్లాల కార్యదర్శుల సమావేశం విస్తృతంగా సాగుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ పర్యవేక్షణలో ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ పరంగా అన్ని ప్రక్రియలను, పదవుల భర్తీని ఈ నెలాఖరులోపు ముగించాలని విజయ్ ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. జూన్ నుంచి ఆయన పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండబోతున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ సైతం సిద్ధమవుతోంది.