
సాక్షి, చెన్నై: బలహీన పడ్డ అన్నాడీఎంకేకు పునర్జీవం పోయేబోతున్నానని, తనకు ఉన్న అనుభవంతో కార్యాచరణను విస్తృతం చేయనున్నట్టు దివంగత సీఎం జే జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ వ్యాఖ్యానించారు. పోయేస్ గార్డెన్‌లో మంగళవారం శశికళ మీడియాతో మాట్లాడారు. జయలలిత రాజకీయ ప్రయాణంలో తన పాత్రను గుర్తు చేశారు. ఆమెకు వెన్నంటి ఉంటూ అన్ని అంశాలను నిశితంగా పరిశీలించానన్నారు.
2011లో అధికారంలోకి వచ్చినానంతరం 2016లోమళ్లీ అధికారం దిశగా ముందడుగు వేసి విజయకేతనం ఎగుర వేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె మరణం గురించి పేర్కొంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం కొందరి రూపంలో అన్నాడీఎంకే బలహీన పడిఉందని, అందర్నీ ఏకం చేయడం, బలహీన పడ్డ పారీ్టకి పునర్జీవం పోయడం లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టనున్నట్టు, క్రియా శీలక రాజకీయాలోకి రానున్నట్టు ప్రకటించారు. అన్నాడీఎంకేను అధికారంలోకి తీసుకు రావడమే తన లక్ష్యమని, ఇందుకుగాను తనవంతుగా పారీ్టకి పునర్జీవం పోయనున్నట్టు, ఇందుకు సంబంధించిన కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానన్నారు.