
గయాజీ: ఎన్నికల కమిషన్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శల వాడిని మరింత తీవ్రతరం చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక ఎన్నికల కమిషన్(ఈసీ)లో ఇద్దరు కమిషనర్లు, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)ల భరతం పడతామంటూ హెచ్చరికలు చేశారు. ఆదివారం సాసారం నుంచి రాహుల్ ఓటర్ అధికార్ యాత్రను ప్రారంభించడం తెల్సిందే.
యాత్ర సోమవారం గయాజీకి చేరుకుంది. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి రాహుల్ మాట్లాడారు. ఓట్ల చోరీ వాస్తవమని తేలిన తర్వాత కూడా తనను అఫిడవిట్ వేయాలని ఈసీ హెచ్చరించడాన్ని రాహుల్ గాంధీ పస్త్రావించారు. ‘మాకు కొంత సమయం ఇవ్వండి. ప్రతి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మీరు చేసే దొంగతనాన్ని బయటపెడతాం. అప్పుడు దేశం ప్రజలే మిమ్మల్ని అఫిడవిట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తారు’అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తరచూ చెప్పే స్పెషల్ ప్యాకేజీ మాదిరిగానే ఈసీ సైతం బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’పేరుతో ఓటరు సవరణ తీసుకువచ్చింది. ఇదో కొత్త రకం ఓట్ల చోరీ’అని రాహుల్ ధ్వజమెత్తారు.
‘ముగ్గురు ఎన్నికల కమిషనర్లు బీజేపీ సభ్యత్వం తీసుకుని పనిచేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి.. ఏదో ఒక రోజు ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అప్పుడిక మీ ముగ్గురిపైనా చర్యలు తప్పవు’అని హెచ్చరించారు. రాహుల్ వెంట ఆర్‌జేడీ నేత తేజస్వీయాదవ్, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ నేత ముకేశ్ సహానీ, సీపీఐ ఎంఎల్ నేత దీపాంకర్ భట్టాచార్య ఉన్నారు. యాత్ర సోమవారం సాయంత్రం కుటుంబ నుంచి గయాజీకి చేరుకుంది.
ఓట్ల చోరీకి కొత్త ఆయుధం ఎస్‌ఐఆర్
బిహార్‌లో ఓట్ల చోరీకి ఈసీ అమలు చేస్తున్న కొత్త ఆయుధం ఎస్‌ఐఆర్ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సోమవారం ఆయన వాట్సాప్ చానెల్‌లో గత లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసి, తాజాగా బిహార్‌లో చేపట్టిన ఎస్‌ఐఆర్‌లో పేరులేని కొందరితో మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశారు. వీరు ఆదివారం సాసారంలో మొదలైన ఓటర్ అధికార్ యాత్రలో పాలుపంచుకున్నారని ఆయన వివరించారు. ప్రస్తుతం వీరు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచే వీరి గుర్తింపు రద్దయిందని వ్యాఖ్యానించారు. ఇటువంటి పరిస్థితిని తాము పునరావృతం కానివ్వబోమని స్పష్టం చేశారు. అనంతరం ఔరంగాబాద్‌లోనూ ఓటరు జాబితాలో పేర్లు గల్లంతైన వారితో మాట్లాడి, అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.