
తమిళనాడులో సంచలనం రేపిన అజిత్ కుమార్ (29) కస్టడీ డెత్(Custodial Death) కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించిన పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. అందులో విచారణ పేరుతో అజిత్‌ను పోలీసులు ఎంతగా చిత్రహింసలకు గురి చేసి చావుకి కారణం అయ్యారో తేటతెల్లమైంది.
తమిళనాట సంచలనం సృష్టించిన అజిత్ కుమార్ కేసు పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. భౌతికంగా అతనిపై పదే పదే అత్యంత పాశవికంగా పోలీసులు దాడి చేయడం వల్ల ముఖ్య అవయవాలు దెబ్బతిన్నాయి. ఆ దెబ్బల ధాటికి అంతర్గతంగా రక్తస్రావం జరిగి అజిత్ మరణించినట్లు పోస్టుమార్టం నివేదికను బట్టి అర్థమవుతోంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
ఇండియాటుడే కథనం ప్రకారం.. అజిత్ కుమార్ మృతదేహంపై 44 గాయాలు ఉన్నాయి. అందులో 30 చోట్ల కండరాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. గుండె, కాలేయంలో పెటెచియల్ హీమరేజ్‌లు (చిన్న రక్తస్రావ మచ్చలు) కనిపించాయి. ఇవి సాధారణంగా యాక్సిడెంట్‌లలో, ఉద్దేశపూర్వకంగా కొట్టిన సందర్భాల్లోనూ కనిపించవట. అలాంటిది.. అజిత్ ఒంట్లో ఈ మచ్చలు కనిపిస్తున్నాయంటే పోలీసులు ఎంతంగా హింసించారో అర్థవుతోంది.
అలాగే బాటన్లు, రాడ్లు, కర్రలతో తల, ఇతర భాాగాలపై పదే పదే కొట్టడం వల్ల అజిత్‌కు బలంగా గాయాలయ్యాయి. మెదడుతో పాటు అంతర్గత అవయవాల్లో రక్తస్రావం జరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తల చర్మం కింద గాయాలు (సబ్‌స్కాల్ప్ కంట్యూషన్స్), పుర్రెపై నీలిమచ్చలు (ఎక్కైమోసిస్), అలాగే రెండు సెరిబ్రల్ లోబుల్లో రక్తస్రావం (హీమరేజ్) అయ్యింది. కళ్లు, ముక్కు, నోరు, చెవులు, ప్రైవేట్ భాగాల్లో కారం చల్లినట్లు ఆనవాలు లభించాయి. ఈ పోస్టుమార్టం నివేదికను బట్టి అజిత్ కుమార్‌ను పోలీసులు ఉద్దేశపూర్వకంగా.. అత్యంత క్రూరంగా హింసించారో స్పష్టమవుతోందని నివేదిక పేర్కొంది.
ఏం జరిగిందంటే..
తమిళనాడు శివగంగై జిల్లా తిరుప్పువనం సమీపం మడపురంలోని ప్రసిద్ధ భద్రకాళియమ్మన్ ఆలయానికి జూన్ 27న వచ్చిన ఇద్దరు మహిళా భక్తులు.. కారులో ఉంచిన తమ నగలు, డబ్బు కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించారు. ఆలయంలో వెళ్లే ముందు కారు తాళాలను ఆలయ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న అజిత్‌కుమార్(27)కి ఇచ్చామని, అతని మీదే అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో.. పోలీసులు విచారణ పేరుతో అతన్ని పిలిపించుకుని ప్రశ్నించి వదిలేశారు. ఆ మరుసటిరోజు కూడా రమ్మని చెప్పి.. పీఎస్‌కు కాకుండా రహస్య ప్రాంతానికి తరలించి చిత్రహింసలకు గురి చేశారు. ఈ క్రమంలో తానే దొంగించానని అజిత్ అబద్ధం చెప్పాడు. నగలు ఎక్కడ దాచానో చూపించానని ఆలయానికి తీసుకెళ్లి.. అక్కడ పోలీసుల కాళ్ల మీద పడి తాను తప్పు చేయలేదని, వదిలేయాలని వేడుకున్నాడు. కానీ, పోలీసులు అతన్ని మళ్లీ టార్చర్ చేశారు. అజిత్ అపస్మారక స్థితిలోకి జారుకోగా.. చెన్నై ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు.
బాధిత కుటుంబాన్ని ఓదార్చిన విజయ్
ఈ ఘటన ప్రజాగ్రహానికి కారణమైంది. ఘటనకు సంబంధించిన ఓ వీడియో బయటకు రావడం కలకలం రేపింది. నెట్టింట ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అజిత్ కుమార్ కస్టడీ మృతి కేసు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపింది. ప్రతిపక్షాలు, సామాజిక కార్యకర్తలు, సినీ ప్రముఖులు కూడా ప్రభుత్వంపై, పోలీసులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి: “ఇది స్టాలిన్ పాలనలో పోలీసు అరాచకానికి నిదర్శనం” అని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్.. ఈ కేసును జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్.. పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ అని పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని స్వయంగా వెళ్లి ఓదార్చారాయన. మరోవైపు శివగంగై ఉదంతంపై నిరసనకు టీవీకే పార్టీకి పోలీసులు అనుమతించలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించింది ఆ పార్టీ.

ఈ ఘటన ఇటు తమిళనాడుతో పాటు అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేసు తీవ్రత దృష్ట్యా CB-CID నుంచి CBIకి బదిలీ చేశారు. పోలీసుల చర్య క్షమించరానిదని పేర్కొన్న ముఖ్యమంత్రి స్టాలిన్ (MK Stalin).. దర్యాప్తులో ఎటువంటి సందేహాలకు తావు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే సీబీఐకి అప్పగించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. అజిత్ కుటుంబానికి ₹50 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం, భూమి మంజూరు చేశారు. ఈ ఘటనపై జులై 8వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రమే తన పౌరుడిని చంపింది అని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది.
నాకు భద్రత ఇవ్వండి
అజిత్ కుమార్‌ను ఆలయానికి తీసుకెళ్లిన సమయంలో పోలీసులు జరిపిన దాడిని అక్కడి ఉద్యోగి శక్తీశ్వరన్ రహస్యంగా చిత్రీకరించాడు. ఆ వీడియోనే విపరీతంగా వైరల్ అయ్యింది. అంతేకాదు ఈ కేసులో ఉన్న ఏకైక ప్రత్యక్ష సాక్షి కూడా ఆ ఉద్యోగినే. దీంతో తనకు బెదిరింపులు వస్తున్నాయని.. తనకు భద్రత కల్పించాలని కోరుతున్నారాయన. అరెస్టైన పోలీసుల్లో ఒకరు గుండాలతో, రౌడీ షీటర్లతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్నాడని, అతని నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంటూ శక్తీశ్వరన్ డీజీపీకి లేఖ రాశారు.
#Shocking A video has surfaced showing police attacking Ajith Kumar, a youth from Sivaganga. The police's First Information Report (FIR) claimed that Ajith died due to epilepsy and injuries sustained from a fall. #AjithkumarMysteryDeath #CustodyDeath @TheFederal_News pic.twitter.com/otW1AicDGZ
— Mahalingam Ponnusamy (@mahajournalist) July 1, 2025