
ప్రశ్నించిన యువకుడిపై హత్యాయత్నం
వేలూరు: తిరుపత్తూరు జిల్లా నాట్రంబల్లి సమీపంలోని పూసికల్‌మేడు గ్రామానికి చెందిన తిరుపతి కుమారుడు పరుశురామన్ ఇతను అదే గ్రామంలోని రాజాత్తి ఇంటి సమీపంలో ఆదివారం అర్థరాత్రి పూజలు చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో పరుశరామన్ ఇంటి సమీపంలో నివశిస్తున్న కుమరన్ అనే వ్యక్తి ఇంటి సమీపంలో దీపం వెలుగుతుందని దగ్గరకు వెళ్లి చూశాడు.
ఆ సమయంలో పరుశురామన్ నగ్నంగా నిలుచుకొని పూజలు చేస్తున్నాడు. వీటిని గమనించి అవాక్కైన కుమరన్ వీటిని నిలదీశాడు. దీంతో ఇద్దరి మద్య వాగ్వాదం ఏర్పడింది. ఇద్దరు ఘర్షణ పడటంతో స్థానికులు గమనించి అక్కడకు వచ్చారు. వెంటనే ఇరు వర్గాల వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనంతరం కుమరన్ ఇంటికి వెల్లి నిద్రించాడు.
ఆ సమయంలో పరుశురామన్ తన అనుచరులతో వచ్చి కుమరన్ తలపై రాతిని వేసి హత్య చేసేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. కుమరన్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతని బార్య జయలక్ష్మి వెంటనే కేకలు వేసింది. వెంటనే స్థానికులు గమనించి కుమరన్‌ను చికిత్స నిమిత్తం తిరుపత్తూరు ప్రభ్తుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు జయలక్ష్మి నాట్రంబల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి పరుశురామన్, అతని సోదరుడు శాంతకుమరన్‌ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.