
బతికుండగానే హెడ్ మాస్టర్‌కు అంజలి
బ్యానర్ పెట్టిన స్నేహితులు
తమిళనాడు: కళ్లకురిచి జిల్లాలోని ఊలుందూరుపేట సమీపంలోని కూంతలూరు గ్రామానికి చెందిన రామదాస్ ప్రభుత్వ పాఠశాలలో హెచ్‌ఎంగా పని చేసి, రిటైర్డ్ అయ్యారు. తమిళనాడు టీచర్స్ యూనియన్ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. రామదాస్ గత 30వ తేదీన ద్విచక్ర వాహనంపై ఊలుందూరుపేట నుంచి తిరుచ్చి వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొంది. గాయపడ్డ రామదాస్‌ను పుదుచ్చేరిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో తరలించారు. ఈ పరిస్థితిలో గురువారం ఉదయం రామదాస్ మరణించినట్లు అక్కడి నుంచి సమాచారం అందింది.
దీంతో బంధువులు, స్నేహితులు,సహ ఉద్యోగులు సామాజిక మాధ్యమాల్లో అతని ఫొటోలు పెట్టి కన్నీటి అంజలి ఘటించారు. బ్యానర్లు ఏర్పాటు చేసి ఆటోల్లో మృతి చెందిన విషయాన్ని ప్రచారం చేశారు. ఈస్థితిలో గురువారం రామదాస్‌ను ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో సజీవంగా అతని స్వగ్రామం కూంతలూరుకు కుటుంబసభ్యులు తీసుకొచ్చారు. దీంతో బంధువులు, స్నేహి తులు సంతోషంతో ఆశ్చర్యపోయారు. ఈక్రమంలో నిన్న మళ్లీ విలుప్పురం ముండియం పాక్కం ప్రభుత్వాస్పత్రిలో చేరిన రామదాస్ గురువారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు.