
పదోన్నతి రద్దు చేసుకున్న ఉపాధ్యాయుడు
కరీంనగర్‌రూరల్: పదోన్నతి రావాలని ఉద్యోగులందరు కోరుకోవడం సహజం. కానీ, ఈ ఉపాధ్యాయుడు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం అధికారులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పదోన్నతిపై గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా వచ్చిన ఈ ఉపాధ్యాయుడు పాఠశాలలోని పరిస్ధితులను తట్టుకోలేక ప్రమోషన్ రద్దు చేసుకుని పాత పాఠశాలలోనే యథావిధిగా ఉపాధ్యాయుడిగా పోస్టింగ్ పొందడం చర్చనీయాంశంగా మారింది. వివరాలు..
కరీంనగర్‌లోని సవరన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎ.రఘురాంరావు నెల క్రితం పదోన్నతిపై దుర్శేడ్ జెడ్పీ పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా బదిలీపై వచ్చారు. కొన్నిరోజులుగా పాఠశాలలో నెలకొన్న పరిస్ధితులు, ఒక స్కూల్ అసిస్టెంట్ వ్యవహరిస్తున్న తీరుతో మానసికంగా ఆందోళనకు గురయ్యారు. విధులు సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. చివరకు కుటుంబ సభ్యుల ఒత్తిడితో పదోన్నతి రద్దు చేయాలని ఈ నెల 13న స్కూల్ ఎడ్యుకేషన్ వరంగల్ ఆర్జేడీకి దరఖాస్తు చేసుకున్నారు.
ఆర్జేడీ ఉత్తర్వుల మేరకు జిల్లా విద్యాధికారి శ్రీరాంమొండయ్య మంగళవారం రఘురాంరావు పదోన్నతిని రద్దు చేసి తిరిగి స్కూల్ అసిస్టెంట్‌గా సవరన్ ప్రభుత్వ పాఠశాలలో చేరాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దుర్శేడ్ స్కూల్‌లో ఒక స్కూల్ అసిస్టెంట్ వ్యవహరిస్తున్న తీరుతోనే రఘురాంరావు వెళ్లిపోయినట్లు ఉపాధ్యాయుల ద్వారా తెలిసింది. గతేడాది పాఠశాలలోని పరిస్ధితులను తట్టుకోలేక అప్పటి హెచ్‌ఎం పరబ్రహ్మమూర్తి గుండెపోటుతో మృతిచెందడం ఉపాధ్యాయులను కలవరపరిచింది. ప్రస్తుతం మరో ప్రధానోపాధ్యాయుడు పదోన్నతి రద్దు చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖాధికారులు దుర్శేడ్ పాఠశాలలో నెలకొన్న అసాధారణ పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.