వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కోలాహలంగా సాగుతున్నాయి. ఆదివారం పంచమూర్తుల పంచ రథోత్సవం కనులపండువగా సాగింది. కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన ఆదివారం ఉదయం 3 గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అన్నామలై సమేత ఉన్నామలై అమ్మవారికి పూజలు చేసి పుష్పాలంకరణలు చేశారు. అనంతరం పంచమూర్తులైన వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, అన్నామలై సమేత ఉన్నామలై అమ్మ, పరాశక్తి అమ్మ, చండికేశ్వరుడులకు ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం వినాయకుడిని ఉదయం 6.25 గంటలకు పుష్పాలంకరణలో రథంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథం అన్నామలైయార్ ఆలయ రాజగోపురం నుంచి బయలు దేరింది. ఆ సమయంలో చలి కూడా భక్తులు లెక్క చేయకుండా అరుణాచలేశ్వరునికి హరోంహరా అంటూ రథం దారాన్ని లాగారు. కలెక్టర్ తర్పగరాజ్, ఎస్పీసుధాకర్, ఆలయ జాయింట్ కమిషనర్ భరణీధరన్ రథాన్ని లాగి పూజలు చేశారు.
మాడ వీధుల్లో ఊరేగిన పంచ రథాలు
మాడ వీధుల్లో బయలు దేరిన రథం ఉదయం 9.20 గంటలకు వచ్చి చేరింది. అనంతరం ఉదయం 9.35 గంటలకు సుబ్రహ్మణ్యస్వామిని ఊరేగించారు. మధ్యాహ్నం 12.20 గంటలకు మహారథాన్ని ఊరేగించారు. మహారథంలో అన్నామలైయార్ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రథాన్ని ఒక పక్క మహిళా భక్తులు, మరో పక్క పురుషులు లాగారు. సాయంత్రం 4 గంటలకు ఉన్నామలై అమ్మవారి రథోత్సవం జరిగింది. ఈ రథాన్ని మహిళా భక్తులు మాత్రమే లాగారు. స్వామి వారి మహారథం, చండికేశ్వరుడి రథం, పంచ రథాలు విడివిడిగా మాడ వీధుల్లో ఊరేగించారు. వేలాది మంది భక్తులు పాల్గొని పంచ మూర్తులను దర్శించుకున్నారు. కొంతమంది భక్తులు వరాలతో జన్మించిన సంతానాన్ని చెరకుతో ఉయ్యాల కట్టి అందులో సంతానాన్ని ఉంచి ఆలయ మాడ వీధుల్లో తిరిగి మొక్కులు తీర్చుకున్నారు.
రథోత్సవంలో 5లక్షల మంది భక్తులు
ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఐదు రథోత్సవాలకు 5లక్షల మందికి పైగా భక్తులు తిరువణ్ణామలై చేరుకుని రథాలపై బొరుగులు, మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆరువేల మందితో పోలీస్ బందోబస్తు నిర్వహించినట్లు ఎస్పీ సుధాకర్ తెలిపారు.
పారంపర్య గుర్రపు సంత ప్రారంభం
రథోత్సవం రోజు నుంచి నాలుగు రోజుల పాటు జరిగే గుర్రపు సంత ఆదివారం ఉదయం ప్రారంభమైంది. దీపోత్సవాన్ని పురష్కరించుకొని వంద సంవత్సరాల క్రితం గుర్రపు సంతను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈరోడ్డు, పుదుక్కోటై, తిరుపత్తూరు, హొసూరు, కర్ణాటక రాష్ట్రాల నుంచి గుర్రాలను తీసుకొచ్చి సంతలో ఉంచారు. ఈ సంత ఈనెల 3న దీపోత్సవం రోజున ముగుస్తుంది.
కోలాహలం.. రథోత్సవం
కోలాహలం.. రథోత్సవం


