స్థాయి తగ్గించి బలవంతపు మార్పుపై ఎస్‌ఏల ఆగ్రహం
విద్యాశాఖ వింత వైఖరిపై నిరసన
9,620 ఎంపీఎస్‌ల్లో 4800 స్కూళ్లకు హెచ్‌ఎంలుగా ఎస్‌ఏలే..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలలపై చంద్రబాబు సర్కారు చేపట్టిన చిత్రవిచిత్ర ప్రయోగాల పరంపర కొనసాగుతోంది. ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ (పీఎస్ హెచ్‌ఎం)లను ఎల్‌ఎఫ్‌ఎల్ (లో ఫిమేల్ లిటరసీ) హెచ్‌ఎంగా మార్చాలని ఆదేశాలు జారీ చేయడంతో స్కూల్ అసిస్టెంట్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ బోధనను రద్దు చేసిన సర్కారు ఆ స్కూల్ అసిస్టెంట్లను సర్‌ప్లస్ చేసింది. మిగులు ఎస్‌ఏలు ఆందోళన చేయడంతో కొత్తగా 9,620 మోడల్ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేసి వాటిల్లో 4,800 పాఠశాలల్లో మిగులు స్కూల్ అసిస్టెంట్లను పీఎస్ హెచ్‌ఎంలుగా బలవంతంగా నియమించింది. వారికి పీఎస్ హెచ్‌ఎం/ఎస్‌ఏ డిజిగ్నేషన్
ఇచి్చంది. మిగిలిన 4,820 స్కూళ్లలో ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలను నియమించింది.
అయితే ఇప్పుడు పీఎస్ హెచ్‌ఎం/ఎస్‌ఏ కేడర్‌ను మరీ తగ్గించి ఎల్‌ఎఫ్‌ఎల్‌గా మార్చేందుకు సర్కారు పూనుకుంది. ఎలాంటి జీవోలు లేకుండా కేవలం నోటి మాటతో మొత్తం ప్రక్రియను మార్పు చేయడంపై పీఎస్ హెచ్‌ఎం/ఎస్‌ఏల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వాస్తవానికి స్కూల్ అసిస్టెంట్లు ప్రైమరీ స్కూళ్లలో హెచ్‌ఎంలుగా పనిచేసేందుకు నిబంధనలు లేకపోవడంతో వారి డిజిగ్నేషన్ పీఎస్ హెచ్‌ఎం/ఎస్‌ఏగానే ఉంటుందని సర్కారు తొలుత ప్రకటించింది. అదేవిధంగా జూన్ నెలలో చేపట్టిన బదిలీ ఉత్తర్వుల్లోనూ పేర్కొంది. జూన్ నుంచి యూడైస్‌లోనూ వీరు పీఎస్ హెచ్‌ఎం/ఎస్‌ఏగానే కొనసాగుతున్నారు.
ఇప్పుడు ఉన్నట్టుండి వారి డిజిగ్నేషన్‌ను పీఎస్ హెచ్‌ఎం/ఎస్‌ఏ నుంచి తగ్గించి ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంగా యూడైస్‌లో మార్చేందుకు సర్కారు సిద్ధపడింది. అన్ని జిల్లాల్లోనూ పీఎస్ హెచ్‌ఎంలు అంతా వెంటనే యూడైస్‌లో ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలుగా తమ డిజిగ్నేషన్లను మార్చుకోవాలని ఎంఈఓ కార్యాలయాలు, ఉపాధ్యాయులపై ఒత్తిడి చేస్తోంది. కొన్నిచోట్ల ఉపాధ్యాయుల ప్రమేయం లేకుండానే యూడైస్‌లో ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంగా డిజిగ్నేషన్ మార్పు చేసినట్టు ఆందోళన వ్యక్తమవుతోంది. దీనివల్ల తాము బదిలీల్లో తిరిగి స్కూల్ అసిస్టెంట్లుగా వెళ్లే అవకాశం ఉండదని, యూడైస్ వివరాలనే లీప్ యాప్, టీఐఎస్‌లో ప్రామాణికంగా తీసుకుంటారని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. గ్రామీణ బాలికల్లో అక్షరాస్యతను పెంచేందుకు 1998 ఆగస్టులో తీసుకొచి్చన ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం విధానాన్ని ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్లకు ఆపాదించడం విమర్శలకు దారితీస్తోంది.


