breaking news
Model primary school
-
ఎల్ఎఫ్ఎల్గా పీఎస్ హెచ్ఎంలు !
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలలపై చంద్రబాబు సర్కారు చేపట్టిన చిత్రవిచిత్ర ప్రయోగాల పరంపర కొనసాగుతోంది. ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ (పీఎస్ హెచ్ఎం)లను ఎల్ఎఫ్ఎల్ (లో ఫిమేల్ లిటరసీ) హెచ్ఎంగా మార్చాలని ఆదేశాలు జారీ చేయడంతో స్కూల్ అసిస్టెంట్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ బోధనను రద్దు చేసిన సర్కారు ఆ స్కూల్ అసిస్టెంట్లను సర్ప్లస్ చేసింది. మిగులు ఎస్ఏలు ఆందోళన చేయడంతో కొత్తగా 9,620 మోడల్ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేసి వాటిల్లో 4,800 పాఠశాలల్లో మిగులు స్కూల్ అసిస్టెంట్లను పీఎస్ హెచ్ఎంలుగా బలవంతంగా నియమించింది. వారికి పీఎస్ హెచ్ఎం/ఎస్ఏ డిజిగ్నేషన్ ఇచి్చంది. మిగిలిన 4,820 స్కూళ్లలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలను నియమించింది.అయితే ఇప్పుడు పీఎస్ హెచ్ఎం/ఎస్ఏ కేడర్‌ను మరీ తగ్గించి ఎల్ఎఫ్ఎల్గా మార్చేందుకు సర్కారు పూనుకుంది. ఎలాంటి జీవోలు లేకుండా కేవలం నోటి మాటతో మొత్తం ప్రక్రియను మార్పు చేయడంపై పీఎస్ హెచ్ఎం/ఎస్ఏల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వాస్తవానికి స్కూల్ అసిస్టెంట్లు ప్రైమరీ స్కూళ్లలో హెచ్ఎంలుగా పనిచేసేందుకు నిబంధనలు లేకపోవడంతో వారి డిజిగ్నేషన్ పీఎస్ హెచ్ఎం/ఎస్ఏగానే ఉంటుందని సర్కారు తొలుత ప్రకటించింది. అదేవిధంగా జూన్ నెలలో చేపట్టిన బదిలీ ఉత్తర్వుల్లోనూ పేర్కొంది. జూన్ నుంచి యూడైస్లోనూ వీరు పీఎస్ హెచ్ఎం/ఎస్ఏగానే కొనసాగుతున్నారు.ఇప్పుడు ఉన్నట్టుండి వారి డిజిగ్నేషన్‌ను పీఎస్ హెచ్ఎం/ఎస్ఏ నుంచి తగ్గించి ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా యూడైస్‌లో మార్చేందుకు సర్కారు సిద్ధపడింది. అన్ని జిల్లాల్లోనూ పీఎస్ హెచ్ఎంలు అంతా వెంటనే యూడైస్‌లో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా తమ డిజిగ్నేషన్లను మార్చుకోవాలని ఎంఈఓ కార్యాలయాలు, ఉపాధ్యాయులపై ఒత్తిడి చేస్తోంది. కొన్నిచోట్ల ఉపాధ్యాయుల ప్రమేయం లేకుండానే యూడైస్‌లో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా డిజిగ్నేషన్ మార్పు చేసినట్టు ఆందోళన వ్యక్తమవుతోంది. దీనివల్ల తాము బదిలీల్లో తిరిగి స్కూల్ అసిస్టెంట్లుగా వెళ్లే అవకాశం ఉండదని, యూడైస్ వివరాలనే లీప్ యాప్, టీఐఎస్‌లో ప్రామాణికంగా తీసుకుంటారని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. గ్రామీణ బాలికల్లో అక్షరాస్యతను పెంచేందుకు 1998 ఆగస్టులో తీసుకొచి్చన ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం విధానాన్ని ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్లకు ఆపాదించడం విమర్శలకు దారితీస్తోంది. -
ఇంకానా.... ఏకోపా‘ధ్యాయం’
* జిల్లాలో 407 ఏకోపాధ్యాయ పాఠశాలలు * ఉపాధ్యాయులే లేని బడులు 31 * విలీనం చేసినా... పెరగని విద్యార్థుల సంఖ్య విజయనగరం అర్బన్:ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాలు, బోధన సిబ్బంది ఉండరనేది జగమెరిగిన సత్యం. అందుకే అందరూ తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారన్న దిఅందరికీ తెలిసిందే. ప్రధానంగా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో సమస్యలను పట్టించుకోకుండా మోడల్ ప్రాధమిక పాఠశాలల పేరుతో విలీన చర్యలు చేపడుతోంది. జిల్లాలో గత ఏడాది 232 మోడల్ పాఠశాలల కోసం 117 ప్రాధమిక పాఠశాలలను విద్యాశాఖ విలీనం చేసింది. ఇంకా జిల్లాలో 407 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. గత ఏడాది యూ-డైస్ నివేదిక ఆధారంగా చూస్తే ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఈ పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయి. అత్యధికంగా మెరకముడిదాం మండలంలో 35 టీచర్ పోస్టులతో కళకళలాడే 20 పాఠశాలలు ఇప్పుడు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారాయి. అదే విధంగా జీఎల్‌పురం మండలంలో 33 పోస్టులతో ఉన్న 29 పాఠశాలలు, పాచిపెంట మండలంలో 32 పోస్టులతో ఉన్న 22 స్కూళ్లు, మక్కువ మండలంలో 30 పోస్టులతో ఉన్న 22 స్కూళ్లు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా గత ఏడాది మారాయి. గత ఏడాది 117 పాఠశాలలు (వీటిలో 80 శాతం ఏకోపాధ్యాయపాఠశాలున్నాయి) విలీనం చేసప్పటికీ ఈ సంఖ్య తగ్గలేదు. ఏడాదికేడాది వీటి సంఖ్య పెరుగుతున్నా విద్యార్థులతో బలోపేతం చేయడానికి ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు విద్యావేత్తల నుంచి వస్తున్నాయి. జిల్లాలో అసలు ఉపాధ్యాయుడు లేనిపాఠశాలలు 31 ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇలాంటివి అత్యధికంగా 14 స్కూళ్లు సాలూరు మండలంలో ఉన్నాయి. అత్యల్పంగా దత్తిరాజేరు, గరుగుబిల్లి, వేపాడ మండలాల్లో ఒక్కొక్కటి ఉన్నాయి. ఆంగ్లమాధ్యమమే పరిష్కారం ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయాలి. పిల్లల తల్లిదండ్రుల ధోరణికి అనుగుణంగా మార్పు తీసుకురావాలి. విద్యార్థి చదువుకు అవసరమైన సౌకర్యాలను, బోధనా సిబ్బందిని కల్పించాలి. ప్రభుత్వ బడులపై ఉన్న అపోహలను పోగొట్టి నమ్మకాన్ని కలిగేలా చేయాలి. తక్కువ విద్యార్థులున్న బడులను సమీపపాఠశాలల్లో విలీనం చేయడం వల్ల సర్కారు బడులకు మరింత దూరమయ్యే అవకాశం ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభంలోపు చర్యలు పూర్తి చేయాలి. -అడ్డూరి పైడితల్లి, జిల్లా అధ్యక్షుడు, ఏపీఎస్టీయూఏ. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో సమస్యలివే..? * ఒకే ఉపాధ్యాయుడు ఐదు తరగతులు బోధించడం కష్టంగా మారింది. * ఒక తరగతికి పాఠశాలు చెబుతున్న సమయంలో మిగిలిన విద్యార్థులు నరీక్షించాల్సి ఉంటుంది. వారి చదువుకు కూడా ఇది ప్రతిబంధకం అవుతోంది. * ఒకే ఉపాధ్యాయుడు అవడంతో మిగిలిన తరగతుల్లో విద్యార్థులే ఉపాధ్యాయ అవతారం ఎత్తాల్సి వస్తోంది. * సమావేశాలు, వ్యక్తిగత సెలవు పెడితే ఆ రోజు పాఠశాల మూతపడాల్సిందే. * ఒక్క ఉపాధ్యాయుడు అవడంతో ఎక్కువ మంది విద్యార్థులకు సరిగా బోధించలేకపోతున్నారు. ఫలితంగా ఆ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పడిపోతున్నాయి. * ఉన్న ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం పర్యవేక్షణ, నివే దికలు సిద్ధం చేసుకోవడం, అధికారులు అడిగిన సమాచారం ఇవ్వడం తదితర పనులకే సమయం సరిపోతోంది.


