
సాక్షి,చెన్నై: సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన టీవీకే ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై తమిళనాడు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్‌పై కోర్టు విమర్శలు గుప్పించింది. శుక్రవారం (సెప్టెంబర్ 03) కరూర్ తొక్కిసలాటపై విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా ‘విజయ్ మీకు నాయకత్వ లక్షణాలు లేవు.. ఉంటే ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయేవారు కాదు.‘41 మంది చనిపోతే కోర్టు కళ్లు మూసుకోదు. ఈవెంట్ నిర్వాహకులపై సానుభూతి ఎందుకు చూపించాలి?’అని ప్రశ్నించింది. బాధితుల పట్ల కనీస పచ్చాత్తాపం కూడా వ్యక్తం చేయని విజయ్ మానసిక స్థితిని ఇది ప్రతిబింబిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై సిట్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎస్ ఐజీ ఆస్రా గార్గ్ నేతృత్వంలో సిట్ విచారణకు ఆదేశించింది.
ఈ సందర్భంగా టీవీకే నేతలందరూ ఘటన తర్వాత ఎక్కడికి వెళ్లారు?. బాధితులను ఎందుకు పట్టించుకోలేదు?. విజయ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదు? అని మండిపడింది. అనంతరం, టీవీకే నేతల ముందస్తు బెయిల్‌పై తీర్పును రిజర్వ్ చేసింది. తొక్కిసలాట ఘటన కేసును సీబీఐకి అప్పగించాలని టీవీకే విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
— TVK Vijay (@TVKVijayHQ) September 30, 2025