TVK Vijay: మొన్న మధురై.. నిన్న కరూర్‌ | Vijay comes under fire for walking out of Karur rally post stampede | Sakshi
Sakshi News home page

TVK Vijay: మొన్న మధురై.. నిన్న కరూర్‌

Sep 28 2025 7:38 AM | Updated on Sep 28 2025 9:34 AM

Vijay comes under fire for walking out of Karur rally post stampede

తమిళనాడు కరూర్‌ తొక్కిసలాట(Karur Stampede) ఘటన యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. టీవీకే అధినేత విజయ్‌ నిర్వహించిన సభకు హాజరై.. 39 మంది మృతి చెందడం, పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడడం.. ఇటు రాజకీయంగానూ తీవ్ర విమర్శలకు తావిస్తోంది. దీనికి తోడు తొక్కిసలాట జరిగిన తర్వాత వెంటనే విజయ్‌ అక్కడి నుంచి వెళ్లిపోవడం మరింత ఆగ్రహావేశాలకు కారణమౌతోంది..  

కరూర్‌లో విజయ్‌ బహిరంగ సభకు(Vijay Meeting) కేవలం 10 వేల మందికి మాత్రమే పోలీసులు అనుమతించారు. అయితే.. అంతకు రెండు రెట్లు పైనే జనాలు వచ్చారు. దీనికి తోడు అనుకున్న సమయం కంటే ఆరు గంటలు ఆలస్యంగా విజయ్‌ సభకు వచ్చారు. దీంతో ఆ రద్దీ మరింత ఎక్కువైంది. అప్పటికే అక్కడ గుమిగూడిన జనాల్లో చాలామంది నీరు, తిండి లేకపోవడంతో నీరసంగానే ఎదురు చూస్తూ ఉండసాగారు. 

ఈలోపు సాయంత్రం 7.30-7.45 సమయంలో విజయ్‌ ప్రచార రథం రావడం.. ఆ రోడ్డు ఇరుకుగా ఉండడంతో.. ఆ వాహనానికి దారి ఇచ్చే క్రమంలో జనాలు వెనక్కి పోవడం, జనాల్లో కొందరు ఆయన్ని దగ్గరి నుంచి చూడాలనే కుతూహలంతో తోసుకున్నారు. ఈ తోపులాటలో బారికేడ్లు విరిగిపోయి తొక్కిసలాటకు దారి తీసింది.  ఆ అలజడిని గమనించిన విజయ్‌.. ‘‘పోలీస్‌.. ప్లీజ్‌ హెల్ప్‌, ఆంబులెన్స్‌’’ అంటూనే వాహనంపై ఉన్న వాటర్‌ బాటిళ్లను జనాల్లోకి విసిరారు. అయితే తొక్కిసలాట జరుగుతున్న గందరగోళ పరిస్థితుల నడుమే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడ టీవీకే వలంటీర్లు తక్కువగా ఉండడం, ఆంబులెన్స్‌లకు దారి లేకపోవడంతో సకాలంలో ప్రాణాలు కాపాడలేకపోయారని తెలుస్తోంది. 

కరూర్‌ తొక్కిసలాట ఘటనను.. తమిళనాడు రాజకీయ చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటనగా అభివర్ణిస్తున్నారు. 39 మంది మృతుల్లో.. పది మంది చిన్నారులు, 16 మంది మహిళలు ఉండడం గమనార్హం. 95 మందిని ఆస్పత్రికి తరలించారు. గాయపడినవాళ్లలో 58 మంది ఇంకా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై రాష్ట్రపతి, దేశ ప్రధాని.. ఇతర రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. 

మీడియాకు నో అనుమతి
ఇదిలా ఉంటే.. విజయ్‌ ఆలస్యంగా రావడమే ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు ఘటన తర్వాత సహాయక చర్యలు కొనసాగుతున్న సమయంలోనే విజయ్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. త్రిచీ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి, అక్కడి నుంచి చెన్నైకి బయలుదేరారు. దీంతో బాధితులను పరామర్శించకుండా, మీడియాను ఎదుర్కొనకుండా.. బాధ్యతల నుంచి విజయ్‌ తప్పించుకున్నారనే విమర్శ బలంగా వినిపిస్తోంది ఇప్పుడు. 

మరోవైపు చెన్నైలోని విజయ్‌ ఇంటి వద్ద కూడా మీడియాను అనుమతించడం లేదు. పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. దళపతి మద్దతుదారులు అక్కడికి చేరుకుని.. పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ హల్‌ చల్‌ చేస్తున్నారు. ఇటు గుండె బద్దలైందంటూ.. క్షతగాత్రులు కోవాలంటూ కేవలం ట్వీట్‌తో విజయ్‌ సరిపెట్టడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. 

టీవీకే పార్టీ ప్రతినిధి రంజనా నాచియార్ మాట్లాడుతూ.. విజయ్‌ ఆస్పత్రికి వెళ్లి ఉంటే అక్కడా పరిస్థితి మరింత గందరగోళంగా తయారయ్యేదని, అందుకే వెళ్లలేకపోయారని అన్నారు. తప్పంతా తమిళనాడు ప్రభుత్వం, పోలీసులదేనని ఆ పార్టీ అంటోంది.

మధురై మానాడులోనూ..
విజయ్‌ మొన్నీమధ్యే మధురైలో నిర్వహించిన టీవీకే రెండో మానాడులోనూ దాదాపు తొక్కిసలాట జరిగినంత పనైంది. ఆగస్టు 21న మధురై-తూత్తుకుడి హైవే వద్ద జరిగిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ రెండవ రాష్ట్ర బహిరంగ సభ జరగ్గా.. సుమారు 4,00,000 పైగా జనం హాజరయ్యారు. సభకు భారీగా జనాలు రావడం, మంచి నీళ్లు లేక అవస్థలు పడడం, ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకుని కింద పడిపోయారు. ఈ ఘటనలో సుమారు  400 మంది ఊపిరాడక అస్వస్థతకు గురైనట్లు ఆ సమయంలో పోలీసులు వెల్లడించారు. అంతకు ముందు ఈ మానాడు ఏర్పాట్ల సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు కూడా. అయితే ఈ అనుభవాల నుంచి కూడా టీవీకే కరూర్‌లో క్రౌడ్‌మేనేజ్‌మెంట్‌ను సరిగ్గా చేసుకోలేకపోయిందన్న విమర్శ వినిపిస్తోంది. 

విజయ్‌ను అరెస్ట్‌ చేయాల్సిందే!
క్షతగాత్రుల్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఎక్స్‌లోనూ ఈ విషయాన్ని ట్వీట్‌ చేశారాయన. మరోవైపు.. ఘటనపై కేంద్ర హోం శాఖ ఆరా తీసింది. ఘటనపై నివేదిక ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని హోం మంత్రి అమిత్‌ షా కోరారు. కరూర్‌ టీవీకే కార్యదర్శిపై ఇప్పటికే కేసు నమోదు అయ్యింది. రిటైర్డ్‌ జస్టిస్‌ అరుణా జగదీశన్‌ నేతృత్వంలో జ్యూడీషియల్‌ కమిటీ వేశామని, కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని సీఎం స్టాలిన్‌ తెలిపారు. విజయ్‌ను అరెస్ట్‌ చేయాలంటూ డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్‌, బీజేపీ.. ఇలా అన్ని పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే టీవీకే మాత్రం ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత అంటోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement