కరూర్‌ ఘటన.. టీవీకే సంచలన ఆరోపణలు | Vijay TVK Sensational Allegations On Karur Incident | Sakshi
Sakshi News home page

Karur stampede: కరూర్‌ ఘటన.. టీవీకే సంచలన ఆరోపణలు

Sep 28 2025 7:47 AM | Updated on Sep 28 2025 8:04 AM

Vijay TVK Sensational Allegations On Karur Incident

సాక్షి, చెన్నై: తమిళనాడులోని కరూర్‌లో.. సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్‌ ప్రచారసభ సందర్భంగా ఘోర విషాద ఘటన సంభవించింది. తొక్కిసలాట కారణంగా 39 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో విషాద ఘటనపై టీవీకే స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనకు డీఎంకే ప్రభుత్వమే కారణమంటూ విమర్శించింది.

కరూర్‌ తొక్కిసలాట ఘటనపై టీవీకే స్పందిస్తూ..‘తొక్కిసలాట ఘటనకు కారణంగా స్టాలిన్‌ ప్రభుత్వమే. మేము అడిగిన ప్రాంతంలో కాకుండా.. చిన్నపాటి రోడ్డులో సభకు అనుమతి ఇచ్చారు. సభ జరుగుతున్న సమయంలో అంబులెన్స్‌లు అటుగా వచ్చేలా డీఎంకే ప్లాన్‌ చేసింది. ఈ క్రమంలో అంబులెన్స్‌ కోసం దారి ఇవ్వాలని విజయ్‌ కోరడంతో తొక్కిసలా జరిగింది. పోలీసులతో కలిసి డీఎంకే ప్రభుత్వం విజయ్‌పై కుట్ర చేసింది అని ఆరోపించింది. మరోవైపు.. ఈ ఘటనకు ప్రభుత్వమే కారణం అంటూ టీవీకే పార్టీ నేతలు సైతం ఆరోపిస్తున్నారు.

డీజీపీ కీలక వ్యాఖ్యలు..
ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై తమిళనాడు లా అండ్ ఆర్డర్ డీజీపీ వెంకట్రామన్ అర్ధరాత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ..‘టీవీకే పార్టీ ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది మరణించారు. కరూర్‌లో జరిగినది చాలా విషాదకరమైన ఘటన. వీరిలో 13 మంది పురుషులు, 16 మంది మహిళలు, ఐదుగురు బాలురు, ఐదుగురు బాలికలు ఉన్నారు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ డేవిడ్సన్ నాయకత్వంలో ముగ్గురు ఐజీలు, ఇద్దరు డీఐజీలు, 10 మంది ఎస్పీలతో సహా 2000 మంది పోలీసులు భద్రతలో పాల్గొన్నారు.

తమిళనాడు టీవీకే పార్టీ గతంలో నిర్వహించిన సమావేశాలు ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉండటంతో, వారి అభ్యర్థన మేరకు ఇప్పుడు కరూర్‌లో పెద్ద స్థలాన్ని కేటాయించారు. రాష్ట్ర స్థాయిలో అదే స్థలంలో ఒక పెద్ద పార్టీ ప్రచారం చేసింది. పది వేల మంది వస్తారని భావించినప్పటికీ, 27 వేల మంది గుమిగూడారు. విజయ్ ప్రచారం చేసిన ప్రదేశంలో 500 మంది పోలీసు సిబ్బంది కాపలాగా ఉన్నారు. గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతి కోరారు.  

కానీ, ఉదయం 11 గంటల నుండి గుమిగూడిన జనసమూహం రాత్రి 7:40 గంటలకు వస్తూనే ఉన్నారు. విజయ్‌ వస్తున్నారనే వార్తతో ఎక్కువ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. దాదాపు 27వేల మందికిపైగా ఉన్న సమూహాన్ని పోలీసులు కంట్రోల్‌ చేశారు. సభ జరుగుతున్న సమయంలో పోలీసులకు విజయ్‌ ధన్యవాదాలు కూడా తెలిపారు. ఈ ఘటనలో పోలీసులు వైఫల్యం లేదు. కానీ, దురదృష్టవశాత్తు ఇలా జరిగింది. దీనికి సంబంధించి కారణాల కోసం ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ వేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇంకా ఏమీ మాట్లాడలేం. అయితే, ఈ ఘటనకు పోలీసులే కారణమా? అని మీడియా ప్రశ్నించగా.. ఆయన సమాధానం ఇవ్వలేదు.

ఏకసభ్య కమిషన్ ఏర్పాటు.. 
ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ స్పందించారు. కరూర్‌ జిల్లా కలెక్టరుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితుల చికిత్స కోసం ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లోని క్షతగాత్రులను ఆదివారం ముఖ్యమంత్రి పరామర్శించనున్నట్లు సమాచారం. మరోవైపు, ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడినవారికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం చేయనున్నట్లు సీఎం స్టాలిన్‌ ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు మద్రాస్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ అరుణా జగదీశన్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement